మనిషిని పోలిన మనిషి మరొకరు ఉండరు అంటారు. ఉప్పు కప్పురం వలె ఒకే తీరుగా కనిపించిన వారిలో పుణ్య పురుషులు వేరంటారు. ‘మనిషి’ ఒక అర్థం కాని మహాసముద్రం. మనిషిని అంచన వేయడం అతికష్టం. మనుషుల్లో మృగాళ్ళుంటారు. మనుషుల్లోనే మహనీయులు, మునులు, మాధవులుంటారు. కనిపించే మనిషికి, ప్రవర్తించే తీరుకు సంబంధం ఉండని వారు కూడా ఉంటారు. ఆకారం చూసి అంచన వేయలేం. వారి కోరికలు, వాసనలు, ఆలోచనలను అంచనా వేయడం అసాధ్యం. అందుకే ధర్మరాజు ఇలాంటి ప్రశ్న ఒకటి అడిగాడు.
ప్రశ్న: కొన్నిసార్లు మంచి వారు, చెడ్డవారిగాను, చెడ్డవారు మంచివారిగాను కనిపిస్తారు. ఎవరు ఎలాంటివారో గుర్తించి తెలుసుకోవాలంటే సులువైన మార్గం ఏమిటి? (శ్రీమదాంధ్ర మహాభారతము.శాంతి.356)
దీనికి సమాధానంగా భీష్ముడు ‘పులి నక్కా సంవాదం’ను తెలియజేసాడు. పూర్వజన్మలో పౌరికుడు అనే రాజు పురిక అనే నగరాన్ని పాలించేవాడు. అతని కర్మానుసారం పూర్వ వాసనలతో నక్కగా జన్మించాడు. కాని ఈ జన్మలో ఆ నక్క జీవహింస చేయకుండా, మాంసం ముట్టుకోకుండా రాలిన పండ్లను తింటూ దీక్షగా జీవనం గడుపుతుంది. ఇది గమనించిన తోటి నక్కలు దానికి మాంసం తినిపించడం కోసం ప్రయత్నించాయి. కాని ఫలితం దక్కలేదు. ఆ నక్క విషయం అడవికి రాజైన పులికి తెలిసింది. పులి నక్క దగరకు వచ్చి దానితో స్నేహం చేయుమంది. సర్వ సుఖాలను అనుభవించుమని కూడా అనింది. నక్క సుఖాలను అనుభవించాలని లేదు. నీకు మంచి చెడులు తెలియజేస్తూ స్నేహితునిగా ఉంటానని అనింది. వారి ఇద్దరి స్నేహాన్ని చూసి వేరే వారు ఓర్వలేక ఏమి చెప్పినా నమ్మకూడదని పులిదగ్గర మాట తీసుకుంది. సంతోషంగా పులికి హితులు చెప్తూ అక్కడే ఉంటుంది. నక్క పులి స్నేహం పూర్వపు సేవకులకు నచ్చలేదు. అవన్నీ కలిసి కుట్రపన్నాయి. ఒకరోజు పులి తినే మాంసాన్ని మూలభృత్యులు తెలియకుండ ఎత్తుకెళ్ళాయి. దానిని నక్క ఉండే గుహలో పెట్టాయి. పులి తినే ఆహారం లేని విషయాన్ని గమనించిన నక్క పులికి చెప్పింది. పులితో పాటు అందరు వెతుకుతున్నారు. అది నక్క గుహలోనే దొరికింది. అప్పుడు పులికి నక్కమీద నమ్మకం పోయింది. ఇదే అదునుగా చూసుకుని మిగతా సేవకులు నక్క పెద్దమోసగాడు