మానవత్వం అంటే మానవ తత్త్వం. మనిషి మనిషి గుణాలను కలిగి ఉండడం. అంటే
దయాదాక్షిణ్యాలు, కరుణ, ప్రేమ మొదలైన సహజ గుణాలను కలిగి ఉండడం. ఈ
విశ్వంలో జంతువులు, పక్షులు, మనుషులు, పురుగులు… ఇలా వాటిలోని భేదాలతో కలిపి
కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటిలో మనిషి అనే జీవి మాత్రమే ఉత్కృష్టమైనది.
ఎందుకంటే ప్రతి జీవి తన జీవలక్షణాలను అనుసరించి మాత్రమే జీవించగలుగుతుంది.
అంతకు మించి వేరే ఏ లక్షణాన్ని తను అనుకరించలేదు. అనుసరించలేదు. కానీ మనిషి
మాత్రం ఇతర ఏ జీవి చేయనట్టు ఆలోచించగలడు, స్పందించగలడు, ఇతర జీవులను
అనుకరించగలడు, వాటిని తన వశం చేసుకోగలడు. అలాగే ఇతర జీవులకు లేని భావోద్వేగాలు,
మాటలాడడం మొదలైనవి మనిషికి ఉన్న గొప్ప లక్షణాలు. తనకు ఉన్న బుద్ధిని
ఉపయోగించి నిర్ణయాలను కూడా తీసుకోగలడు. ఇలా మనిషి చేసినట్టు ఈ విశ్వంలో ఏ
జీవి చేయదు. అయితే, ముందు చెప్పినట్టు ప్రతి జీవి తన లక్షణాలకు నూటికి నూరు
శాతం అనుగుణంగా వర్తిస్తాయి.
తెలుగుకవులు కొందరు సమాజం పట్ల బాధ్యతతో, మనిషిని మనిషిగా మార్చేందుకు,
కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకు అనేక ప్రక్రియల్లో కవిత్వం రాశారు. తదనంతర
కాలంలో దానిని మానవతావాదంగా మార్చారు. మానవత్వం అంటే విచక్షణ లేని దయ,
జాలి చూపించడం కాదు. సహేతుక దృష్టితో పీడిత ప్రజల బాధలను తొలగించడానికి
మార్గాలను అన్వేషించారు. అన్యాయం, అజ్ఞానం, దుర్మార్గం వంటి వాటిని
ఖండిస్తూ కులం, మతం, ప్రాంతం, రాజకీయం, లింగం మొదలైన విభేదాలతో
మనిషిత్వాన్ని మరచిపోయిన వారికి, వాటికి అతీతంగా మనిషి ఎలా ఉండాలో తమ
వ్యక్తిత్వం ద్వారా ఋజువు చేస్తూ, తమ కవిత్వం ద్వారా ప్రేరణ కలిగిస్తూ
వచ్చారు. సమాజం వేదికగా మానవాభివృద్ధే వారి ధ్యేయం అయ్యింది. అలాంటి
కవులు తెలుగు సాహిత్యంలో చాలమంది ఉన్నారు. వారిలో మాడభూషి సంపత్ కుమార్
గారు కూడా ఉండడం గొప్పవిశేషం.
‘‘మనిషి’’ అనే కవితలో నేడు మనిషి ఎలా ఉన్నాడో అద్భుతంగా వివరించారు. దానిని
బట్టి మనిషి ఎలా ఉండాలో అర్థమవుతుంది.
