పి.వి.నరసింహారావు సాహిత్య పిపాసకుడు, రచయిత, అంతకుమించి బహుభాషావేత్త.
పదిహేడు భాషలలో అనర్గళంగా మాట్లాడట వచ్చిన వ్యక్తి. అంతేకాదు కొన్ని
భాషలల్లో సాహిత్యాన్ని సృష్టించాడు. మాతృ భాషలను మరిచి ఇతర భాషలను
నేర్చుకుంటున్నవారికి, పి.వి. ఠీవిగా కనిపిస్తాడు. ఒక భాషను నేర్చుకోవాలంటే మన
భాషను మర్చిపోవాలనుకునే వర్తమాన కాలానికి ఆయనను ఉదహరించవచ్చు. ఆసక్తి,
అంకితభావం ఉన్నవారు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఇది మనకు నేర్పిన వ్యక్తి
పి.వి. తన ప్రేమను తనమాతృమూర్తి ఎంతగా చూపించాడో తన ప్రేమను తన మాతృభాషపై
అంతే చూపించాడు.
ఆయన ఒక నాణెం వంటివాడు. నాణెంకు ఒకవైపు బొరుసు మరోవైపు బొమ్మ ఉన్నట్టు
ఆయన ఒకవైపు అపార రాజకీయ ప్రాజ్ఞుడు. మరోవైపు సాహిత్యకారుడు.
విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో
హిందీలోకి అనువదించారు. దీనిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.
‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ రచనను ‘అబల జీవితం’ గా అనువాదం చేసారు.
‘ఇన్‌సైడర్’ ఆయన రచించిన ఆయన ఆత్మకథా నవల. ఇది తెలుగులో ‘లోపలిమనిషి’
అనువాదం అయ్యింది. స్త్రీవాదరచయిత్రి జయప్రభకవితాన్ని ఆంగ్లంలోకి
అనువాదం చేసాడు. అనేక సాహిత్య వ్యాసాలు రాసాడు.
ఆనాటి తెలంగాణ స్థితిగతులను తెలియజేసే రచన ‘గొల్ల రామవ్వ’ అనేది కథ.
విజయకలంపేరుతో 1949 15 ఆగస్టున కాకతీయ పత్రికలో ముద్రించబడిరది. ఈ కథ
‘గొల్లరామవ్వ’ అనే వృద్ధురాలు ప్రదర్శించిన తీరు అసాధారణ ప్రతిభను తెలంగాణ
మాండలికంలో పి.వి.నరసింహారావు రచించాడు.
తెలంగాణ కథారచయితలకు తీసిపోని విధంగా వర్ణనలతో… చక్కని సన్నివేశాలతో కథను
రక్తికట్టించాడు. ఒక మనిషిలో వచ్చే వివిధ హావభావాలను పaతీఱa్‌ఱశీఅం గాను
రామవ్వలో చూపిస్తాడు. కథా రచయితగా తన కథాకథన పద్ధతిని సంపూర్ణంగా
వ్యక్తీకరించాడు పి.వి. ఇక కథలోకి వెళ్తే…
గొల్ల రామవ్వకథ నైజాం కాలం నాటి స్థితి గతులను వివరిస్తుంది. ఖాసీం రజ్వీ
ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రజాకార్లు’ హైదరాబాద్ రాష్ట్రంలోని గ్రామాలలో
విరుచుకుపడి వారికి ఎదురుతిరిగిన… కమ్యూనిస్టు కార్యకర్తలను, కాంగ్రెస్
పార్టీ కార్యకర్తలను, పౌరులను హింసించేవారు, ప్రాణాలు తీసేవారు.
పటేళ్లు, పట్వారీలు, దేశముఖ్‌లు, దొరలు నిజాం ప్రభుత్వానికి విధేయులుగా ఉండి…
ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడేవారు….