అని ఒకటికి రెండు కలిపి పులికి చెప్పాయి. ఆ మాటలతో నక్కమీద పులికి మరింత కోపం పెరిగింది. నక్కను పట్టుకు వచ్చి చంపుమని ఆదేశించింది. ఇదంతా పులి తల్లి విన్నది. కుమారుడి దగ్గరకు వచ్చింది. నీతో సేవకులు కల్పించి చెప్పారు. నక్క అట్లాంది కాదు. నీవు సేవకుల మాటలు నమ్మడం తప్పు. సొంత తెలివి ఉండాలి అని తిట్టింది. తల్లి మాటలకు కళ్ళుతెరుచుకుని రాజు నక్కను. పిలిచి అక్కున చేర్చుకున్నాడు. కాని నక్క రాజుతో ఉండడానికి ఇష్టపడక దాని దారిలో అది వెళ్ళిపోయింది. పులి తల్లి చెప్పిన మాటల్లో ఎంతో విలువైన వాక్యాలు కనిపిస్తాయి. అందులో సేవకుల గురించి చెప్తూ ‘‘భృత్యుల్ పుట్టినకోలెను గుటిలతలెట్టెట్టివి సేయ? రకట! యెఱుక గలఁగెనే?’’ (శాంతి.3.69) అంటుంది. సేవకులు పుట్టుకతోనే కుటిలబుద్ధిగలవారై ఉంటారు. రాజు అనేవాడే అది తెలుసుకోవాలి. సేవకులు చెప్పిన మాటలను గుడ్డిగ నమ్మకూడదు. సొంత నిర్ణయం చాలా అవసరం. మనిషి స్వభావం వారికికంటే అధికులను చూస్తే సహించరు. ‘‘బుద్ధిమంతునివలన దుర్బుద్ధు లధికు వలన హీనులు రూపసివలనఁ గొనటి వా రసూయలు సేయుడు రీరసమున…’’ (శాంతి.3.70) ‘బుద్ధిమంతులకు బుద్ధిహీనులు, గొప్పవారికి
తక్కువవారు, అందమైన వారికి ` అందహీనులు ఈర్ష్యతో లేనివి అంటగడతారు’ అంటుంది. ఈ విషయాన్ని పోలిన అంశాలు మూల భారతంలో మరిన్ని కనిపిస్తాయి. ‘‘లుబ్ధానాం శుచయో ద్వేష్యాః…’’ (శ్రీమహా భారతము.శాంతి.అ111.శ్లో61,62) అనే శ్లోకాలలో ‘‘లోభులకు ఉదారులయందు, పిరికివారికి వీరులందు, మూర్ఖులకు పండితుల యందు, దరిద్రులకు ధనవంతులందు, అధార్మికులకు ధర్మనిష్ఠుల యందు, విరూపులకు అందమైన వారి యందు ద్వేషం ఉంటుంది’’ అని తెలియజేస్తారు. కాబట్టి చెప్పుడు మాటలు వినేటప్పుడు బాగా ఆలోచించాలి. కొన్ని సమయాలలో లేదా కొందరి మాటల వల్ల మంచి చెడుగా, చెడు మంచిగా అనిపించే అవకాశం ఉంటుంది.
‘‘ధర్మ మధర్మము భంగి న
ధర్మము ధర్మంబు మాడ్కిఁ దనయా! తోఁచున్
నిర్మలమతి నరయవలయు
ధార్మికతన కోరువాఁడు తన కేర్పడఁగన్’’ (శాంతి.3.71) ధర్మం అధర్మంగా, అధర్మం
ధర్మంగా కూడా అనిపిస్తాయి. నిజమేదో తెలిసే వరకు మంచిమనసుతో ఆలోచించాలి.