‘‘యుద్ధాన్ని గురించి భయం లేదు
మరణాన్ని గురించి భయం లేదు
క్రూర మృగాల గురించి
విషనాగుల గురించి
సునామీ గురించి
ఉప్పొంగే నదుల గురించి భయంలేదు
నా భయమంతా మనుషుల గురించే’’ (శత్రువు. 2015:64)
అంటూ ఒక మనిషిని చూసి మరో మనిషి భయపడే స్థితిని మనిషి ఎలా ఉన్నాడో, ఎలా
ఉండాలో 1997 లోనే వివరించారు. ఇక ఇప్పుడు ఆ మనిషి ఎలా మారాడో ప్రత్యేకించి
చెప్పనవసరం లేదు. అంటే సమాజంలో మనసున్న మనుషులు లేరని చెప్పడం కవి
ఉద్దేశం. కాబట్టి మనిషి అన్నవాడికి మంచి మనసు ఉండాలి. అదే మానవత్వం అనేది
కవి ఉద్దేశం.
కన్నతల్లి దుఃస్థితి :
ఏదైనా ఇంటి నుండే మొదలవ్వాలని అంటారు పెద్దలు. దానికి నిదర్శనమే సంపత్
కుమార్ గారు తల్లుల గురించి రాసిన కవితలు. ఈ విశ్వంలో ప్రతి జీవరాశి పుట్టుకకు,
మనుగడకు కారణభూతమైన వాటిలో తల్లిది మొదటిస్థానమే. నవమాసాలు మోసి, కని,
పెంచి, పెద్ద చేసి, బిడ్డ అభివృద్ధిలో అనేక రకాల పాత్రలను పోషించి, బిడ్డ
ఉన్నతికి దోహదం చేస్తుంది తల్లి. బిడ్డ ప్రతి పనిని వెనకేసుకు వచ్చే ఏకైన వ్యక్తి అమ్మ మాత్రమే. అలాంటి తల్లిది కుటుంబంలో చాలా కీలకమైన పాత్ర.
తల్లి లేని పిల్లలు ఉన్న కుటుంబాలకు, తల్లి ఉన్న కుటుంబాలకు చాలా వ్యత్యాసం
కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో తల్లికి గొప్పస్థానం కల్పించారు
‘‘ఒక తల్లి
పదిమంది పిల్లల్ని
కని పెంచి పోషిస్తుంది!
పది మంది
పిల్లలు ఒక తల్లిని పోషించలేకపోతున్నారు!
రాను రాను మనుషులు బలహీనపడిపోతున్నారు!
అందుకే తల్లి
ఇప్పుడు ఒకే బిడ్డతో సరిపెట్టుకొంటోంది’’ (మూడో. 2017:15)
పై కవితలో తల్లి పాత్ర ఎంత గొప్పదో వివరించారు కవి. ఇప్పుడంటే ఒకరు లేదా
ఇద్దరుతో సరిపెట్టుకుంటున్నారు కానీ పూర్వం ఒక్కో తల్లి పదిమంది
సంతానాన్ని కనేది. తనకు కలిగిన పది మందిని తారతమ్యం లేకుండా పెంచేది.
సమానత్వంతో పాటు, సమానధర్మాన్ని పాటిస్తూ బిడ్డలను పోషించేది. ఆ కాలంలో
తల్లులు 1:10 నిష్పత్తితో ఏ కష్టం కలగకుండా కంటికి రెప్పలాగా పిల్లలను
కాపాడుకునేవారు. ఆ పిల్లలు ప్రయోజకులైన తరువాత 10:1 నిష్పత్తిలో అంటే
పదిమంది కలిపి ఒక తల్లిని కూడా చుసుకోలేక పోతున్నారని, లక్షలు సంపాదిస్తున్నా
వృద్ధాశ్రమాలలో వదులుతున్నా రని, అందుకే ఇప్పటి తల్లి ఒక బిడ్డతోనే
సరిపెట్టుకుంటుందని కవి వర్ణించారు. ప్రతి ఒక్కరు మానవీయ దృక్పథాన్ని
అలవరచుకోవాలని, తల్లిదండ్రులను సరిగా చూసుకోవడంతో ఇంటి దగ్గర నుండే
మొదలవ్వాలని పై కవితలో హితోపదేశం చేశారు. అమ్మలను ఆదరించాలనే ప్రథమ
కర్తవ్యాన్ని, మానవత్వ దృక్పథాన్ని ప్రతి ఒకరూ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ
కవిత ద్వారా తెలియజేశారు.