కులాల పరంగా, వృత్తుల ఆధారంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారిని,
అలాగే వారికి వ్యతిరేకంగా, లేదా వారిని ఎదురించిన వారిని ప్రభుత్వ
వ్యతిరేకులుగా భావించి… ప్రభుత్వం దృష్టిలో వారిని నిషేధిత వ్యక్తులుగా
ప్రకటించినంతపనిచేసేది… రజాకార్లకు అలాంటివారిని చంపండం శిక్షించడం
సులువయ్యేది…
పౌరులు ఒకవైపు రజాకార్లను, మరోవైపు పోలీసులను ఎదుర్కోవాల్సి వచ్చేది…ఏడవ
నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మతాహంకారాన్ని, అతని మతపక్షపాతాన్ని
ఎదుర్కొని హైదరాబాద్ రాష్ట్రంలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాన్ని
నిర్మించడానికి అన్ని రకాల వర్గాలవారు పోరాటం చేస్తున్నారు.
ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజారాజ్యాన్ని నిర్మించాలన్న కార్యకర్తల
సంకల్పం ఎంత బలంగా ఉందో.. వారిని అనడానికి రజాకార్లు, పోలీసులు అంతే స్థాయిలో
పనిచేస్తున్నారు. గ్రామ గ్రామాన్ని జల్లెడపడుతూ కార్యకర్తలను తుపాకీ గుళ్లకు
బలిచేస్తున్నారు. కార్యకర్తలు వారిని ఎదుర్కొంటూ వీరమరణం చెందుతున్నారు.
మాతృభూమి స్వేచ్ఛకోసం పోరాటం చేస్తున్న ఒక కార్యకర్తకు ఆశ్రయం ఇచ్చి
పోలీసులనుంచి అతన్ని రక్షించిన ఒక వృద్ధురాలి వీరోచిత ప్రదర్శననే ‘గొల్ల
రామవ్వకథ’.
రామవ్వ గొల్లకులస్తురాలు. అందుకే ‘గొల్ల రామవ్వ’ అన్నారు రచయిత. ఆమెకు ఒక
పూరి గుడిసె అది కొంచెం ఇల్లులా ఉంటుంది. దానికి ఒక కిటికీలా ఉండే చిన్న తలుపుల
ద్వారం ఉంటుంది. అలాగే రెండు తలుపుల ద్వారం ఉంటుంది.
ఇంతకుముందు చెప్పినట్టు రజాకార్లు, పోలీసులు ఒకవైపు. కార్యకర్తలు ఒకవైపు
మొత్తం యుద్ధవాతావరణంలో తెలంగాణా పల్లెలు మునిగి ఉన్నాయి. అలాంటి ఒక
గ్రామంలో గొల్ల రామవ్వ తన మనుమరాలు మల్లవ్వతో కలిసి ఉంటుంది.
మనుమరాలు పదిహేను సంవత్సరాల యువతి రామవ్వకు భయం. ఏ రజాకారో, పోలీసో వచ్చి
మల్లవ్వను చూస్తే పాడు చేస్తాడేమో ననీ ప్రాణం తీస్తారేమోనని కూడా
ఉంటుంది… భయం గుప్పెట్లో రామవ్వ… మనుమరాలు మల్లవ్వను తలదాచుకుని
నిద్రిస్తుంటుంది… బయట తుపాకుల శబ్దం…కాంగ్రెస్ కార్యకర్తలకోసం, పౌరుల
కోసం గాలింపు జరుగుతుంది… ప్రతి ఇంటిని కూడా గాలిస్తుంటారు పోలీసులు… సరిగ్గా
దాదాపు మధ్యరాత్రి రామవ్వగుడిసె కిటికీలోంచి అతికష్టంగా ఒక మనిషి
గుడిసెలోకి వచ్చి కూర్చుంటాడు.
రామవ్వకు అర్థం అయ్యింది ఎవరో గుడిసెలోకి వచ్చారని…. అప్పుడు ఆమె
చీకటిలోనే లోపలి తలుపు గొళ్లెం తీస్తూ ఎవర్రా అంటుంది.