తెలుసుకోవాలి. తొందరపడి ఎదుటి వారిని అనుమానించి, నిజం తెలిసిన తర్వాత వారిని
ఎంత దగ్గరకు తీసిన వారి మధ్యలో సఖ్యత కుదురదు. అందుకని ఎవరైనా…
‘‘వావిరి మాటలఁ దేలక
భావంబునఁ గీడు మేలుఁ బరికించి యస
ద్భావుని సద్భావుని నవ
నీవర! యేర్పఱుప నెఱుఁగ నేరగ వలయున్’’ (శాంతి.3.81) ధర్మరాజు అడిగిన ప్రశ్నకు
సూటి సమాధానం ఈ పద్యం. మనిషిని మంచి, చెడ్డ అని నేరుగ గుర్తుపట్టడం
కష్టమే. కాని మాయ మాటలు నమ్మకుండా, మంచి చెడు పరిశీలించి రెండు రకాల వారిని
గుర్తించగలగాలి. ఒక మనిషి మరొక మనిషిని కలిసిన అతి తక్కువ కాలంలోనే అతని మీద ఒక
అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాడు. ఆ అభిప్రాయం కలగడానికి ఏదో ఒకదానిని
ఆధారంగా స్వీకరిస్తాడు. అది ఇతరులు చెప్పిన మాటలు కావచ్చు. అతనితో
మొదటిసారి మాట్లాడిన తీరు కావచ్చు. కాని ఈ రెండు తప్పే. ఎందుకంటే ఏ రంగంలో
అయినా వారికంటే గొప్పవారి గురించి తక్కువవారు తప్పుడు సమాచారమే ఇస్తారు.
కారణం ఈర్ష్య. అసూయ. ఒకేసారి కలిసినంత మాత్రాన వారిని అర్థం చేసుకోవడం
కూడా సాధ్యమైన పనికాదు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే మనుషులే
అధికశాతం. ఈ భయానికే చాలామంది first impression is the best impression అని మొదటి సారే
నమ్మించడానికి సర్వ తంటాలు పడుతారు. ఇదో రకంగా పదినిమిషాల పెళ్ళిచూపుల
వంటిది. ఒకరి మెప్పుకోసం మరొకరు చేసే ప్రయత్నమే ఒక అద్భుత నటన. ఇది అందరికీ
తెలిసిందే. అందుకని ఒక వ్యక్తిమీద ఒక అభిప్రాయానికి వచ్చే ముందు చాలా
ఆలోచించడం అవసరం. సమయం తీసుకుంటే తప్పా ఇతరుల గురించి సరైన అంచన వేయలేరు.
దీనికి మధ్యేమార్గాలు, గీటురాళ్ళు ఉండవు. ఈ సమాధానానికి మూల భారతంలో గల
శ్లోకం మరింత బలాన్ని చేకూర్చుతుంది.
‘‘తస్మాత్ప్రత్యక్షదృష్టోకపి యుక్తో హ్యర్థః పరీక్షితుమ్ ।
పరీక్ష జ్ఞాపయన్నర్థాత్ నపశ్చాత్పరితప్యతే ॥’’
(శ్రీమహాభారతము.శాంతి.111అ.67శ్లో)
అనే శ్లోకం ద్వారా ‘ప్రత్యక్షంగా చూసినప్పటికీ కూడా మళ్ళీ పరిశీలించుకోవడం
ఉచితం. ఈ విధంగా పరీక్షించుకుని నిర్ధారించుకున్న విషయంలో తర్వాత ఎటువంటి
పశ్చాత్తాపం పడవల్సిన అవసరం ఉండదు’ అని తెలుస్తుంది.
భారతంలోనే వేరే సందర్భంగా చెప్పినప్పటికి ఈ కథను ఇక్కడ గుర్తు చేసుకోవడం
సముచితం. మనుషులు వారి స్వార్థం కోసం ఎలాంటి మాటలు చెప్తారు అనేది ఇందులో
గమనించవచ్చు. విదిశాపట్టణంలో ఒక పిల్లవాడు చనిపోయాడు. ఆ శవాన్ని
వల్లకాటికి తీసుకునిపోయారు. అక్కడ ఆత్మీయులందరు విపరీతంగ ఏడుస్తూఉండిపోయారు. వల్లకాటికి ఒక గద్ద వచ్చింది. ‘చీకటి పడుతుంది. ఈ సమయంలో ఇక్కడ
ఉండడం మంచిది కాదు. భూతాలూ, పిశాచాలు, రాక్షసులూ పీనుగులను చీల్చుకుని తినడానికి
చెలరేగి వస్తాయి. చచ్చిన బిడ్డతో మీరంత పోవడానికి సిద్ధపడుతున్నారా?
తొందరగా పీనుగను పాతిపెట్టి వెళ్ళండి’ అని గద్ద అనింది. అది నిజమే కావచ్చు
అనుకుని వారంతా శవాన్ని పాతిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు.
అంతలోనే అక్కడికి ఒక నక్క వచ్చింది. అది ‘గద్ద మాటలకు భయపడకండి. ఇంత చక్కని
పిల్లవాడిని పాతిపెట్టి పోవడానికి మీకు మనసు ఎలా వస్తుంది. మీ కడుపుశోకం
తీరేదాక ఇక్కడే ఇంకా కొద్దిసేపు ఏడవండి. అంతలో బ్రహ్మ దయతలిచి ఈ
పిల్లవాడికి తిరిగి ఊపిరి పోస్తాడు కావచ్చు’ అని చెప్పింది. వారందరికి కొంత ఆశ
పుట్టింది. నక్క చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డారు. అది చూసిన గద్ద ‘ఈ
మందమతి నక్కమాటలు వినవచ్చా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? పిల్లవాడు
ప్రాణాలతో తిరిగి వస్తాడనే ఆశలు పెట్టుకోకండి. దానధర్మాలు చేసి ఆ
పిల్లవాడికి పుణ్యగతులు కలిగించండి’ అని చెప్పింది. మళ్ళీ నక్క ఆ శవపు బంధువులతో
‘గద్ద మాటలు వినకండి. అది రాతి గుండెది. ఇలాంటి బిడ్డను చూస్తూ వదిలిపెట్టడం
మీకు ఎలా ఒప్పుతుంది’ అని అనింది.
గద్దకు కోపమొచ్చింది. ‘నాకు పదిహేనువందల సంవత్సరాలు ఉంటాయి. ఇన్నేళ్ళలోను
ఎప్పుడూ, పోయినవాడుపసివాడుకాని, పెద్దవాడు కాని, పండుముసలి కాని మళ్ళీ తిరిగిరావడం చూడలేదు. చావగానే మరో గర్భంలోకి వెళ్ళిపోతాడు జీవుడు. ఈ జిత్తులమారి నక్కకు ఏం తెలుసు? పీనుగు బ్రతుకుతుందంటే ఎవరైనా నవ్విపోరా?’ అనింది. అది నిజమే అనుకుని వారు అక్కడి నుండి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. అయినా నక్క వదలలేదు. ‘ఏ సిద్ధుడో, గంధర్వుడో, మరే దేవుడో మీ మొర విని, జాలిపడి, మీ పిల్లాణ్ణి బ్రతికిస్తే మేలేకదా? ఎందుకు వెళ్ళిపోతారు?’ అంటూ అడ్డుకొంది. పూర్వం తిరిగి బ్రతికించిన వారిని గురించి, బ్రతికిన వారి గురించి కూడా చెప్పింది. అదీ నిజమే అనుకుంటూ వారు వెనక్కు వచ్చారు. గుండెలవిసేలా ఏడ్చారు. వారి శోకానికి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. బాలుడి ప్రాణాలు తిరిగి పోసాడు. వారందరు బాలుడిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ కరుణామయుడు ఆ గద్ద, నక్కలకు కూడా ఆకలి లేకుండా వరమిచ్చి కనబడకుండా పోయాడు. ఇక్కడ గద్ద, నక్క రెండు ఆకలితో ఉన్నాయి. ఆ శవాన్ని తినడం కోసం మహా ఆరాటంగా ఉన్నాయి. రెండు కూడా వాటి స్వార్థం కోసమే సంభాషస్తున్నాయి. నీతులు, వేదాంతాలు చెప్తున్నాయి. అయితే చీకటి పడితే గద్ద ఉండలేదు. తినలేదు. కాబట్టి సూర్యాస్తమయానికి ముందే వారు వెళితే తినాలి అని దాని ప్రయత్నం. రాత్రి అయితే నక్కకు మేలైన సమయం. కాబట్టి అప్పటి వరకు వారిని పోకుండా చూస్తే పూర్తిగా అదే తినవచ్చునని దాని కపట ఆలోచనలు. స్వార్థం కోసం ఎంతటి పరిస్థితులలో అయినా నమ్మించడానికి ప్రయత్నించే వారు ఉంటారు. ఆలోచనతో కపటత్వాన్ని కనిపెడితే తప్పా మోసానికి గురికాకుండా మనిషి ఉండలేడు. ‘‘కపటుల నేర్పు తెరువు లెఱింగి కొనుటకును నుదాహరణంబైన గృధ్ర జంబుకోపాఖ్యానంబు…’’ (శ్రీమదాంధ్రమహాభారతము. శాంతి.3.381) ఈ విషయాన్ని మూల భారతం
‘‘స్వకార్య బద్ధకక్షౌ తౌ రాజన్గృధ్రోకథ జంబుకః।
క్షుత్పిపాసాపరిశ్రాంతా శాస్త్రమాలంబ్య జల్పతః॥’’ (శ్రీమహా భారతము.
శాంతి.అ153.శ్లో107) ఈ శ్లోకం ద్వారా ‘‘తమ కోరిక నెరవేర్చుకోవడానికి, ఆకలి
దప్పులు తీర్చుకోవడం కోసం శాస్త్రాలను కూడా ఆధారం చేసుకుని నమ్మించే
ప్రయత్నం చేస్తారు’’ అని సూచన చేస్తుంది. వ్యక్తులను గుర్తించడం, వారి
మాటలను నమ్మడం అనేది అతి చాతుర్యంతో చేయవల్సిన పని. మాటలు కొన్ని
వినడానికి వేదాంతాలుగా ఉన్నా వాటి వెనుక కపటం, స్వార్థం, మోసం, వంచన
ఉంటాయని గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే మంచి, చెడ్డవార్లను గుర్తించడం
అనేది అతని పరిశీలన మీదనే ఆధార పడి ఉంటుంది.
…… ……… …….. …….. …….
మనిషి సంఘజీవి. అందరితో కలిసి ఉండాలి. కొందరిని నమ్మి జీవనం సాగించాలి. ఒంటరిగా
ఉండే మనిషి మనుగడ సాగించలేడు. అయితే ఎవరిని నమ్మాలి? ఎంతగా నమ్మాలి? అనేది
మాత్రం చాలా మందికి వచ్చే సంశయమే. ఇందులో ధనం, విద్య, అర్థం, కులం, హోదా,
ప్రాంతం వంటివి అన్నీ భాగస్వామ్యం అవుతాయి. ఒక్కసారి చిన్న తేడవచ్చిన
ఇంట్లో భార్యను భర్త, భర్తను భార్యకూడా నమ్మరు. ఇట్లాంటి సమాజంలో
తియ్యగా మాట్లాడేవారిని నమ్మాలా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని
నమ్మాలా? ఎప్పుడో తెలియకుండా చిన్న వైరం ఏర్పడితే వారిని జీవితాంతం
నమ్మకుండానే ఉండాలా? ఇట్లాంటి సంశయాలను తీర్చే ప్రశ్ననే ధర్మరాజు
భీష్ముడిని అడిగాడు.
ప్రశ్న : ఎవరిని నమ్మకపోతే మనస్సుకు ఊరట కలుగదు. నమ్మితే కష్టాలు
సంభవిస్తాయి. నమ్మడం, నమ్మకపోవడంలో ఏది ఆచరించాలి? (శ్రీమదాంధ్ర
మహాభారతము.శాంతి.3.244)
భీష్ముడు దీనికి సమాధానంగా ‘బ్రహ్మదత్తుడు ` పూజని (గోరువంక) సంవాదం’
వినిపిస్తాడు. ఒక పట్టణానికి రాజు బ్రహ్మదత్తుడు. ఆ పట్టణంలో పూజని అనే
గోరువంక ఉండేది. గొప్ప మాటకారి. రాజుతో మంచి స్నేహ సంబంధాలున్నాయి. దానికి
ఒక సంతానం ఉండేది. రాజు కొడుకు గోరువంక పిల్ల ఇద్దరు కలిసి ఆడుకునేవారు. గోరువంక
తీసుకువచ్చే మంచి పళ్ళను రాజు కొడుకుకు కూడా పెట్టేది. కాని ఒకరోజు ఆ
పిల్లవాడు ఆ గోరువంక పిల్ల తలను పగలకొట్టి చంపేసాడు. తల్లిపిట్ట వచ్చి చూసి
విలవిల లాడిరది. వాపోయింది. రాజులకు స్నేహం, జాలి, కృతజ్ఞత ఉండవు. గర్వంగలవారు,
కఠినులు, నమ్మశక్యం కానివారని దూషించింది. ఈ పగ తీర్చుకోవడానికి గోరువంక
రాజకుమారుడి రెండు కళ్ళు ఊడపీక్కుని, వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశంలో
నుండి బ్రహ్మదత్తుడుకి వినపడే విధంగా జరిగింది చెప్పింది. అయినప్పటికీ ఆ రాజు
మనం ముందువలనే స్నేహంగా కలిసి ఉం దాం అంటాడు. దానికి గోరువంక అంగీకరించదు. వారి
ఇద్దరి మధ్యలో ఏర్పడిన పగ వారికి ఎప్పటికైనా హాని తలపెడుతుందని గమనించింది.
ఆ విషయాన్ని కొంత వివరంగా కూడా తెలియజేస్తుంది.
పగ అనేది అయిదు విధాలుగా పుడుతుంది. ‘‘వినుము! నేల దోఁచికొనినను దాయాదులైన…’’
(శ్రీమదాంధ్ర మహాభారతం. శాంతి.3.257) అనే పద్యంలో ఆ ఐదు విధానాలను
తెలియజేసాడు. 1. భూమి దురాక్రమణం వల్ల 2. దాయాదుల వల్ల 3. ఆడవారి వల్ల, 4.
మాటమాట పెరగడం వల్ల 5. అడ్డూ ఆపూ లేని చెడు తలపెట్టటం వల్ల. ఇలా ఏ విధంగా
అయినా ఒక్కసారి పగ పుట్టిందంటే అది ఒక పట్టాన పోదు. చెట్టులో దాగి ఉండే
నిప్పువలె మనసులో దాగి ఉంటుంది. మాటల మాయలో పడి పగను మర్చిపోవచ్చు. కాని
దాని వల్ల చావు, కలత, కీడు ఏదైనా జరిగే అవకాశం ఉంది. నీతిశాస్త్రం సొంతవారినే
నమ్మకూడదు అంటుంది. పగ ఏర్పడిన తర్వాత ఇతరులను నమ్మడం మూర్ఖత్వం.
‘‘తెగఁ దీర్పక తగ నార్పక
తెగటార్పక కడమ కొంత ద్రిక్కఁగ నున్నన్
జగతీశ! యప్పునగ్నియుఁ
బగయును గడుఁ బెరుఁగుఁగీడు వాటిల్లు దుదిన్’’ (శ్రీమదాంధ్ర మహాభారతం.