రైతుల జీవితం :
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడు వ్యాపార, వాణిజ్య రంగాలలో కుడా
కొంత ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ 41.49 శాతం అంటే భారతదేశ జనాభాలో
దాదాపు సగం ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆహార,
ఆహారేతరమైన పంటలను పండిస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికీ వర్షాధారిత
వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి దశలో ప్రకృతి
వైపరీత్యాలు సంభవించినపుడు పంటకు నష్టం వాటిల్లి రైతులు నష్టపోతున్నారు.
నష్టాన్ని భరించలేని సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
భారతదేశంలో 2021 సంవత్సరంలోనే (డిసెంబర్ నాటికి) 10881 మంది రైతులు
ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి రైతుల పక్షాన కవిత్వంతో అండగా నిలబడిన
కవులలో సంపత్ కుమార్ గారు కుడా అగ్రగణ్యులు. ‘‘రైతు ఆత్మకథ’’ అనే కవితలో
రైతు గొప్పతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు కవి.
‘‘రైతు ఆత్మకథ
వాడి స్వేదం నుండి జాలువారుతుంది
మట్టే వాడికి వస్తువు
ఒళ్ళంతా మట్టి పూసుకొని’’ (వికారి. 2019:60)
అంటూ రైతు జీవితాన్ని అద్భుతంగా వర్ణించారు. సమాజంలో మోసపోవడమే తప్ప
మోసం చేయడం చేతకాని వృత్తికారునిగా రైతుని చిత్రించారు కవి. సంఘాలు
పెట్టుకోవడం చేతకాదు, సంఘటితం కాలేడు, సంఘానికి ద్రోహం చెయ్యలేడు అని
రైతుని ఒక పవిత్రమైన వృత్తికారునిగా వర్ణించారు. తాను పడ్డ కష్టమంతా
పరోపకారం అనుకుంటాడని, అర్థం కోసం, స్వార్థం కోసం బతకని, బతక నేర్వని
వ్యక్తిగా రైతును, అతని గొప్పతనాన్ని ఆకాశంలో నిలబెట్టారు కవి.
‘‘రైతే కూలి’’ అనే కవితలో-
ఎవరో ఇచ్చిన
విత్తనాలు విత్తాలి
ఎవడో చెప్పిన
ఎరువు వెయ్యాలి
………………
అప్పు కోసం పడిగాపులు కాస్తోంది
వేలకోట్లు ఎగ్గొట్టిన వాడి ముందు మోకరిల్లుతున్న బ్యాంకులు (చివరకు. 2016:
80)
అని కవి తన బాధని వ్యక్తం చేశారు.
సాటివారి ఎదుగుదల పట్ల అసూయ :
ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేసి సఫలీకృతులు
కావడం తెలిసిన విషయమే. అలా ప్రతి వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో అభివృద్ధి
సాధిస్తే తద్ద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుంది. జాతీయ ఆదాయంలో మార్పు
వచ్చి, దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది. విద్య, ఆరోగ్యం విషయంలో ఆ
దేశప్రజలు సరైన మేళ్లను పొందగలుగుతారు. కానీ భారతదేశం లాంటి దేశాలలో
కొంతమంది తాము బాగుపడకున్నా పర్వాలేదు కానీ ఎదుటివాళ్ళు మాత్రం
బాగుపడకూడదనే ఆలోచనతో ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఎదుగుతుంటే ఓర్వలేక వారిని ఎలా
దిగజార్చాలా అని ఆలోచిస్తారు. వారిని ఏదో రకంగా కిందకు లాగేస్తారు. అలాంటి
వారిని గురించి కళ్ళకు కట్టినట్లు కింద కవితలో వర్ణించారు కవి.
‘‘కింద ఉంటే
పైవాణ్ణి కాళ్ళు పట్టి లాగేస్తాడు!