ఆమెకు భయం ప్రారంభమైంది. ఇంకేముంది తనకు చావు తప్పదు – తానల్లారుముద్దుగా
పెంచి పెండ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు… అనుకుంటుంది.
వచ్చినవాళ్లు… ఇంట్లో మాత్రం పడుచు పిల్లలు లేరా? అంత పెద్ద కరణం కూతురిని
బలత్కారం చేసి ఎత్తుకుపోయినపుడు ఎవరు ఏం చేయగలిగారు? ఎవరడ్డం వచ్చారు?
ఇప్పుడు తనకుమాత్రం ఎవరు దిక్కవుతారు? …అనుకుంటూ బలహీనురాలవుతుంది రామవ్వ.
కిటికీలోపటినుంచి వచ్చినతడు ఇంట్లోకి అడుగులేస్తాడు. రామవ్వకు ఏదో
జరగబోతుందన్న వ్యాకులత కలిగింది. ఆ నిశ్శబ్దం నుంచి చప్పుడు చేయకు నేను
దొంగను కాను, రజాకారున్ని కాను, పోలీసును కాను. మిమ్మల్నేమీ అనను. లొల్లి
మాత్రం చేయకండి…. అనే మాటలు వినబడతాయి. కానీ ఆ మాటలు రామవ్వకు
నమ్మకాన్ని కలిగించవు. పైగా ఆమె ఇలా అనుకుంటుంది. ‘‘అబ్బా! ఏమిటి టక్కరీ
నమ్మించి గొంతుకోయడానికి చూస్తున్నట్టున్నాడు తీయని మాటలతోనే సంతోష
పెట్టి పాపం మల్లిని’’ అనుకుంటుంది.
ఇద్దరు ఆడవాళ్లే ఇంట్లో ఉండటం వల్లే- ఆమెలో మరింత బలహీనమైన ఆలోచనలు
కలుగుతాయి. ఆమెలో ఆలోచనలు రావడానికి తనకళ్ళముందు ఎంతమంది ఆడపిల్లల
మానప్రాణాలు ఆ రజాకార్ల, పోలీసుల చేతిలో పోయాయి. వాటి స్ఫురణలు…తన
మనమరాలు మల్లవ్వకు జరిగేలా ఉన్నాయన్నది ఆమె మస్తిష్కంలో వెలుగడానికి
కారణం…అంటే గతం వర్తమాన ప్రమాదానికి సంకేతంగా ఆమె భావిస్తుంది.
కాలప్రవాహంలో జరిగిన ఆ దమనకాండలు ఆమెను భయం వైపు నెట్టుతున్నాయి.
అంతేకాదు, ఆమె ఆ సమయంలో ఎవరినీ నమ్మేలా కూడా ఉండదు. చీకటిలోనే ఆ వ్యక్తి
రెండు కాళ్ళు దొరికించుకొని ‘‘నీ బాంచెన్! చెప్పులు యెత్తి నా తలకాjైునా
తీసుకో, పోరిని మాత్రం ముట్టకు. అది నీ చెల్లెలనుకో…నీ కాళ్లు మొక్కుత’’ అనే
మాటలు కూడా అనేస్తుంది… బలహీనులు తెలంగాణలో మాట్లాడే మాటలు ఆమె కూడా
మాట్లాడుతుంది.
ఇంట్లోకి ప్రవేసించినవాడు రజాకారు కాదు, పోలీసు కాదు, అతకు అంటాడు. ‘‘లేదవ్వా!
నమ్మవేం చెప్పుతుంటే! నేను దుష్టున్నిగాను, నేను మీ అందరి వంటి తెలుగోణ్ణే!’’