శాంతి.3.257)
పై పద్యం ప్రకారం ‘అప్పు, అగ్ని, పగ వీటిని సమూలంగా తొలగించాలి. ఈ మూడు
ఏమాత్రం మిగిలి ఉన్న తెలియకుండా చేతికి అందనంతగా పెరిగిపోతాయి. అంతే కాదు
చివరకు కీడును తెచ్చిపెడుతాయి.’ ఇక్కడ పగను అగ్నితో, అప్పుతో పోల్చడం వల్ల
దాని తీవ్రత ఎంతమేరకు ఉంటుందనే విషయం తెలిసిస్తుంది. ఈ పగను గురించి
భారతంలోనే మరోచోట ‘‘పగయ కలిగినేని పామున్న యింటిలో నున్నయట్లు…’’
(శ్రీమదాంధ్రమహాభారతం.ఉద్యోగ.3.20) అనే పద్యం ‘పగ ఏర్పడితే పామున్న
ఇంట్లో కాపురమున్నట్లు. ఎప్పుడు భయంభయంగా ఆందోళనతోనే ఉండాలి. గాని
క్షణమాత్రం కూడా నిమ్మళంగా ఉండలేరు. కాబట్టి పగ కలిగి ఉండడం మంచింది కాదంటారు’. దీని తర్వాత పద్యంలోనే పగ పరిహారం కూడా తెలియజేస్తాడు.
శత్రుత్వాన్ని అంతమొందించడం శుభదాయకం. అది మంచి పని. పగతో పగ సమసిపోదు.
వైరంతో బాధ కలిగించిన వాడిని ఉపేక్షించడం సాధ్యం కాదు. పోని తెగించి పగను
లేకుండా చేద్దామనుకుంటే ఇంకా కొంత దిగజారాల్సి వస్తుంది. ఏ విధంగా
ఆలోచించినా పగ వలన ప్రమాదమే ఏ మాత్రం ప్రయోజనం కనిపించదు. పగకు అసలైన
పరిహారం మృదుత్వం. ఈ విషయాన్ని `
‘‘మార్దవమున మృదువు మర్దింపగా వచ్చు
మార్దవమున పర విమర్దనంబుఁ
జెల్లు మార్దవమునఁ జెల్లనియది లేదు
గాన మృదువ తలఁప ఖరము సువ్వె’’ (శ్రీమదాంధ్రమహాభారతం. ఉద్యోగ.3.277)
‘మృదుత్వంతో మెత్తని వాడిని తుడిచివేయవచ్చు. మృదుత్వంతో శత్రువులను
చంపవచ్చు. మృదుత్వంతో సాధించరానిదంటూ ఉండదు. కాబట్టి మృదుత్వమే అన్నిటిని
మించి వాడిjైునది సుమా’ అంటాడు భీష్ముడు. మొత్తంగా ఎవరిని నమ్మినా
తగినంతగానే నమ్మాలి. ప్రత్యేకించి పగ ఏర్పడిన వారిని ఏ మాత్రం నమ్మకూడడు.
ఇలాంటి విషయాలు భీష్ముడు తెలిపిన చిన్నచిన్న కథలు, మానవ, పశుపక్ష్యాది
పాత్రల ద్వారా గొప్ప సందేశాన్ని అందిచాయి.
ఆధార గ్రంథాలు :
1. సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’
(అన్ని పర్వాలు, 15 సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
2. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా. ‘శ్రీమహాభారతము’
(అన్ని పర్వాలు, 7 సంపుటాలు). 2018. గోరఖ్పూర్: గీతాప్రెస్.
3. హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.
4. అప్పలస్వామి, పురిపండా. ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ (శాంతి పర్వము). 1976.
రాజమండ్రి: ప్రాచీన గ్రంథావళి.
5. లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ‘భీష్ముడు చెప్పిన రాజనీతి కథలు’ 1986.
హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం.
6. వెంకటరత్నం, గుంజి. ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ 2021. హైదరాబాద్:
ఎమెస్కో.
డా. అట్టెం దత్తయ్య ,
సహాయాచార్యులు, ఎస్వీ కళాశాల,
ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఫోన్ : 9494715445