కైలాస గిరివాస! కాత్యాయనీ ప్రియా!
కామితమ్ములు తీర్చు కాలకంఠ!
వెండి కొండయె నీకు ప్రియమైన ఇల్లాయె
మెండు బూచుల రేడ! కొండ దేవ!
సర్పహారమ్ములు సంతసంబున దాల్చు
నాగరాజేశ్వరా! నందివాహ!
దక్ష యజ్ఞ వినాశ! దాక్షాయణీ వరా!
భస్మలేపన శివా! పార్వతీశ!
ఆది మధ్యాంత రహితుడా! ఆదిదేవ!
భిక్షు వేషక! జడధారి! రక్షకుండ!
అర్ధనారీశ! విధుమౌళి! యభయదాత!
భూత నాయక! జగమేలు నేత నీవె!
మాఘమాసము నందు మంగళ కరమైన
శివరాత్రి పండుగ శ్రేష్ఠతరము
మంగళ రూపిణీ మాత భవానిని
కోరివరించగా కోర్కె తోడ
గంగమ్మ గౌరమ్మ కాంక్షగా పతిదేవు
చేయినందుకొనగ క్షేమమయ్యె
భక్తకోటి మిగుల భవుని గొల్వగాను
పూజలందు హరుడు పుష్కళముగ
అభిషేకంబుల నార్తితో జరిపింప
శుభముల నొసగెతా నభయ దాత!
లోక కళ్యాణంబు లోకులు వీక్షించ
జన్మధన్యత నొందె జగతి యంత
పసుపు కుంకుమిచ్చి పడతుల గాచుచూ
జగతి నేలుచుండు జనని గౌరి!
దీన జనుల పాలి దివ్య ప్రభాసమౌ
శాంతి సుఖము గూర్చు సాంబశివుడు!!
యెల్లికంటి జ్ఞానప్రసూనా శర్మ
కడ్తాల, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9493112429