రామవ్వలో ధైర్యం నిండిరది. ఎందుకంటే ఆగంతకుడు మాట్లాడిరది అచ్చ తెలుగు
భాష కనుక. భయంలేదు. రజాకార్లు, తురకలు, పోలీసులు తలారులు ఇలా తెలుగు
మాట్లాడరు… భాషతో పోల్చుకొని ….. ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. చావు,
మానభంగం తప్పినవి అనుకుంది.
కూర్చున్న ముసలవ్వ ఇంతకు ముందే అతని కాళ్లు పట్టుకుంది. కనుక ఆమె తన చేతులతో
అతని శరీరాన్ని స్పృశించింది. శరీరం నిండా మురికి పల్లెర్ల గడ్డిపోచలు గాయాలు
రక్తముద్దలు, రేగిముండ్లు ఉన్నాయి. క్షణాల ముందు భయంగా వణికిపోయిన
రామవ్వ… అతన్ని పోల్చుకోగానే తనకు కావలసినవాడిలాగే ఇదేం గతిరా నీకు?
గిట్లెందుకయినవు కొడుక? అని ప్రశ్నిస్తుంది….
వచ్చినవాన్ని పోల్చుకోకపోవడానికి కారణం చీకటి ఒకటైతే రెండవది, రజాకార్లు,
పోలీసులు గాలింపు… అతనెవరో తెలిసాక తనమనిషిలాగే భావించడం రామవ్వలో ఉన్న
మానవత్వాన్ని తెలియజేస్తుంది…. బహుశా అప్పుడే ఆమె అనుకుంటుంది అతన్ని
కాపాడాలని. అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కేవలం నిక్కరులో ఉన్నాడు
శరీరంపై అంగీలేదు. పోలిసులనుంచి, రజాకార్ల నుంచి తప్పించుకుని రామవ్వ గుడిసెలోకి
వచ్చాడు.
కొద్దిసేపు తల దాచనివ్వు తర్వాత నాదారిన నేను పోతాలే? అంటాడతను.
కానీ పరిస్థితినంతా అర్థం చేసుకున్నామె అతని దీనతను చూసి ఆ! మా పోతా మా
పోతా, ఒకటే పోకడ ! చక్కంగ స్వర్గమే పోతా. మంచి బుద్ధిమంతుడైషా! హు! పోతాడట
యాడికో! అతడిని రక్షించాలన్న ప్రయత్నంతోనే ఆ మాటలు అన్నది రామవ్వ.
అతనికి నోట మాటరాలేదు. పైగా భయం పోయింది. రక్షణలో ఉన్నట్టుగానే అతడు
భావించాడు.
మల్లవ్వను దీపం ముట్టించమనగానే అతడు వద్దంటాడు. ఎందుకంటే వెలుతురుకు
ఇంట్లో ఉన్నవారు కనిపిస్తారు. కనుక వద్దంటాడు. కాని రామవ్వ అతనికి ధైర్యం
చెబుతుంది.. మల్లవ్వ దీపం వెలిగిస్తుంది. ఆ దీపం వెలుతురులో ఆ కార్యకర్త
ఆకృతిని చూసిన రామవ్వ రాజోలిగె ఉన్నవు కొడుకా! నీకెందు కొచ్చెరా ఈ కట్టం? ….
అనుకుంటూ గొంగట్ల పడుకోమంటుంది. మల్లవ్వ అతని శరీరంపై ఉన్న ముల్లును
తీసేయమంటుంది. ఆ పదిహేను సంవత్సరాల మల్లవ్వ పెళ్లైనయువతి… సహజంగానే
పరాయి వ్యక్తి గనుక వెనకాముందాడుతుంది.
నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవాయేం సిగ్గనుకుంట? ఊ! చెయ్యి చెప్పిన
పని! పాపం పీనుగోలె పడున్నడ గాదె! వాన్ని జూత్తె జాలి పుడుతలేదె నీకు దొమ్మర
ముండా? ఆ! గట్ల ! నొప్పిచ్చకు పాపం!…
సొంత మనుమరాలిని దూషిస్తూ అతనిపై ఎంత ప్రేమను చూపిస్తుందో రామవ్వ ఒకరకంగా
అతని విషయంలో అభిమానం చూపిస్తు అతనికి సహాయం చేయడానికి సిగ్గుపడుతున్న
మనుమరాలు మల్లవ్వను కఠినంగా దూషించింది. నిజానికి మల్లవ్వ అతని ప్రాణం
తీస్తుందా! లేదు కాని అతనికి సహాయం చేయాలన్న రామవ్వ తపన వ్యక్తం
అవుతుంది… కోపంగా మాట్లాడటం, హాస్యాన్ని ఒలికించడం గొల్ల రామవ్వ
మూర్తిమత్వాన్ని దృశ్యమానం చేస్తుంది.
ఆ యువకుడి శరీరాన్ని వేడినీళ్లతో శుభ్రం చేసి, అతనికి తినడానికి గటుక పెట్టింది.
తల్లిలా అతని శరీరాన్ని నిమురు తున్నప్పుడు అతని జేబులో తపాకి కనిపిస్తుంది…
ఎందుక్కొడుకో ! మమ్ముల గట్ల చంపుదామనుకున్నావాయేంది? అంటుంది
రామవ్వ…లేదవ్వా మిమ్మల్ని చంపేవాళ్లను చంపే అందుకని అంటాడు. మూడు
రోజులక్రితం గ్రామంలో నలుగురు నిర్దోషులను పోలీసులు చంపినందుకు ప్రతీకారంగా
ఇద్దరు పోలీసులను చంపాడు ఆ కార్యకర్త. ఆ మాటలు విన్న రామవ్వలో తెలియని
ఆనందోత్సాహం, విజయోత్సాహం కల్గింది.
కళ్ల ముందు జరుగుతున్న అకృత్యాలకు చరమగీతం పాడాలన్న ఈ లాంటి యువ
కార్యకర్తలు కావాలన్న ఆశ ఆమెలో చేరి ఉంటుంది. అతన్ని చూస్తూ… ఆమె
ఇద్దర్నా?…కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా! సగం పనే చేసినవు… అంటుంది.
ఆ మాటలో వ్యంగం ఉంది. కసి ఉంది. ఆ మాటలకు ఆశ్చర్యపోతూ ఆ కార్యకర్త
తక్కినవాళ్లను కూడా చూచుకొస్తాలే అవ్వా! అనేశాడు. కానీ రామవ్వ వారిస్తుంది. పోలీసోళ్ళతో వైరం ఎందుకు?…పేదోళ్లు కొట్లాడితేమైతది? అంటుంది… అలా
మాటల్లోనే అమె తల్లిప్రేమను చూపించింది… తల నిమురుతూ దీర్ఘాలోచనలోకి
వెళ్లింది.
అబ్బ! ఏం పోరడు! ఇసోంటోల్లెంతమంది చావాలో ఇంక! అనుకుంటూ కండ్లల్ల వత్తులు
పెట్టుకుని కూర్చుంది.
గ్రామం అంతా గాఢ నిద్రలో ఉంది… ఆ కార్యకర్త మల్లవ్వ దగ్గరే పడుకున్నాడు.
బయట పోలీసుల చేతికి ఎవరో చిక్కారు. అతన్ని వారు చితక్కొడుతున్నరు. అరుపులు,
కేకలు వినిపిస్తున్నాయి. రామవ్వకు కంగారు మొదలయ్యింది. ఆ కార్యకర్త లేచి
కూర్చున్నాడు. తుపాకీ తీసుకుని తూటాలు నింపుకున్నడు. కార్యసిద్ధుడైనాడు.
రామవ్వ చేయిపట్టుకుని వారించింది.
