దశాబ్దపు స్త్రీవాద కథా సాహిత్యం – ఒక  అవలోకనం (2001-2010)

తెలుగు సాహిత్య చరిత్రలో దానికంటే ముందు కాలంలో స్త్రీని కేంద్రబిందువుగా
చేసి సాహిత్యంలో రచనలు వెలువడినాయి. అయితే అప్పటి సాహిత్యం స్త్రీని భోగ
వస్తువుగా, వర్ణించే వస్తువుగా, పురుషుడి కన్న తక్కువ స్థానం కల్గి ఉండే
వ్యక్తిగా చిత్రీకరించారు. సమానమైన భాగస్వామ్యాన్ని సాహిత్యంలో
కల్పించలేదు. దీనికి ప్రధానకారణం పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండడం,
పురుషుడే యాజమాన్య నిర్ణయాధికారాలు కల్గి ఉండడం ప్రధాన కారణం. అయితే
సాహిత్యం ఆధునికతను సంతరించుకుంటున్న కాలంలో స్త్రీ వస్తువులో,
సమస్యలలో, భావజాలములో ఆధునికత సంతరించుకుంది. దానితో ఆధునికసాహిత్య
రచనలలో వస్తువు పరంగా స్త్రీ మార్పులకు లోనైంది. దాని తరువాత పరిణామ కాలంలో
ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ భావజాలలు రావడం దానితో స్త్రీకి
ప్రత్యేకమైన పరిధి, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, భావుకత ఉండాలనే నేపథ్యం,
స్త్రీవాద రచయిత్రులలో వెలువడడం, తమ సమస్యలు, తమ వస్తువు తాము రాస్తే
నిజమైన ఇతివృత్త నిర్ధారణ అవుతుందనే సంకల్పం కలగడం… ఇలా ప్రపంచ
వ్యాప్తంగా స్త్రీవాద సాహిత్యం బలంగా సాహిత్యంలో దూసుకు రావడంతో
సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం ఒక వాదంగా స్థిరీకరించబడిరది. దానితో
స్త్రీవాద సాహిత్యం కవిత్వపరంగా, కథా పరంగా, నవలా పరంగా ఇలా అనేక
ప్రక్రియలలో స్త్రీవాదం వస్తువైనది.
ఈ అత్యాధునిక సాహిత్యంలో, అత్యాధునిక కాలానికి ముందు తరువాత స్త్రీవాద
కథాసాహిత్యం, స్త్రీవాద సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే ఒకప్పటి
స్త్రీవాద భావజాలం వేరుగా కనబడుతుంది. స్త్రీవాద సాహిత్యం వెలువడిన
సమయంలో స్త్రీవాద రచనలు పదునైన భావజాలంతో, పురుష అహంకారానికి తీవ్ర
వ్యతిరేక పదజాలంతో, కొంత విప్లవాత్మక భావజాలం కనబడుతుంది. అయితే 1990
దశకంలో స్త్రీవాద సాహిత్యం తనను గురించి స్పృహ, తన శరీరాన్ని గురించి స్పృహ,
అనుభూతి గుర్తించడం, నీరసించడం తమపై జరుగుతున్న అన్ని రకాల హింసను
గుర్తించమని, ఆ ధోరణి మానుకోమని సమాజానికి విన్నవించడం ప్రధాన వస్తువుగా
స్త్రీవాద సాహిత్యం వెలువడినది. అయితే 2000 దశకం, 1990 దశకం మధ్య తేడా
గమనిస్తే వస్తువు పరంగా 1990 దశకం ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుందనే
చెప్పవచ్చు. అయితే ఈ అత్యాధునిక శతాబ్దపు ఆరంభ దశకంలో స్త్రీవాద
రచయిత్రులలో ఆలోచన పరంగా, విశ్లేషణ పరంగా, మారుతున్న కాలపు భావజాలపరంగా
స్త్రీవాదులు ఇప్పుడు సమాజంతో పాటు కొత్తరూపు తీసుకుంటున్న సమస్యల గురించి
మాట్లాడుతున్నారు.