పైనుంటే కిందవాణ్ణి కాళ్ళతో అణగదొక్కేస్తాడు!
వాడు అభివృద్ధిలోకి రావడానికి అవతలివాడి అంతుచూస్తాడు!
రాత్రికి రాత్రి
భూమ్యాకాశాలను తారుమారు చేస్తానంటాడు
ఆకాశాన్ని సులభంగా కిందికి లాగుతాడు!
మరి భూమిని?’’
కొంతమంది పతనావస్థలో ఉంటూ పురోగతిని పొందే వారిని కిందికి లాగడానికి
ప్రయత్నం చేస్తారు. అలా నష్టపోయినవారు పైస్థాయికి వెళ్ళిన తరువాత కింద
ఉన్న వ్యక్తులకు చేయూత నివ్వడానికి బదులు పైకి ఎదగనీయకుండా
అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తారు. అదే దేశంలో ఉన్న దుర్మార్గం. తాను
పడ్డ ఇబ్బంది ఎదుటివారు పడకూడదు అని ఆలోచించే లక్షణాన్ని పూర్తిగా విడిచి
పెట్టేస్తారు. వారు అభివృద్ధి చెందే క్రమంలో ఎంతమందినైనా తొక్కుకుంటూ
వారి అంతుచూస్తారు అంటూ ఈర్ష్యాజీవుల స్వార్థబుద్ధిని గురించి కవి
తెలియజేశారు.
బాలల సమస్యలు :
సంపత్ కుమార్ గారికి పిల్లలన్నా, విద్యార్థులన్నా అమితమైన ప్రేమ. వారికి
ఎలాంటి ఇబ్బంది కలిగినా వాటిని తీర్చేక్రమంలో సంపత్ గారు ముందుంటారు.
విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా క్షణాల్లో తీర్చాలి. వారు
అందుబాటులో లేకపోవయినా మాట రూపంలోనైనా విద్యార్థులకు పని
అయ్యేంతవరకూ తోడుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆలోచనల, ఆచరణల
ప్రతిఫలమే ఆయన కవిత్వం. ఆలోచనలు అనే కవితాసంపుటిలో అద్భుతమైన కవితలు
రాశారు. ఇందులో అనాథ బాలల పట్ల, బాలకార్మిక వ్యవస్థ పట్ల ఆయనకున్న
మానవీయ దృక్పథంతో పాటు విద్య నేడు ఎలా మారిపోయింది ఆ
విద్యావ్యవస్థలో పడి నలిగిపోతున్న బాలలు ఎలా ఉన్నారన్న బాధ కలిపిస్తుంది.
అనాథ బాలలు:
తల్లిదండ్రులను దైవంతో సమానంగా భావిస్తుంది భారతీయ సమాజం. అది అక్షరాల
నిజం. మిగతా ఏ దేశంలో బిడ్డను 30 సంవత్సరాలు వచ్చినా పోషించే తల్లిదండ్రులు
లేరు ఒక్క భారతదేసంలో తప్ప. అలాంటి దేశంలో కూడా అనాథ బాలబాలికలు ఉన్నారు.
దానికి 2 కారణాలు. 1. తల్లిదండ్రులు చనిపోవడం, 2. తల్లిదండ్రులు ఇద్దరూ
పిల్లలను కని చెత్తకుప్పల్లో పడవెయ్యడం. ఈ రెండు పనుల వల్ల పిల్లలు
అనాథలై రోడ్ల మీద తిరుగుతూ ప్లాట్ ఫాం తల్లిగాను, చెత్తకుప్పను తండ్రిగాను
భావించుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. దానికి తార్కాణమైనదే కింది కవిత.