నా వల్ల మీకు ప్రమాదం… సోదా చేస్తారు. నేను వెల్తాను అంటాడు. బూట్ల
చప్పుడు వినిపిస్తుంది. గుడిసె ముందు నిల్చున్నారు పోలీసులు. ఆ కార్య కర్త
తలుపులు తీయబోయాడు. వెంటనే రామవ్వ అతన్ని వెనకకి నెట్టింది. తుపాకి
తీసుకుంది. దీపాన్ని ఆర్పేసింది.
క్షణాల్లో రామవ్వ తెలివికి బీజం పడిరది. ఆ కార్యకర్తను గొల్లోల్ల
పిల్లవానిలా వేషం మార్చింది.. అతని నిక్కరు తీసి దాచింది. అచ్చం ఎర్ర గొల్లోని
లాగే ఉన్నవు అని మురిసిపోయింది.
బయట నుంచి రామీ! ఓ గొల్ల రామీ ! తల్పూకీ కోల్.. అనే మాటలు. వెంటనే అతన్ని
మంచంమీద పడుకోమంది. ఆ మంచం మీద మల్లవ్వ కూడా ఉంది.
అపుడే నిద్రనుంచి లేచినట్టుగా ‘ఎవల్రా పెద్ద దొంగనాత్తిరొచ్చి తలుపు
కొడ్తాన్రు? దొంగముండ కొడుకులున్నట్లున్నరు ! మీ ఇల్లు పాడుబడ! పెద్దగా
అరుస్తూనే ఉంది…. నన్నేం దోచుకుంటర్రా ? ముసలి ముండ దగ్గరేముంటది? అంటూ
అరుస్తూనే మనుమరాలు మల్లవ్వను కార్యకర్త దగ్గర పడుకోమంటుంది. ఇక్కడ
రామవ్వ తన చతురతను ఉపయోగించింది. పైన చెయ్యేసి పడుకో ఎవ్వరికి అనుమానం
రాదు అంటుంది. మల్లవ్వ చెప్పినట్లు చేసింది. రామవ్వ అరుపులు ఎక్కువ చేసింది.
ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు! దెబ్బగొడితె రద్దీ! కొట్టకుంటె బుద్ధి
రాదు. ఎక్కడి పీడ తెచ్చిపెడితివిరా నా పానానికి! యాడున్నవో కొడుకా! నా కొడకా!
ముసలి ముండను అంటూ బయటవాళ్ళకు వినబడేలా పెద్దపెద్ద రాగం దీసుకుంటూ
ఏడువసాగింది…
అరుపులు బయటకు వినిపిస్తున్నయి. వారిలో కొందరు ముసల్ది నాటకం ఆడుతుందని,
మరికొందరు జాలిపడటం చేసారు. బయట పోలీసులు ‘తోడ్ దేెవోరే దర్వాజా’
అంటుండగానే రామవ్వ తలుపు తీసింది….
పోలీసులు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ గుడిసెలోకి ప్రవేశించారు. రామవ్వ పెద్ద
కేకలు వేస్తూ అరిచింది. చంపితిర్రా నీ దౌడలు బడ ముసల్దాన్ని పానం తీత్తిర్రా!
అంటూ ఏడుస్తూనే ఉంది… ఏం జరుగుతుందో వచ్చిన పోలీసులకు మాత్రం అర్థం కాలేదు.
ఈడనేనున్న గురుగులంటన్నయి. తల్లె ముంతలున్నయి. పోరియెడల గంటె
పుర్రెలున్నయి. పోరగానికి రెండు దండ కడియాలున్నయి. ఇంకేగావాల్నో తీసుకోండి.
చంపాలంటే చంపుండి…. పోరన్ని చంపండి. పోరి ముండ యనక ముందు దాన్ని గూడ తుపాకి
నెయ్యండి. ఇద్దర్నోసారి చంపుండి.
అంటుండగానే మల్లవ్వ కండ్లు తుడుచుకుంటా మంచం దిగింది. కార్యకర్త ఆవలిస్తూ
మంచం మీదనే కూర్చున్నాడు. అక్కడేం జరుగుతుందో పోలీసులకు ఏమీ అర్థం కాలేదు.