గ్లోబలైజేషన్‌ ప్రభావంతో స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పుల్ని సునిశిత
పరిశీలనతో చర్చకు పెడుతున్నారు. మారుతున్న పల్లెలు, పట్టణ స్వరూపాలు, మానవ
సంబంధాలు, మానవ విలువలు, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, వివాహ

వ్యవస్థలో మార్పులు, వైవాహిక సంబంధాలు, అంతరిస్తున్న కులవృత్తులు, రాజకీయ
రంగాల్లో స్త్రీలపై కొనసాగే అణచివేత, స్త్రీలు ఎంచుకుంటున్న కొత్త
కెరియర్స్‌లోని మానసిక, శారీరక ఒత్తిడులు, మతవిద్వేషాలు, ప్రవాస జీవితంలోని
సంఘర్షణ ఇలా సమాజం విశ్వరూపాన్ని తమ కథల ద్వారా చర్చకు పెడుతున్నారు
స్త్రీవాదులు. ‘‘అందుకు మారుతున్న సమాజంతో పాటు స్త్రీలు మారుతున్నారు,
స్త్రీల చుట్టూ ఉన్న సమాజం ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. స్త్రీల
పట్ల సమాజం ప్రవర్తన కూడా ఎప్పటికప్పుడు మారుతూనే వుంది. అయితే అన్ని
కాలాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ స్త్రీల పట్ల ఆంక్షలు మాత్రం వుంటూనే
వున్నాయి. కాకపోతే అంశాల స్వభావంలో మార్పు వస్తుంది’’
ఈ దశాబ్దంలో ఓల్గా రాసిన ‘సమాగమం’ కథ ఒకప్పటి పురాణాల లోని పౌరాణిక
పాత్రల ఉదాత్తత ఎదుగుదల, సంపూర్ణత, ఆయా పరిస్థితులల్లో వాళ్ళు పడ్డ
సంఘర్షణ ఫలితాలను, చరిత్రను ఈనాటి దృష్టికోణంతో స్త్రీయొక్క మనసులో
కల్గే అంతర్గత విశ్లేషణ, పురుష పితృస్వామిక వ్యవస్థలో పైకి కనబడని
స్త్రీలపై వున్న అపనమ్మకాన్ని ఈనాటి పరిస్థితులకు అన్వయించి విశ్లేషించడం
జరిగింది. రామాయణంలోని ఇద్దరు స్త్రీల మధ్య జరిగిన సంభాషణ రూపంలో కథ
సాగుతుంది. ఇందులో సీత, శూర్పణఖ పాత్రల ద్వారా ఎన్నో కోణాలను విశ్లేషించారు.
స్త్రీకి స్త్రీ శత్రువు కాదని, పురుషుల చేత అన్యాయానికి గురైన ఇద్దరు
స్త్రీల మధ్య గొప్ప అనుబంధం ఏర్పడుతుందని ఓల్గా ఈ కథ ద్వారా నిరూపించారు.
ఓల్గా రాసిన మరికొన్ని కథలు ‘మృణ్మయనాదం, సైతకబంధం, విముక్త’. ఈ ఇతిహాస
గాథలను కొత్త ఆలోచనా ధోరణి నుంచి చెప్పిన కథలు. ఈ కథలలో శూర్పణఖ, అహల్య,
రేణుక, ఊర్మిళ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఒక్కొక్కరిది ఒక్కొక్క త్రోవ. సీత
వారందరి అనుభావాల నుంచి తను నేర్వగలిగిందే నేర్చింది. మొదట అందరి ఎడలా తనకు
నిరసన, కోపం, తర్వాత అందరి జీవితాలలోని వ్యథలూ సమానమే నని తెలిసాక
సామరస్యం, స్నేహం తనవంటి వారి బాధలు విన్నాక తానొంటరి కాదనే ఒక బలం.