‘‘ప్లాట్ఫామే తల్లి
చెత్తకుప్పే తండ్రి
అనాథ బాలలు!’’ (ఆలో. 2017:51)
కవిగారు ప్లాట్ ఫాం తల్లి అనీ చెత్త కుప్ప తండ్రి అని కేవలం సాధారణంగా
ప్రయోగించలేదు. తల్లి లక్షణం బిడ్డను అక్కున చేర్చుకోవడం, తన ఒడిలో
సేదతీర్చడం, నిద్రపుచ్చడం ఒక ధైర్యాన్ని ఇవ్వడం. ఇవన్నీ ప్లాట్ ఫాంలో
కూడా ఉంటాయి. ఇక తండ్రి ప్రధాన లక్షణం పోషణ. మిగిలిపోయిన ఆహారాన్ని చెత్త
కుప్పల్లో పడేస్తాం. వాటిని తిని జంతుజాలాలు బతుకుతాయి. వాటితోపాటు అనాథలు
కూడా. ఇక్కడ వారి ఆకలిని తీర్చే బాధ్యత ఆ చెత్తకుప్ప తీసుకుంది కాబట్టి
చెత్తకుప్పే తండ్రి అన్నారు కవి. అదే ఒక సాధారణ కవికి, సమాజం పట్ల నిబద్ధత
ఉన్న కవికి ఉన్న వ్యత్యాసం.
విద్యావశ్యకత :
పేదరికం నశించాలన్నా కావాల్సింది విద్య. చదువు ప్రతిమనిషి జీవితంలో ప్రాథమిక
అవసరాలలో ఒకటి. ఈ రోజు మానవుని తెలివితేటలు అడవి నుండి అంతరిక్షయానం వరకూ
ఎదిగాయంటే దానికి చదువే కారణం. అయితే మనిషి ఎంత ఎదిగినా తన సమాజంలో జడలు
విప్పి నర్తిస్తున్న సామాజిక పీడన పిశాచాలను అణచివేయలేకపోతున్నాడు. అలాంటి
వాటిలో పేదరికం ఒకటి. పేదరికానికి కారణాలు ఎన్నున్నా ఒకప్పుడు పేదరికం వల్ల
చాలా మంది చదువుకోలేకపోయేవారు. చదువు లేక పేదరికం, పేదరికం వల్ల
చదువుకోలేకపోవడం కొన్ని తరాలపాటు పేదల జీవితాన్ని నాశనం చేసింది. కానీ దానికి
అడ్డుకట్ట వేసేందుకు భారత రాజ్యాంగంలో ‘‘అందరికీ విద్య’’ సూత్రాన్ని
ప్రతిపాదించారు. అయినప్పటికీ నాలుగు దశాబ్దాలపాటు భారతదేశంలో
నిరక్షరాస్యత విపరీతంగా ఉంది. చదువు యొక్క అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం
కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరూ చదువుకోవాలన్న ధ్యేయంతో తీసుకువచ్చిన
పథకమే అందరికీ విద్య (సర్వ శిక్షా అభియాన్). 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ
పైసా కూడా ఖర్చులేకుండా ప్రభుత్వ విద్యాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు.
అంతే కాదు ఆ చదువును తప్పనిసరి కూడా చేసింది. ఆ వయస్సు పిల్లలను బడికి
పంపకపోతే తల్లిదండ్రులను, పనిలో పెట్టుకొంటే యజమానులను నేరస్థులుగా
పరిగణించింది. గొంగళి పురుగుల్లా ఉన్న పిల్లల జీవితాన్ని అందమైన సీతాకోక
చిలుకల్లా మార్చాలని ప్రయత్నం చేసింది. దానిని ఉద్దేశించి కవి `
‘‘గొంగళి పురుగును
సీతాకోక చిలుకగా మార్చండి
అందరికీ విద్య! (ఆలో. 2017:51)
అంటూ గొప్పగా వర్ణించారు. అందరికీ విద్య అనే పథకం వచ్చిన తరువాత దేశంలో
అక్షరాస్యతలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ కవితలో మనం అర్థం
చేసుకోవాల్సింది ఏంటంటే అభంశుభం తెలియని వయస్సులో పిల్లలను తరగతి గదులకే
పరిమితం చెయ్యడాన్ని, దాని వెనుక దాగి ఉన్న తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని,
అలాంటి ఆలోచలను ప్రేరేపిస్తున్న ప్రస్తుత సమాజాన్ని. వీటన్నిటి ప్రతిఫలమే
నేడు మనం సమాజంలో చూస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు, రోగాలు, మానసిక
బలహీనతలు వాటన్నిటిని దగ్గర ఉండి అరికట్టడం కవిగారి ఒక్కరి వల్ల కాదు, అలాగని
చూస్తూ ఉండలేని స్వభావం కాబట్టి ఇలా కవిత్వమై ఘోషించారు.