ఒకరి ముఖాలు ఒకరు చూస్తు కూర్చున్నారు. రామవ్వ మాత్రం తను చేయాల్సిన పని
చేస్తూనే ఉంది… అలాగే ఏడుస్తూ అరుస్తూనే ఉంది.
అంతలో పోలీసు కార్యకర్తవైపు చూస్తూ వాడు యెవడున్నడు చెప్పు కాంగ్రెసోడా
యేం? రామవ్వ మాత్రం గట్టిగా అరుస్తూనే ఉంది. ఆ అరుపుల నుండి వాడెవ్వాడా? ఎవ్వడు
పడితె వాడు మా పక్కల్ల పండుకోవడానికి మేమేం బోగమోళ్ళ మనుకున్నావా?
నిన్నెవ్వడన్న గట్లనే అడుగుతే ఎట్లుంటది?
మాటల్తోని మానం దీసుడెందుకు? పానం తియ్యరాదుండి?… అంటూ నోటికొచ్చిన
మాటలు అంటునే ఉంది రామవ్వ….
బైటోడు గొల్లరామి గుడిసెలకొచ్చి పట్ల తప్పించుకుంటాడు? పానంతో
పట్టుకొచ్చి అప్పచెప్పనయ్య గొల్లరామెసోంటిదో ఊరోళ్ళ నడుగండి…..
ఆమె మాటలకు బిత్తరపోయిన పోలీసులకు ఏం జేయాలో తోచలేదు. కొద్దిసేపు
ఆలోచించి ‘అచ్చ నేను పంచనామ చేసుకొని వస్తా’ అంటూ పోలీసు జమదారు ఇతరులు
వెళ్తారు.
ఆమె ప్రదర్శించినతీరు, ఆ సాహసం దానికి మించిన తెలివి, అంతా కలగలసి ఓ
కార్యకర్త ప్రాణాన్ని కాపాడిరది…. గొల్ల రామవ్వ బాధ్యతతో చేసిన పనిలా
కనిపిస్తుంది.
ఆ కార్యకర్త రామవ్వ చతురతను చూసి ‘‘అవ్వా నీవు సామాన్యురాలు కావు.
సాక్షాత్ భారత మాతవే’’ అన్నాడు. రామవ్వ నవ్వుతూ కొంటె పోరడా! నాకే పేర్లు
పెడుతున్నవా… నా పేరు గొల్ల రామవ్వ అంతే….ఇగనువ్వెల్లు… మల్లిని
అత్తారింటికి తోల్కపోత… పొద్దెక్కుతుంది…. అంటుంది. ఆమె భావన అర్థం
చేసుకున్న కార్యకర్త వెళ్లిపోతాడు.
రాత్రంతా నిద్ర లేకుండా ఆ కార్యకర్తకు సేవజేస్తూ … భయం గుప్పెట్లో
సాహసంగా రామవ్వ తెలివితేటలు ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. ఆమె ఆ
సమయంలో ప్రదర్శించింది అసాధారణ ప్రతిభనే…
ఆధార గ్రంథాలు :
- తెలంగాణ కథలు ` సంపా. కాలువ మల్లయ్య, సదానంద్ శారత, చంద్ర : విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, జులై, 2005. - అస్తిత్వ ` ప్రాతినిధ్య తెలంగాణ కథలు. ప్రధాన సంపా. నందిని సిధారెడ్డి,
తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్ 2019 - తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం ` సంపా. జె. చెన్నయ్య, ఆంధ్ర సారస్వత
పరిషత్తు, 2013. - తెలంగాణం
వ్యాసాలు : సంకలనం : వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల వేదిక, హైదరాబాద్
2009.
డా. కసప నరేందర్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
నిజాం కళాశాల, హైదరాబాద్. ఫోన్ : 94915 48748