స్త్రీ సమూహంలో తానొకతేననే స్పృహ, కథల్లో సీత పాత్ర తన
జీవితానుభవాల్లోని వివిధ సందర్భాల్లో అరణ్యవాసంలో తాముండగా రేణుకను,
అరణ్యవాసం నుంచి తిరిగొచ్చాక ఊర్మిళను, పిల్లలను పెంచుతూ వాల్మీకి
ఆశ్రమంలో శూర్పణఖను, వివాహానంతరం రాముడి ద్వారా అహల్య గురించి విని ఆ
తరువాత అరణ్యవాసంలోనే కలుస్తుంది. వారిని కలిసిన ప్రతి సందర్భానికి, సీత
జీవితంలో జరిగిన మార్పులు పరిణామాలకు సంబంధం ఉంది. వారి అనుభవాలనుంచి తనను
అర్థం చేసుకో గలుగుతుంది. సీత జీవితంలో వచ్చిన మార్పులు, సంఘటనలు, ఎదురైన
అనుభవాలు అన్ని కలిసి తానొక దృక్పథాన్ని ఏర్పరచుకు నేందుకు దోహదపడతాయి. ఏ
స్త్రీ అయినా తన జీవితానుభవాల ద్వారా తనని తాను అర్థం చేసుకోవటంతో పాటు
ఇతర స్త్రీల అనుభవాలను తెలుకోవటం ద్వారా తనకు, ఇతర స్త్రీల మధ్య గల
సామ్యాలు అర్థమవుతాయి. ఈ సామ్యాలకు మూలమైన పితృస్వామ్యం
అర్థమవుతుందంటారు.
ఓల్గా ఈ నాలుగు కథలతో పాటు ‘‘బంధితుడు’’ పేరుతో రాముడికి ఉన్న పరిమితులను కూడా
అర్థమయ్యేరీతిలో చెప్పారు. ఆర్య ధర్మాల ప్రకారం ‘నా జీవితం
రాజ్యాధికారం కింద అణగిపోవలసిందే’ అని రాముడు గుర్తించిన వ్యవస్థ. అలానే
రాముడి మనసులో సీతకు ఉన్నత స్థానం వున్న, అయోధ్యకు తీసుకురావడంలో సీత శీల
నిరూపణ సమాజం కొరకు చేయవల్సిన పరిస్థితులను అంతర్గతంగా బోధించ బడిన
విషయాలు, ఇలా పలు కోణాలను రాముడు రాజ్యబాధితుడు, అధికార బాధితుడు, రాముడికి
వున్న ‘శృంఖలాబద్ధత’ను స్త్రీవాదం (ఫెమినిజం) గ్రహించ గలుగుతుంది. అందుకే కథలో
రాముడిని, మహిళావరణంలో సీతను ఒకే దృక్పథంలో చూపించిన విశిష్ట కథలుగా
గుర్తించవచ్చు. ఓల్గా మరో కథ ‘అత్తిలు’ స్త్రీవాద ధోణిలో సాగుతుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుడి యొక్క ఆధిపత్యం, అధికార ధోరణిలో ఇప్పుడున్న
సమాజంలో కూడా కొనసాగుతూ వుంది. సమాజంలో వున్న కుటుంబ వ్యవస్థ, ఆర్థిక
స్వావలంబన కోసం వరకట్నంపై ఆధారపడుతున్న సాంఘిక వ్యవస్థ, వివాహ
వ్యవస్థ, బంధువ్యవస్థ డబ్బుకు ఇస్తున్న ప్రాధాన్యత మానవ విలువలకు గాని,
మానవ సంబంధాలకు గానీ, వ్యక్తిత్వానికి గాని విలువ ఇవ్వని పరిస్థితులు
గోచరిస్తున్నాయి.
కుప్పిలి పద్మ రాసిన ‘సాలభంజికలు’ ఈనాటి స్త్రీ కుటుంబం బయట లోపలా
బహుముఖీనమైన దోపిడికి గురవుతూ కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీల
విషాద జీవితాన్ని చిత్రించిన కథ. మరో రచన ‘వర్షపు జల్లులలో’ ‘కుబుసం’ కథలో
ఆధిపత్యవాద సంస్కృతిపైన మోజుతో తాత్కాలిక ఆనందంతో జీవన మాధుర్యాన్ని
కోల్పోతున్న యువతరపు అయోమయ స్థితిని చిత్రీకరించిన కథలు. అలానే సత్యవతి
రాసిన ‘మంత్రనగరి’ సాలెగూడు(ప్రతిమ) ‘కొత్తకోర్సులొస్తున్నాయి జాగ్రత్త’
(సుభాషిణీ) లాంటి కథలు గ్లోబలైజేషన్‌ వికృత స్వరూపాన్ని బట్టబయలు
చేస్తున్నాయి. కొత్త కెరియర్స్‌లో స్త్రీల మానసిక, శారీరక ఒత్తిడి
ఎక్కువవటమే కాకుండా వారి వ్యక్తిత్వాలు ప్రశ్నార్థకమవుతున్న తీరును
సునిశితంగా ఎత్తి చూపిస్తాయి.