స్త్రీల సమస్యలు :
స్త్రీల సమస్యలు అనేకం. శారీరక మానసిక సమస్యలు, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం,
లింగ వివక్ష మొదలైనవి. వాటన్నిటి దృష్టితోనే ధిక్కారంగా తెలుగులో ప్రధాన
సాహితీ స్రవంతికి సమాంతరంగా స్త్రీవాద సాహిత్యం పుట్టుకు వచ్చింది.
స్త్రీవాద సాహిత్యాన్ని స్త్రీలే సృష్టించుకోవడం కనిపిస్తుంది. అయితే,
సానుభూతి, సహానుభూతి క్రమంలో సహానుభూతిగా స్త్రీలకు సపోర్టు చేస్తూ చాలా
మంది కవులు, రచయితలూ తెలుగులో రచనలు చేశారు. ఈ క్రమంలో సంపత్ కుమార్ గారు
కూడా తమ వంతుగా కవిత్వాన్ని రాశారు.
అసమానత :
భారతీయ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఒక గీత ఎప్పుడూ ఉంటూ ఉన్నది. ఇంట్లో,
ఆఫీసుల్లో, సమాజంలో అసమానత ఉన్నది. స్త్రీని దేవతగా పూజించే భారతదేశంలో
ఇటువంటి సంస్కృతి ఉండడం బాధాకరం. దానిని వైవిధ్యం అనుకొని కొంతమంది,
వైరుధ్యం అని కొంతమంది భావించి ముందుకు వెళ్తూ ఉంటారు. బాధ పడి కొందరు,
భరించి కొందరు కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఉంటారు. కానీ కవులు మాత్రం బాధితుల
పక్షాన ఎప్పుడూ నిలబడతారు. అదనుకు నిదర్శనంగా సంపత్ కుమార్ గారు రాసిన
కవిత్వాన్ని చెప్పుకోవచ్చు.
ఆయన మగవారైనప్పటికీ బాధితులైన స్త్రీల పక్షాన మొహమాటం లేకుండా కవిత్వం
రాశారు. ‘‘మగవాడు’’ అనే కవితలో మగవాడు ఎటువంటి వాడైనా అనాదిగా ఈ సమాజం ఎలా
చూస్తూ వచ్చిందో, ఆడవారిని ఎంత తక్కువగా చూస్తూ వచ్చిందో అద్భుతంగా
వర్ణించారు.
‘‘మగాడంటే
మొనగాడని చెప్పింది అవ్వ
అవుననుకున్నది అమ్మ!
ఆడా మగా
వైవిధ్యం అనుకున్నాను
తెలియలేదు నోరు కూడా కుట్టేశారని’’ (శత్రువు. 2015:46-48)
ఆడవారికి అలంకారార్థం ముక్కు కుట్టడం, చెవులు కుట్టడం ఆనవాయితీ కానీ మన
సమాజం ఆడవారి నోరు కూడా కుట్టేస్తోంది అంటూ కొత్త అభివ్యక్తిని చేశారు
కవి. అది ఆడవారికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని చెప్పడానికి వాడిన
అత్యద్భుతమైన ప్రయోగం. ఇలాంటి ప్రయోగం ఏ స్తీవాద కవయిత్రి కూడా
ప్రయోగించి ఉండరు.