ఈ దశాబ్దంలో వి. ప్రతిమ ‘ఖండిత’ సమాజంలో స్త్రీల మనసులో వున్న కోరికలు,
భావాలు, స్వేచ్ఛను ఏవిధంగా హరిస్తున్నయో పితృస్వామిక వ్యవస్థకు
వ్యతిరేకంగా స్త్రీ అస్తిత్వం కొరకు రాయబడిరది. పి.సత్యవతి ‘ఆవిడ’
పితృస్వామిక వ్యవస్థలో జాతి పేరుతోను, ప్రతీకారం పేరుతోను యిబ్బందుల
పాలవుతున్న వ్యక్తులు స్త్రీలే తమకు తమను శత్రువుగా మారుస్తున్న వ్యవస్థ
కుండే భిన్న పార్శ్వాలను, తలచి చూడవలసిన అవసరాల్ని వివరించిన కథ. అలానే
‘ఆత్మవాలిన చెట్టు’, ‘నేనొస్తున్నాను’ కథలు గ్లోబలైజేషన్‌ కారణంగా వివిధ
వర్గాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను తెలియజేశారు.
అబ్బూరి ఛాయదేవి రచన ‘అదొక సంస్కృతి’ మన సమాజంలో ఒకప్పటి అభ్యుదయ
భావాలు, స్త్రీ స్వాంగికతకు ఇప్పటి సమాజంలోని వారు గుర్తించలేకపోతున్న
స్థితిని వివరించారు. వారసత్వ గుర్తింపుని స్త్రీవాద చైతన్యంతో కొత్తకోణం
నుంచి ప్రశ్నించిన కథ. అక్కిరాజు భట్టిప్రోలు ‘అంటుకొమ్మ’ తెలుగు ప్రాంతంపై
స్త్రీవాదం విస్తరిస్తున్నకొద్దీ సాహిత్యానికి కొత్త కోణాలు వచ్చి
చేరుతున్నాయి. వంశవృక్షంలో చోటు దొరకని వైనాన్ని విప్పిచెప్పేవరకు ఆలోచన
స్థాయిలోనైనా ఇదొక సమస్యగా అనిపించదు. ‘నో మేల్‌ చైల్డ్‌’ తండ్రికి మగ
పిల్లలు లేనంత మాత్రాన వంశవృక్షం ఆగిపోవద్దు అనే కొత్తకోణం స్త్రీ కూడా ఆ
అంటుకొమ్మ నుంచి వచ్చిన ఒక కొమ్మ కాబట్టి ఆ వంశవృక్షంలో ఆమెకు కూడా ఒక
శాఖను కేటాయించాల్సిందే. ఆ శాఖ పలుశాఖలుగా అభివృద్ధి చెందాల్సిందే. అందుకే ఆ
వంశవృక్షానికి అంటు కొమ్మ కట్టాల్సిన అవసరాన్ని స్త్రీవాద కోణంలో
చిత్రించడం జరిగింది.
ఈ దశాబ్దంలోనే చంద్రలత రచన ‘ఆవర్జా’ స్త్రీలపై కొనసాగుతున్న వివక్షను
తులనాత్మక పరిశీలన ద్వారా మరో కొత్తకోణం నుండి దర్శించిన కథ. స్త్రీకి ఒక
సహజధర్మం కలదు. ఇందులో అవమానంలేదు, అసహ్యం లేదు. సిగ్గు పడాల్సిందే లేదు.
చితికి పోవాల్సింది లేదు. ఋతుచక్రం ఆడవారిని అనుక్షణం శాసిస్తూనే ఉంటుంది.
రసాయన ప్రక్రియలు అదృశ్యరూపంలో ఆడిస్తూనే ఉంటాయి. నిత్యజీవితంలో
చెలరేగే ఈ సంఘర్షణ, ఒత్తిడి, ఆందోళన జీవ రసాయన ప్రక్రియను ప్రభావితం
చేస్తూనే ఉంటాయని రచయిత్రి చెప్పుతుంది. కథలో స్త్రీని గురించి
తల్లిదండ్రులు పడే ఆందోళన, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు,
ఉద్యోగరీత్యా ఒత్తిడి, సహోద్యోగుల నుంచి విమర్శలు, హేళనకు గురిచేసే మాటలు, ఉద్యోగ బాధ్యతలో సంభవించే స్త్రీ సమస్యల గురించి వివరించడం
జరిగింది. అలానే పురుషులకి, స్త్రీలకి మధ్య వున్న సమతుల్య తేడాను పేర్కొనడం
జరిగింది. అందుకే జీవితంలో శరీరధర్మాలకు కుటుంబ జీవనానికి / వ్యక్తి
స్వతంత్రానికి సంఘ వైఖరికి / వృత్తి గౌరవానికి సమాజ ధోరణికి / అస్తిత్వ సాధనకు అనంతవేదనకు / మానవ విలువలకు సృష్టి వైఖరికి నడుమ బ్యాలెన్స్‌ షీట్‌
ట్యాలీ కావడంలేదు. ఎక్కడో ఏదో ఎంట్రీ తప్పిపోయింది. కూడికలోనో,
తీసివేతలోనో, అంకగణాలలోనో, ఆవర్జాలోనో అంటూ పురుషతత్త్వానికి,
స్త్రీతత్త్వానికి మధ్య తులనాత్మక భేదం ద్వారా స్త్రీ ఎదుర్కొంటున్న
సమస్యలను చిత్రికరించారు. ఇదే కోణంలో కె.యన్‌.పలమనేరు బాలాజీ ‘సంకోచం’
కథలో పేర్కొన్నారు. చంద్రలత మరో రచన ‘కోలీగ్స్‌’ ‘అమ్మ పుట్టిల్లు’ కథలు
స్త్రీవాద ధోరణిలో కొనసాగుతున్నాయి. స్త్రీ ఎప్పుడూ పురుషుడి ఆధిపత్యానికి
లొంగి ఉండాలని స్త్రీకి స్వేచ్ఛను అడిగే హక్కు వుండదని అంటోంది పితృస్వామిక
వ్యవస్థ. ప్రేమ, సహజీవనం మధ్య ఏర్పడిన ఖాళీని జయించే ప్రయత్నంలో
రూపొందిన కథ కె.ఎన్‌.మల్లేశ్వరి ‘ఖాళీ’ స్త్రీవాదంతో ముడిపడిన కథ. ఈనాటి
సమాజంలో టి.వీ యాంకర్లు, సినిమా జీవితాలతో ముడిపడిన స్త్రీ జీవితాలను,
తెరమీద కనిపించే స్త్రీని సమాజం ఒక పబ్లిక్‌ ప్రాపర్టీగా చూసే సమాజాన్ని
చిత్రించారు. కథలో నేను బతకడానికి, ఆశల్ని బతికించుకోవడానికి జుట్టుకొసల్నుంచి
కాలివేళ్ళ వరకూ ఇంకో నేనుగా కనిపించడానికి! చివరికి యాంకరమ్మ ఎన్ని విలువల్ని
ధ్వసం చేస్తే ఈ మార్గం దొరికింది? విలువలు… ఏ విలువలు? మీరు చెప్పేవో, నేను
నమ్మేవో కాదు చిన్నతనం నుంచి కుటుంబం సమాజం నా చేత పాటింపజేసిన విలువలు…
నిరంతరం రగిలే అసంతృప్తిలోంచి ఖాళీలు ఏర్పడినాయంటారు. ఈ ఖాళీని పెళ్ళితో
పూరించే ప్రయత్నం చేసాననుకొని అతను పెట్టిన హింసకు మోయలేని స్థితిలో
విడిపోయాను. తర్వాత్తర్వాత ప్రేమలు చాలా పలకరించాయి. దానితో సహజీవనంలోని
మాధుర్యాన్ని ఆస్వాదిస్తే విడిపోవడంలో సులువు గురించి అతను మురిసిపోయాడు.