స్త్రీలను సమాజం చాలా చిన్నచూపు చూస్తోంది. కాబట్టి స్త్రీలకూ పురుషులతో
పాటు ఆస్తిలో, అవకాశాలలో సమానమైన హక్కులు కావాలని ఎన్నో పోరాటాలు
సాగాయి. స్త్రీలు పురుషులతో ఏ మాత్రం తక్కువ కాదు అని విద్య, ఉద్యోగం,
వ్యాపారం, క్రీడారంగం… ఇలా అన్ని రంగాల్లోనూ స్త్రీలు తమ శక్తిని
చాటుకున్నారు. అలాంటి సందర్భాన్ని గుర్తుకు చేసే కవితలు కింద ఉన్నవి.
‘‘శూన్యంలో సగం
సంపదలో శూన్యం
స్త్రీలకు సమాన హక్కులు!’’ (ఆలో. 2017:33)
భారతదేశం వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి యని, స్త్రీలకు ఎనలేని గౌరవాన్ని
ఇస్తుందని యావత్ ప్రపంచమే కొనియాడుతూ ఉంది. కానీ హక్కులు, సంపద విషయంలో
మాత్రం స్త్రీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. సమాజంలో మహిళలకు సగభాగం
స్థానం కల్పించాలనే ప్రభుత్వాల మాటలు పార్లమెంట్లో ఇప్పటివరకు
ఆమోదానికి నోచుకోలేదని సంపత్ కుమార్ వాపోయారు. అయితే ఇలాంటి కవుల,
పోరాటదారుల నిరంతర కృషి ఫలితంగా ఆడవారికి అన్నిటిలోనూ 33.3 శాతం రిజర్వేషన్
కల్పించడం, అలాగే మగవారితో సమానంగా ఆడపిల్లలకు తండ్రి ఆస్తిలో సమానమైన
హక్కులు ఉండడం లాంటివి సాధ్యం అయ్యాయి.
అఘాయిత్యాలు :
మహాత్మాగాంధీ స్త్రీ అర్ధరాత్రి భయం లేకుండా, స్వేచ్ఛగా నడిచిన రోజే
నిజమైన స్వాతంత్య్రమని భావించాడు. కానీ నేడు పట్టపగలే ఆ స్త్రీ ఇంటా
బయటా సర్వత్రా సామూహిక అత్యాచారాలకు గురౌతూనే ఉంది. దానికి సంబనధించి
కవిత
‘‘అర్ధరాత్రి ఆడవాళ్ళ
ఒంటరి ప్రయాణమే అసలైన స్వాతంత్య్రం
సామూహిక అత్యాచారం’’ (ఆలో. 2017:35)
భారతదేశం రోజురోజూ అభివృద్ధిని సాధిస్తూ ఉన్నది. అలాగే మరో పక్క నేరాల
శాతం కూడా బాగా పెరిగిపోతోంది. ఢల్లీి నిర్భయ కేసు మొదలుకొని డా. ప్రీతి వరకూ
ఎంతమంది ఆడవారు హత్యకావించబడ్డారు. అత్యాచారాలకు గురయ్యారో లెక్క
కట్టలేము. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వయస్సుతో సంబధం లేదు.
తొమ్మిది నెలల పసికందుల నుండి పండు ముసలి వరకూ అందరూ మగరాక్షసుల చేతిలో
నలిగిపోతున్నారు. అలాంటి సందర్భాన్ని ఉద్దేశించి సంపత్ కుమార్ గారు
‘‘కుక్కలుంటాయి జాగ్రత్త’’ అన్న కవితను రాశారు.
‘‘నువ్వు పసికందువు కావచ్చు
పండు ముడుసలివి కావచ్చు
యవ్వనవతివి కావచ్చు
గర్భవతివి కావచ్చు
కామాంధుడికి
చిత్తకార్తె కుక్కలు
చిత్త చాంచల్యంతో తిరుగుతూ ఉంటాయి’’
(వికారి. 2019:70,71)
అంటూ ఆడవారు ఏ దశలో ఉన్నా మగవారు విడిచిపెట్టడం లేదని, రాత్రే కాదు పగలు
కూడా చాలా బాహాటంగా జరుగుతున్నా యని ఉన్నది ఉన్నట్లు చెప్పారు. పై కవితలో
చెప్పిన ఆడవారి అందరిపై అత్యాచారాలు జరిగాయి. అందుకే ఉన్నది ఉన్నట్లు కుండ
బద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై జరుగుతున్న
అత్యాచారాలలో ఎక్కువ శాతం తెలిసినవారే, కుటుంబ సభ్యులే చేస్తున్నట్లు
నిర్ధారించబడిన విషయాన్ని కవితలో ప్రస్తావించారు.
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో మార్పు రావడం లేదు. కారణం
మనుషులో సహజ లక్షణమైన మానవత్వం లేకపోవడం. మనిషికి మాత్రమే సొంతమైన
నైతికమైన విలువలు లేకపోవడం. అలాంటి విలువలును పెంపొందించే విద్యావిధానం
పోయి, కార్పోరేట్ విద్యావిధానం దేశంలో విచ్చల విడిగా అమలు కావడం. అలాంటి
వాటిని చూసే కవి పైకవితలో ఆ మాటలు అన్నారు. అంతే కాదు ఎవరిని వారు
రక్షించుకోవాలని స్త్రీలను ప్రేరేపించే విధంగా ‘‘నోరు తెరవండి’’ అన్న కవితను
రాశారు.
‘‘ఇకనైనా
నోరు తెరిచి మాట్లాడండమ్మా
వేల సంవత్సరాలనుంచి
మౌనంగా ఉంచిన నోరు’’
అంటూ స్త్రీలను ఉత్తేజ పరచారు. అలానే కవి సమాజంలోని స్త్రీలకు ఊతమిచ్చారు.
మనిషిని మనిషిగా మలిచేది అక్షరం. మానవునిలోని అజ్ఞానాన్ని పారద్రోలి
విజ్ఞానాన్ని వెలిగించు దివ్య జ్యోతి అక్షరం. అక్షరం కళాత్మకమైతే అది
సాహిత్యం. అలాంటి సాహిత్యం సమాజంలోని కల్మష భావాలను పారద్రోలి నూతన
చైతన్యాన్ని సమాజానికి జవసత్వాలుగా అందిస్తుంది. అలాంటి సాహిత్యంలో
కవిత్వం ఒక మార్గం లేదా ఒక పద్ధతి. లయాత్మకమైన తన పదవిన్యాసంతో కవిత్వం
సమాజాన్ని ఒక లయబద్ధమైన మార్గంలో నడిపిస్తుందనడంలో సందేహం ఏమాత్రం లేదు. అలాగే కవిత్వం సమాజాన్ని దర్శించిన కవి నుండి పుడుతుంది. ప్రతి కవి
సమాజాన్ని సమాజంలోని ప్రజలకు దర్శింపజేయాలని ఆరాటపడుతూ ఉంటాడు. తద్వారా
సమాజం పట్ల ప్రజలలో చైతన్యభావాల్ని పెంపొందింపజేయాలని
పరితపిస్తున్నారు.
ఆధార గ్రంథాలు:
1. సంపత్ కుమార్, మాడభూషి. 2015. శత్రువుతో. హైదరాబాద్: పాలపిట్ట బుక్స్ ప్రచురణ.
2. సంపత్ కుమార్, మాడభూషి. 2016. చివరకు నువ్వే గెలుస్తావు. హైదరాబాద్ : పాలపిట్ట: బుక్స్ ప్రచురణ.
బి.వి.ఎస్. గౌతమ, మద్రాసు విశ్వవిద్యాలయం, ఫోన్ : 9652241261 |