అందుకే కుటుంబం స్నేహితులు, భర్త, ప్రేమికులు, సహచరుడు నా హృదయాన్ని ఖాళీ చేసి
వెళ్ళిపోయారు. ఇప్పుడు యవ్వనం ఖాళీ చేస్తానని బెదిరిస్తుంది. నా యవ్వనం
చుట్టూ నేను బలంగా నిర్మించుకున్న హర్మ్యం కూలిపోతే నేనేం కావాలి? చిన్న
మానసిక రుగ్మత. అందుకే ఈ ప్రేమ, సహజీవనం మధ్య ఏర్పడిన ఖాళీని పూరించడానికి
స్త్రీవాద జీవితాలనుంచి రూపొందిన కథ.
దగ్గుపాటి పద్మాకర్‌ ‘ఈస్తటిక్‌ స్పేస్‌’ సమాజంలో జరుగుతున్న స్త్రీ
అత్యాచారాలు, స్త్రీ పురుష సంబంధాల విలువలను అభ్యుదయ దృక్పథంలో
చిత్రించిన కథ. ఆరి సీతారామయ్య రచన ‘పరివర్తన’ విదేశీ న్యాయవ్యవస్థను,
అక్కడి చట్టాలను, అవినీతి రాజకీయాలను ప్రశ్నిస్తూ దీపికారావు అనే స్త్రీకి
లైంగికహింసకు గురిచేస్తున్న భర్త హత్య చేసిన నేపథ్యంలో వచ్చిన కథ.
భాగ్యరేఖ రచన ‘ఇగురం’ కథ స్త్రీలు కూడా చదువుకోవాలని అప్పుడే వాళ్ళు
ఆర్థికంగా తమ కాళ్ళమీద తాము నిలబడగల్గుతారని చెబుతుంది. కథలో సుజాత అత్త
పెట్టే బాధలను దిగమింగుకుంటూ జీవనం గడుపుతుంటుంది. మహిళా స్వావలంబన అనేది
లేకుండా స్వతంత్య్ర, స్వేచ్ఛా జీవితాన్ని గడపకుండా తన సంసార జీవితాన్ని
బాధలతో అనుభవిస్తున్న స్త్రీమూర్తుల జీవితాలను వివరించారు. అలానే సుభద్ర
రాసిన ‘బాత్‌ రూం బీభత్సం’ కథ ఆడపిల్లలుండే సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో
ఆడపిల్లలకు నెలసరి ఋతుక్రమం / అబార్షన్‌ జరుగుతున్నాయి అనే అనుమానాలతో
ఆడపిల్లలను అవమానించడానికి సిద్ధంగా వున్న సమాజాన్ని చిత్రీకరించారు.
బలభధ్రపాత్రుని రమణి రచన ‘విశ్వద’లో స్త్రీలు ఎదుర్కొనే మరో సమస్య
చిత్రించబడిరది. ఈమె మరో కథ ‘పెంపుడు చిలుక’ స్త్రీవాద దృక్పథంలో ఓ మూగ
స్త్రీ వేదనను, ఆమెకు మాటలు వచ్చిన తరువాత భర్త నుంచి ఎదురయ్యే పురుష
అహంకారం ఆమెకు విడాకులు ఇప్పిస్తుంది. కె. భాగ్యశ్రీ ‘నిన్ను నువ్వు తెలుసుకో’కథలో ధరణి తన కుటుంబ సభ్యులందర్ని పోషించే బాధ్యతను తన నెత్తిమీద
వేసుకొని, వాళ్ళకోసం తన జీవితాన్నంతా త్యాగం చేశానని, మోడుగా
మార్చుకున్నానను కుంటుంది. దాని తరువాత పరిణామంలో తన కోసమే బతకాలని, ఎవరి
బాధ్యతల్ని వాళ్ళు తెలుసుకునేలా చెయ్యడంలో తాను విఫలమయ్యానని
తెలుసుకుంటుంది.
కుటుంబ సంబంధాలన్నింటి లోను అత్యంత ప్రధానమైనది వైవాహిక వ్యవస్థ. ఈ
భారతీయ వైవాహిక వ్యవస్థను ప్రశ్నిస్తూ చాలా కథలే వెలువడినాయి. ఆధునిక
వ్యవస్థ ఆరంభమైన కాలంనుండి వ్యవస్థలో మార్పులు సహజ సిద్ధంగా
ఏర్పడినాయి. ఈ ఆధునిక వ్యవస్థ నుంచి వ్యాపార సామ్రాజ్యం మొదలవ్వడంతో
ప్రతి అంశం ఆర్థిక విషయంతో ముడిపడడంతో సమాజంలో సంస్కృతి, సంప్రదాయ
సంబంధ బాంధవ్యాలు పెను మార్పులకు లోనవ్వడం ఒక ఎత్తు అయితే ఈ రెండు
దశాబ్దాల క్రితం మొదలైన ప్రపంచీకరణ సంస్కృతి వలసవాదాన్ని ప్రేరేపించి
మనుష్యుల్లో ఉన్న విలువలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే సాహితి ‘లివింగ్‌
టుగెదర్‌’ స్త్రీలకు పెళ్ళి అవసరమా? పెళ్ళి చేసుకోకుండా స్త్రీ బతకలేదా?
అన్న ఒక మౌలిక సమస్యను చర్చించింది. పిల్లలు కలిగాక కూడా ఒకప్పటి ప్రేయసిని
మర్చిపోలేని ఒక భర్త కథ ఇది. మారుతున్న మానవ సంబంధాల నేపథ్యంలో వివాహ
వ్యవస్థ తీరుతెన్నులను నిర్వచించిన కథ. అక్కిరాజు భట్టిప్రోలు ‘నందిని’ వివాహ
వ్యవస్థపై అసహనం, విదేశీ జీవననేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి
మనసు, వారి మధ్య ఆప్యాయత అవసరం కాని, వివాహ వ్యవస్థ కాదు అనే
నేపథ్యంలో భారతీయ వైవాహిక వ్యవస్థను ప్రశ్నించిన కథ. సాయిబ్రహ్మానంద
గొర్తి రచన ‘అతను’ స్త్రీ పై ఉన్న అహంభావం మనిషి నుంచి తన అస్తిత్వాన్ని
నిలబెట్టుకోవడానికి తన అనుబంధాన్ని (వివాహ వ్యవస్థలో ఉన్న తాళి బంధం)
వదిలేసి బయటకు వచ్చేసిన స్థితిని వివరించారు. దేవేంద్రచారి రచన ‘వాయిదా’ కన్న
కూతుర్ని ఓ కసాయి వాడికిచ్చి విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగే ఒక
అభాగ్యుడి కథ. ఈ సమాజంలో వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు,
రోజురోజుకు పెరుగుతున్న సమస్యలు, భారతీయ న్యాయవ్యవస్థపై అసహనం
వ్యక్త పరిచిన ఉదంతాలు ` ఇలా వివాహ వ్యవస్థకు సంబంధించిన సనాతన ఆచారాలు
భారతీయ గ్రామీణ సమాజంలో ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి.
ఈరంకి ప్రమీలాదేవి రచన ‘సంగమం’ భార్యను నిర్లక్ష్యం చేస్తూ స్నేహితుల్ని
సర్వస్వంగా బతికే మగవాడిని ఓ స్త్రీ తన అనుభవాన్ని చెప్పి మారుస్తుంది. వేదుల
శకుంతల ‘ఆదర్శానికి అడుగుదూరం’ కథలో కట్నం అడక్కుండానే తనను పెళ్ళి
చేసుకుంటానని వచ్చిన యువకున్ని అతడెంతో ఆదర్శవంతుడనుకొంటుంది. కాని తన
శీలాన్ని గురించి వాకబు చేశాడని తెలుసుకున్న వసంత షాకై పోతుంది. వాడ్రేవు
వరలక్ష్మిదేవి ‘ఇలావున్నాం’ కథలో ధనవంతుల ఇళ్ళలో పనిచేసే ఆడపిల్ల
సమస్యలను, ప్రభుత్వ పాఠశాలల్లో లేడి టీచర్స్‌, వ్యవసాయ కుటుంబాల్లో
ఉత్పన్న మయ్యే స్త్రీల సమస్యలను చర్చించారు. స్త్రీవాదులు ఇవాళ రాజకీయ
రాజ్యవ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. రాచపుండు, గంగజాతర (ప్రతిమ),
ముందడుగు (కొండవీటి సత్యవతి) లాంటి కథలు రాజకీయరంగంలో స్త్రీల వైనాన్ని
ప్రశ్నిస్తున్నారు. అలానే స్త్రీలు మతపరమైన అణచివేతల్లో కూరకుపోతున్న
విధానాన్ని షాజాహానా, గీతాంజలి కథలు ఆగ్రహంతో ప్రశ్నిస్తుండగా, కరువు,
ఫ్యాక్షనిజం భూతాల నోట్లో చిక్కుకున్న స్త్రీల బతుకుల్లోని వేదనను
చిత్రిస్తాయి. నిర్మలారాణి, రంగనాయకుల కథలు ప్రవాస జీవితంలో స్త్రీలు పడే
సంఘర్షణను చిత్రించే కథల్ని స్త్రీవాద కథల్లో ఓ భాగంగా చూడవచ్చు. ‘నిడదవోలు
మాలతీ (చివురుకొమ్మ, చేవ, నిజానికి ఫెమినిజానికి మధ్య, డాలక్ట్‌కో గుప్పెడురూకలు), శేషుశర్మ (అన్వేషణ, అగాధం) చినుటాకనుల(అమెరికా ఇల్లాలు) 21వ
శతాబ్దంలో స్త్రీల జీవన విధానాన్ని చిత్రిస్తున్న కథలు.
ఆ దశాబ్దంలో చిత్రించిన స్త్రీవాద నేపథ్యంతో వచ్చిన కథలన్నీ మంచి వస్తు
వైవిధ్యంతో, శిల్ప నైపుణ్యంతో వచ్చిన కథలే. ఈ కథలు ఈనాటి వ్యవస్థలో
దాగివున్న కనబడని కుల అస్తిత్వ సంస్కృతి, సంప్రదాయంలోని (దళిత, మైనారిటి,
గిరిజన వర్గాల) మూలాలను ఈనాటి స్త్రీవాద అస్తిత్వం భావజాలలను, స్త్రీ
సమస్యలను, స్త్రీ పై జరుగుతున్న అసాంఘిక దాడులను స్త్రీ అస్తిత్వంతో కూడిన
విశ్లేషణాత్మక కథలను ఈ దశాబ్దపు కథా సాహిత్యం వివరించింది. ఈ కథలన్ని
ప్రాపంచిక దృక్పథంతో ముడిపడి మంచి రచనలుగా రూపుదిద్దుకున్నాయని చెప్పవచ్చు.
ఉపయుక్త గ్రంథాలు:

  1. దశాబ్ది కథా సాహిత్యం సమగ్ర పరిశీలన డా.వి.అరుణ్‌ కుమార్‌
  2. స్త్రీవాద కవిత్వం భాష, వస్తు, రూప నవనీత డా. ఎమ్‌. ఎమ్‌. వినోదిని
  3. కుప్పిలి పద్మ. ‘ఇన్‌స్టంట్‌ లైఫ్‌’ వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం, 15
    అక్టోబర్‌, 2000.
  4. వాణీరంగారావు (వ్యాసం) ఆంధ్రప్రభ దినపత్రిక, తేది: 08.02.1992
  5. నూటపదేళ్ళ తెలుగు కథ విభిన్న ధోరణులు డా. కాలువ మల్లయ్య.
  6. స్త్రీవాద కవిత్వం ఒక పరిశీలన అద్దేపల్లి రామ్మోహనరావు.
  7. ముద్దెర, (తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద, సాహిత్య విమర్శ వ్యాసాలు),
    2005, రోహిణి పబ్లికేషన్‌, హైదరాబాద్‌.
  8. నల్లపొద్దుదళిత స్త్రీల సాహిత్యం గోగు శ్యామల.

డా. వి. అరుణ్‌ కుమార్‌,
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాల, హైదరాబాద్‌.
ఫోన్‌ : 9866892692

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *