సంక్షిప్తి:
భాష ప్రధానంగా రెండు రూపాలలో ప్రవర్తిల్లుతుంటుంది. మొదటిది మౌఖికవ్యవహారం. రెండు లిఖిత
వ్యవహారం. లిపి లేని భాషలను మాట్లాడే సమాజాలలో భాష మౌఖిక వ్యవహారంలోనూ, లిపి ఉన్న
సమాజాలలో మౌఖిక, లిఖిత వ్యవహారాలలో ప్రవర్తిల్లుతుంది.
ఏదైనా భాష యొక్క పరిణామాన్ని నిర్దిష్టంగా వివరించాలంటే లిఖిత భాషపై జరిపే పరిశోధనలు ఎంత
ఉపయోగకరమో మౌఖిక భాష మీద జరిపే అధ్యయనాలు కూడా అంత ఉపయోగకరం. ప్రతి భాషా వ్యవస్థకు
మౌఖిక, లిఖిత భాషలకు సంబంధించిన సమగ్ర వ్యాకరణాలు ఉండాలి. అప్పుడే ఆ భాష అభివృద్ది చెందినట్టు.
ప్రతి భాషా వ్యవహార సమాజంలోనూ ప్రాంతీయమైన, సాంఘికమైన భేదాలు ఉంటాయి. వీటిని సేకరించటం
అధ్యయనం చేయటం, అనువర్తిత రంగాలకు విస్తరించటం అనేవి సమాంతరంగా జరగవలసిన కార్యకలాపాలు.
ఈ కార్యకలాపం కదులుతూ పోతున్న చిత్రాన్ని వ్యాఖ్యానించడం వంటిది. మౌఖిక, లిఖిత వ్యవహారాల్లో భాష
పొందే క్రమ వికాసాన్ని నిరూపించడం అనేది ఒక బృందకార్యక్రమం. దీనిలో చాలామంది పరిశోధకులు
చాలాకాలంపాటు చేయడానికి కావాల్సినంత పని ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలకు ఆరంభాన్ని,
కొనసాగింపుని ఊహించగలంగానీ ముగింపుకు కొన్ని దశాబ్దులు పట్టవచ్చు. ఈ లోపు బహు విధాలుగా
అందుబాటులోకి వచ్చే ఫలితాంశాలను అనువర్తించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది భాషా
పరిశోధనలో లభించే గొప్ప సౌకర్యం. మేథానందాన్ని కలిగించే విషయం.
1. కీలక పదాలు:
మౌఖికవ్యవహారం, లిఖిత వ్యవహారం, కావ్యభాష, శాస్త్రభాష, సామాజిక భాషాశాస్త్రం, మాండలిక భేదం,
భాషాభివృద్ధి. భాషా విస్తృతి, వర్ణనాత్మక పద్ధతి.
2. పరిచయం:
మౌఖిక భాషకు, లిఖిత భాషకు గుర్తించదగిన భేద-సదృశాలుంటాయి. మౌఖిక వ్యవహారంలో భాషలో
వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. భిన్నమైన ఉచ్చారణ, ఊనిక, స్వరాలలో తేడాలు, మాండలిక భేదాలు
మొదలైనవన్నీ మౌఖిక వ్యవహారంలోనే గుర్తించగలం. భాషా వ్యవహార రంగాలు లిఖితభాషకు సంబంధించి
కొన్ని వ్యవహార పద్ధతులను ఏర్పరుస్తాయి. ఇందువల్ల ఏ వ్యవహర్త రాసిన రచనలోనైనా అంతర్లీనంగా
ఏకసూత్రత కనిపిస్తుంది-రాతలో వైవిధ్యం కోసం ప్రత్యేకించి ప్రయత్నిస్తే తప్ప.
సాధారణ రచనల్లో కనిపించని పూర్వ రూపాలు మౌఖిక వ్యవహారంలో వినిపిస్తుంటాయి. ఆధునిక
వ్యవహారంలో వాడే అనేకమైన అన్య భాషాపదాలకు, దేశీయమైన సమానార్ధ పదాలు, కాస్త ప్రయత్నిస్తే
మౌఖిక వ్యవహారంలో దొరుకుతాయి. అందువల్ల కావ్య, శాస్త్ర భాషలను అనుశీలించినట్టే మౌఖిక భాషను
కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ అధ్యయనాన్ని ఒక్క వ్యక్తి మౌఖిక వ్యవహారానికి పరిమితం
చేయవచ్చు; లేదా నిర్ణీతమైన భూభాగంలో నివసించే వ్యవహర్తలకు విస్తరింపచేయవచ్చు. భాషాశాస్త్రంలో
ఇందుకు తగిన పరిశోధన పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిని అనుసరించి పరిశోధన చేయాలన్నది మనం
ఉద్దేశించిన ప్రయోజనమూ, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
భాష ఏ ఏ రంగాలలో వాడుకలో ఉంది, ఆయా రంగాలకు సంబంధించిన వ్యవహర్తల రోజువారి
అవసరాలను అది తీర్చగలుగుతోందా, తగినంతగా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రస్తుత స్థితిని
అంచనావేసుకోడం ఎలా, తగిన కార్యాచరణ ప్రారంభించడం ఎలా, లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి, భవిష్యత్
కార్యాచరణ ప్రణాళికను ఎలా తయారుచేసుకోవాలి?… మొదలైన విషయాలపై అవగాహన పెరగాలంటే
భాషాశాస్త్ర పరిఙ్ఞానాన్ని ఇతోధికంగా చేసుకోవలసి ఉంటుంది.
3. పూర్వపరిశోధనలు:
సామాజిక భాషాపరిశీలనలో భాగంగా జరిపే ఇటువంటి అధ్యయనాలను తొలిసారిగా తెలుగు అకాడమి
1970లలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిజిల్లాలోనూ తిరిగి మౌఖిక వ్యవహార సమాచారాన్ని
సేకరించడం, ఆ సమాచారంలోని భాషావిశేషాలను బులెటిన్ల రూపంలో ప్రచురించడం, దీనినుంచి ప్రాంతీయ
మాండలిక వ్యాకరణాన్ని రచించడం, ఆపై మౌఖిక వ్యవహార భాషకు సమగ్రమైన వర్ణనాత్మక వ్యాకరణాన్ని
రచించడం ఈ కార్యక్రమం ప్రారంభించడంలోని ప్రధానమైన అంశాలు. క్షేత్ర పర్యటన జరిపి సేకరించిన మౌఖిక
వ్యవహార సమాచారం ఆధారంగా వృత్తిపదకోశాలు వెలువరించారు. ఏదో ఒక సందర్భంలో ఒక విషయంపై
వ్యవహర్తలు మాట్లాడిన సమాచారాన్ని సేకరించి(వ్యవహార ఖండికలు) ఆయా జిల్లాలలో తెలుగు భాషా వ్యవహార భేదాన్ని/మాండలికాలను ప్రకటించారు. ఈ పనులు శిక్షణ పొందిన పండితులు తెలుగు అకాడమి
ఆధ్వర్య్వంలో నిర్వహించినవి. క్షేత్ర పర్యటనల ఆధారంగా వెలువరించిన ఇటువంటి బృహద్, దీర్ఘకాల
ప్రయోజనకరమైన గ్రంథాలు ఇతర భారతీయ భాషలలో వెలువడిన దాఖలాలు అరుదు. A Dictionary of
Tamil Agricultural Vocabulary(N. Rajasekharan Nair and others, eds.) అన్న నిఘంటువు రెండు
దశాబ్దుల క్రితం ప్రారంభమై 2022వ సంవత్సరంలో 4,133 ఆరోపాలతో వెలుగుచూసింది. ఇతర భాషలలో
ఇటువంటి గ్రంథాలు వెలువడ్డాయా అన్నది పరిశీలించాలి.
విశ్వవిద్యాలయాలలో జరిగిన తెలుగు పరిశోధనలలో సాహిత్యాధ్యయనాలు ఎక్కువ. భాషపై జరిపిన
పరిశోధనలు తక్కువ. ఈ ఎక్కువ-తక్కువలకు సహేతుకమైన కారణాలు కనబడవు; రాగ-విరాగాలు తప్ప.
భాష, వ్యాకరణం, భాషాశాస్త్రం… మొదలైన అంశాలు ఉన్నత తరగతులలో ‘పరిచయం చేయడం’మన
విద్యావ్యవస్థలో ఉన్న ప్రధానమైన లోపం. ఈ లోప పూరణ ప్రయత్నం ఉన్నత తరగతులలో చేసినా,
నిలుపుకోగలిగే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం ఎక్కువ ఆశ్చర్యానికి లోనుచేసే అంశం! అలవాటు
పడిన అధ్యయనాన్ని, అధ్యాపనాన్ని అటు విద్యార్థులు, ఇటు బోధకులు సౌకర్యంగా భావిస్తుండడం దీనికి
కారణం కావచ్చు. ఇటువంటి పరిశోధనలు జరపడంవల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనాలు కొన్నిటిని ఈ
పత్రంలో వివరించే ప్రయత్నం జరిగింది. మరికొన్ని ప్రధానమైన అంశాలు సారాంశంగా కూర్చబడ్డాయి.
మౌఖిక భాష, మాండలికాలపై విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల సంఖ్య చాలాతక్కువ.
మహబూబ్ నగర్ జిల్లా తెలుగు వ్యవహారంపై డాక్టర్ అప్పం పాండయ్యగారి పరిశోధన 1989లో వెలువడింది.
తరువాత డాక్టర్ ఎస్. ఎస్. చంద్రయ్య (2017) తిమ్మాజిపేట మండల మౌఖిక భాషకు వర్ణనాత్మక
వ్యాకరణం రచించారు. ఇది హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖకు సమర్పించిన పిహెచ్. డి.
పరిశోధన గ్రంథం, డాక్టర్ మంత్రి మల్లేశ్ (2019) తెలంగాణ మాండలిక నవలలను భాషాశాస్త్ర దృష్టితో
అనుశీలించి ఇదే శాఖకు పిహెచ్.డి. పరిశోధన గ్రంథం సమర్పించారు. ఈ రంగంలో జరిగిన కృషిలో ఈ సిద్ధాంత గ్రంథాలు ప్రత్యేకంగా పేర్కొనదగినవి. ఈ రెండు పరిశోధన గ్రంథాలు డా. పమ్మి పవన్ కుమార్ పర్యవేక్షణలో రాసి సమర్పించినవి. డాక్టర్ ఎస్. ఎస్. చంద్రయ్య పరిశోధన గ్రంథంలో తిమ్మాజిపేట మండల(ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనిది) మౌఖిక వ్యవహారంలో వినిపించే అనేకమైన భాషావిశేషాలు వివరించబడ్డాయి. ‘బిడ్డ’
అనేమాట(కొన్ని సందర్భాలలో సంబోధన) మహన్మహతీ వాచకాలకు వాడడం ఈ మండలంలో ఉంది. తెలంగాణ ప్రజల సాధారణ వ్యవహారంలో ‘బిడ్డ’ అన్నమాటను ఆడపిల్లను సూచించడానికి వాడతారు.
బహువచనార్థంలో కొంత ప్రాచీనతను నిలుపుకొన్న కోడండ్లు(కోడళ్ళు), తమ్ముండ్లు(తమ్ముళ్ళు),
గొంగండ్లు(గొంగళ్ళు)… వంటి రూపాలు ఈ మండలంలో నేటికీ వినిపిస్తున్నాయి. చేతులు అనే బహువచన
రూపానికి, ఏకవచనంలో ‘చేతు’/‘షేతు’(చేయి) రూపాలు ఈ మండలంలోని ప్రజల వ్యవహారంలో ఉన్నాయి.
మాన్యతా వాచకాలలో ‘-అమ్మ’, ‘-గారు’, ‘-వారు’ రూపాలను ఈ మండలంలోని వ్యవహర్తలు వాడుతున్నారు.
కాని, ‘-వారు’ ని, ఈ వ్యవహర్తలు బహువచనార్థంలో మాత్రమే వాడుతున్నారు తప్ప మాన్యతా వాచకంగా
వ్యవహరించడంలేదు.
రెండు వందలును సూచించే ‘ఇన్నూరు’, మూడు వందలును సూచించే ‘మున్నూరు’ వంటి ప్రాచీన
రూపాలు ఇప్పటికీ ఈ మండలంలో వ్యవహారంలో నిలిచిఉన్నాయి. అలాగే, సంఖ్యావాచకంగా ‘ఒకటి’ని
సూచించడంలో మహద్వాచకంలో-వొకడు, వొగడ్, వొగడు, వొక్కడు, వొక్కాయన, వొగాయన… వంటి
రూపాలు వినిపిస్తుంటాయి. మహన్మహతీ వాచకంలో- ఒకరు, ఒగరు వంటి రూపాలూ, మహతీ వాచకంలో-
వొక్కతె, వొగామె రూపాలూ వినిపిస్తున్నాయి. మహతీతర అమహద్వాచకంగా- వొ, వో, వొక, వొగ, వొకటి,
వొక్కటి, వొగటి, వొంటి, వోటి… వంటి రూపాల వాడకం ఈ మండలంలో ఉంది. ఇంతటి ఉచ్చారణ వైవిధ్యం,
రూపాంతర ప్రయోగాలు… మొదలైన విశేషాలను గుర్తించడం సుశిక్షితులైన పరిశోధకులకు మాత్రమే
సాధ్యపడుతుంది.
డాక్టర్ మంత్రి మల్లేశ్ (2019) తెలంగాణ మాండలిక నవలలపై చేసిన అనుశీలనలో కూడా తెలంగాణ
ప్రాంత వ్యవహారంలోని వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. హల్లుల వర్ణాంతరతలో(variation of consonants)
‘చాలా’ అనే అర్థంలో ‘శాన, సాన’ అనే రూపాలు, ‘మిరప(కాయ)’ అనే అర్థంలో ‘మిర్ప, నిర్ప’ అనే రూపాలు,
‘డప్పు’ అనే అర్థంలో ‘డప్పు, దప్పు’ అనే రూపాలు, ముందర-ముందల, ముంగల-ముందల, ఇటువంటి-
ఇసొంటి, మీద-మీన… వంటి వర్ణాంతరత పొందిన రూపాల వాడకం కనిపిస్తుంది.
తెలంగాణ ప్రాంత వ్యవహారంలోని హల్సంధిరూపాలలో వైవిధ్యం ఎక్కువ. అజంత లేదా నాద హలంత
పూర్వపదాలకు, శ్వాసహల్లు ఆదిగాఉన్న పరపదం చేరినపుడు ఆ పర పదంలోని శ్వాస హల్లు నాదంగా
మారినరూపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదా. జూత్తున్నం+కద=జూత్తున్నంగద,
మోట+కొడ్తడు=మోటగొడ్తడు, సల్ల+పడ్తున్న=సల్లబడ్తున్న. అలాగే, వర్ణ సమీకరణం పొందిన రూపాలుకూడా
ఈ ప్రాంత వ్యవహారంలో ఎక్కువే. ఉదా. అడుగు+కుంట=అడుక్కుంట, పెరుగు+కుంట=పెరుక్కుంట, నాకు+గింత=నాగ్గింత, మీది+ది=మీద్ది మొదలైనవి. తెలంగాణ వ్యవహారంలోనూ, రచనలలోనూ ఉర్దూ, పర్శో-
అరబిక్ పదాలు విరివిగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అసలు, ఇనాం, కతం, కానూన్, కిరాయి, కుషి, ఖబర్,
గరమ్, గలీజ్, జాగ, తమాషా, తారీకు, దుకానం, పరేశాన్…మొదలైనవి నిత్య వ్యవహారంలో వినిపించే
మాటలు. ఇటువంటి అధ్యయనాలు జరపడంవల్ల భాషాగతితార్కికత బాగా అవగాహనలోకి వస్తుంది.
భాషాభివృద్ధి-భాషా విస్తృతి రెండు పాయలుగా సాగి, అన్ని వ్యవహార రంగాల భాషావసరాలను తీర్చగలిగేదిగా
తెలుగుభాష వృద్ధి చెందుతుంది.
4. భాషాభివృద్ధి-భాషా విస్తృతి:
భాషాభివృద్ధి వేరు-భాషావిస్తృతి వేరు. ఈ రెండూ ఒకటని సాధారణంగా భ్రమపడుతుంటారు. పరస్పర
సంబంధాన్ని కలిగిఉండే ఈ రెండు విషయాలు భాషాభివృద్ధి, విస్తృతిలో ద్విపుటిగా సాగుతూ కీలకమైన
పాత్రను పోషిస్తాయి. శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించగలిగేదిగా భాష ఎదగటం భాషాభివృద్ధిలో భాగం. వ్యవహారంలో
భాష వాడకం పెరగడం భాషావిస్తృతి. ఉదాహరణకు; తెలుగుభాషా వ్యవహర్తలు ఇంటా-బయటా
(ప్రపంచవ్యాప్తంగా) 80 మిలియన్లకు పైగా ఉన్నారు. వీరిలో ఎందరు తమ శాస్త్ర జ్ఞానాన్ని పంచుకోడానికి
తెలుగు భాషను వాడుతున్నారన్నది ప్రధానం. ఇది భాషాభివృద్ధిని అంచనాకట్టడానికి ఉపకరించే అంశం.
ఎక్కువ మందికి సంబంధించిన వ్యవహార రంగాలలోని శాస్త్ర జ్ఞానాన్ని పంచుకోడానికి తెలుగు భాషను
వాడుతుంటే అప్పుడు భాషాభివృద్ధి జరిగినట్టు.
వ్యవహారంలో భాష వాడకం పెరగడాన్ని భాషాభివృద్ధిగా చూపడం సౌకర్యవంతమైన ప్లుతి. భాషాభివృద్ధి
వ్యూహరచన అన్నది ఒక బృహత్ కార్యక్రమం. ఈ బాటలో సాగడానికి నిరంతర అధ్యయనం,
భాషాశాస్త్ర(వ్యాకరణ)జ్ఞానం, పరిశోధనలు… గణనీయంగా సహకరిస్తాయి. రోజువారి కార్యకలాపాలలో తమ
భాషను వాడడం, సాంస్కృతిక ఆత్మాభిమానాన్ని కలిగిఉండడం అన్నవి భాషా విస్తృతికి కొంత సహకరిస్తాయి
కాని, అభివృద్ధిచెందిన భాషలుగా మన భాషలను నిలబెట్టగలిగేవి కావు. భాషాభివృద్ధి-భాషా విస్తృతులకు
సంబంధించిన కార్యకలాపాలు నిరంతరం సమతూకంగా జరిగినపుడు, ఆ భాష అభివృద్ధి చెందిన భాషగా
నిలవగలుగుతుంది, మనగలుగుతుంది.
5. భౌగోళిక హద్దులగుర్తింపు-జాగ్రత్తలు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రధానంగా తెలుగు వ్యవహార ప్రాంతాలు. ఇతర రాష్ట్రాలలోకూడా
తెలుగు భాషావ్యవహర్తలు ఉన్నా, ఆయా రాష్ట్రాలలోని ప్రధాన వ్యవహారభాష మాట్లాడేవారికన్నా తెలుగు
భాషావ్యవహర్తల సంఖ్య తక్కువ. మన దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో
తెలుగువారున్నారు. వీరందరి భాషాభివృద్ధి-భాషావిస్తృతి సూచులు తయారు చేయవచ్చు. కాని, ఇవి
వ్యక్తిగతంగా చేయదగిన పరిశోధనలు కావు. వ్యవస్థలు నిరంతరాయంగా, సుదీర్ఘకాలంపాటు
నిర్వహించవలసిన బాధ్యతలు. పరిశోధకుడు ఒక వ్యక్తి కేంద్రంగా(వ్యక్తిగత మాండలికం) పరిశోధన
చేయదలచుకొన్నా, ఒక సమూహానికి సంబంధించిన భాషాధ్యయనం చేయాలన్నా ముందుగా వీరికి
సంబంధించిన భౌగోళిక హద్దులను జాగ్రత్తగా గుర్తించవలసి ఉంటుంది. తెలుగు భాషకు ప్రధాన వ్యవహార
ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భౌగోళికంగా కొన్ని ప్రత్యేకతలున్నాయి. నదులు,
సముద్రం(సముద్రాలు), పర్వతాలు, కొండలు, అటవీప్రాంతాలు, బహుభాషావ్యవహార ప్రాంతాలు, కొత్తగా
ఏర్ప(డిన)డే భౌగోళికహద్దులు, అతిగా విస్తరించిన పారిశ్రామిక వాడలు… మొదలైనవన్నీ ఆయా ప్రాంతాలలో
నివసించే ప్రజల భాషావ్యవహారాన్ని నియత్రింస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడివడిన
తరువాత ఏర్పడిన కొత్త జిల్లాలు, మండలాలు… వీటి భౌగోళిక హద్దులలో వస్తున్న మార్పులు, కూర్పులు
మొదలైనవన్నీ, పరిశోధన ప్రాంతాల ఎంపికలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- ఉత్తరాన, వాయవ్య దిక్కులలో మహరాష్ట్రతోనూ(మరాఠి<ఇండో-ఆర్యన్), దక్షిణ
దిక్కున తమిళనాడు(తమిళం<ద్రావిడ) రాష్ట్రంతోనూ సరిహద్దులను కలిగిఉంది. తూర్పున బంగాళాఖాతం
ఉంది. పశ్చిమాన కర్ణాటక(కన్నడ<ద్రావిడ) రాష్ట్రంతోనూ, ఈశాన్యంలో మధ్యప్రదేశ్(హింది, బఘేలి,
అవధి<ఇండో-ఆర్యన్), ఒడిషా(ఒడియ<ఇండో-ఆర్యన్) రాష్ట్రాలతోనూ భౌగోళిక సరిహద్దులను కలిగిఉంది.
ఇక, తెలంగాణ రాష్ట్రం- ఉత్తరాన మహరాష్ట్ర(మరాఠి<ఇండో-ఆర్యన్), చత్తీస్ ఘడ్(చత్తీస్ ఘడి,
హింది<ఇండో-ఆర్యన్) రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిఉంది. పశ్చిమాన కర్ణాటక(కన్నడ<ద్రావిడ)
రాష్ట్రంతోనూ, దక్షిణ, తూర్పు దిక్కులలో ఆంధ్రప్రదేశ్(తెలుగు<ద్రావిడ) రాష్ట్రంతో సరిహద్దులను కలిగిఉంది.
తూర్పున సుదీర్ఘమైన సముద్రతీర ప్రాంతంఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తక్కిన భూభాగానికి
ఐదు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం నాలుగు రాష్ట్రాలతో పరివేష్టితమై ఉంది.
ఇటువంటి భౌగోళికమైన హద్దుల గుర్తింపుతో ఒక చిక్కుఉంది. ఈ విధమైన విభజన రాజకీయ, ఆర్థిక, (పాక్షికంగా) సాంఘిక కార్యకలాపాలకు ఉపకరించినట్టుగా భాషాధ్యయనానికి ఉపకరించవు. వ్యవహర్తల
భాషావ్యవహార గమనం, ఇటువంటి భౌగోళికమైన హద్దులకు భిన్నమైన దారులలో, పద్ధతులలో సాగుతుంది.
కాబట్టి, భాషాధ్యయనానికి ఈ విధమైన హద్దులను గుర్తించడంకన్నా, మాండలిక వ్యవహార ప్రాంతాలనే
విభాగాన్ని పరిచయంచేసిన పూర్వ పరిశోధకులు అవలంబించిన పద్ధతిని పాటించడంవల్ల కలిగే ప్రయోజనం
ఎక్కువ. మాండలిక వ్యవహార ప్రాంతాలలోని ఉపప్రాంత విభజనకు భౌతికమైన హద్దులను గుర్తించే పై పద్ధతిని అనుసరించవచ్చు.
6. తెలుగు మాండలిక వ్యవహార ప్రాంతాలు:
పై విభాగంలో చర్చించిన భౌగోళికమైన హద్దులను గుర్తించే పద్ధతికి ఇది భిన్నం. తెలుగు వ్యవహార
ప్రాంతాన్ని ప్రధానంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తా, కళింగాంధ్ర అనే మాండలిక వ్యవహార ప్రాంతాలుగా
పూర్వ భాషాశాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ విభజనలోని అంతర్విభాగాలను(భాష వాడుక/ వైవిధ్యం
ఆధారంగా) వివరించడానికి విస్తృతంగా సామాజిక భాషా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు
కళింగాంధ్ర ప్రాంతంలోని విజయనగరం ప్రాంతంలో ‘చీమ’ అన్న పదాన్ని ఇదే ప్రాంతానికి దగ్గరగా ఉన్న
నర్సీపట్నం, ఎలమంచిలి ప్రాంతాలలో ‘చీవఁ’ గాను, చోడవరం ప్రాంతంలో ‘ఛీమ’ గాను వ్యవహరిస్తారు. అలాగే
‘కన్ను’ బహువచన రూపంగా ‘కల్లు’ అనే వ్యవహారం విజయనగరం ప్రాంతంలో వినిపిస్తుంది. ఇదే అర్ధంలో
‘కండ్లు’ అనే వ్యవహారం భీమునిపట్నం ప్రాంతంలో వినిపిస్తుంది. విశాఖపట్నంలోని తక్కిన ప్రాంతంలో ‘కళ్ళు’
అనే రూపం వినిపిస్తుంది.
ఇదే వ్యవహార ప్రాంతంలో బంధువాచక పదమైన ‘వియ్యంకుడు’ అనే మాటకు మాడుగుల, చోడవరం,
ఎలమంచిలి ప్రాంతాలలో ‘ఈరకాడు’ అనే మాట వ్యవహారంలో ఉంది. ‘వియ్యపురాలు’ను ‘యీరకత్తె’ అని ఈ
ప్రాంతంలో పిలుస్తారు. ఒకే మాండలిక వ్యవహార ప్రాంతంలో కనిపిస్తున్న ఈ రూప వైవిధ్యం క్షేత్రస్థాయిలో
సమాచారాన్ని సేకరిస్తున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలను భాషాపరిశోధకులకు గుర్తుచేస్తుంది. ఇటువంటి
పరిశీలన తెలుగు రాష్ట్రాలలోని ఇతర మాండలిక వ్యవహార ప్రాంతాలలోకూడా చేయడంవల్ల మరిన్ని విశేషాలు
తెలుస్తాయి. సామాజిక భాషాశాస్త్ర పద్ధతి ఇటువంటి అధ్యయనాలకు మిక్కిలిగా తోడ్పడుతుంది.
7. వ్యవహర్తలఎంపిక-సమాచార సేకరణ:
సాంఘిక భాష లేదా సామాజిక భాషా శాస్త్ర పద్ధతిలో జరిపే పరిశీలనలో వ్యవహర్తల ఎంపిక జాగ్రత్తగా
చేయవలసి ఉంటుంది. వ్యవహర్తల విద్యా స్థాయి, కులం, వృత్తి లేదా ఉద్యోగం, వయసు, స్త్రీ-పురుష భేదాలుసాంఘిక స్థితి గతులు మొదలైన అంశాలకు ఈ అధ్యయనంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వీటిలోని ప్రతి అంశంలోనూ మరెన్నో ఉపవిభాగాలను సాధించే అవకాశం ఉంది. ఉదాహరణకు వ్యవహర్తల విద్యాస్థాయి అన్న విభాగాన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక, కళా సాహిత్య సంబంధ, సామాజిక శాస్త్ర సంబంధ, వృత్తి విద్యా సంబంధ, వృత్తి ఆధార సంబంధ… మొదలయిన అంతర్విభాగాలను చేసి అనుశీలించే అవకాశం ఉంది. ఇలాగే తక్కిన అంశాలలోనూ ఉప అంశాల విశ్లేషణకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.
వ్యవహర్తల నుంచి సమాచారం సేకరించే సందర్భాల్లో ఒక నిర్దిష్టమైన అంశాన్ని సూచించి
సమాచారాన్ని సేకరించవలసిన అవసరం లేదు; నిర్ధిష్టమైన ప్రయోజనంకోసం సేకరిస్తున్న సమాచారం
అయితే తప్ప. వ్యవహర్తకు తోచిన అంశంపై మాట్లాడిన అంశాలను పరిశోధకులు సేకరించి దానిని వివిధ
రంగాలకు సంబంధించిన వ్యవహార ఖండికలుగా గ్రహించి అధ్యయనం చేయవచ్చు.
మౌఖిక భాష సేకరించే సందర్భంలో ప్రాంతాలకు సంబంధించిన నైసర్గిక స్వరూపాన్ని, లక్షణాలను
విధిగా పేర్కొనాలి(పై ఉపవిభాగాలలో పేర్కొన్నట్టుగా). వ్యవహర్తల నుంచి సమాచారాన్ని సేకరించడానికి
ప్రశ్నావళిని రూపొందించుకోవడం మంచి పద్ధతి. ఇటువంటి ప్రశ్నావళులు రూపొందించుకోవడంలో
పరిశోధకులకు ఒక సౌలభ్యం ఉంది. ఇప్పటికే పరిశోధకులు సిద్ధం చేసి ఉంచిన ప్రశ్నావళిని తమ పరిశోధనల కోసం వినియోగించుకోవచ్చు లేదా వాటిని ప్రాంతీయమైన అవసరాలకు అనుగుణంగా మార్చుకొని వినియోగించుకోవచ్చు. ప్రశ్నావళి అతి సంక్షిప్తమూ, అతి దీర్ఘమూ కాకుండా చూసుకోవాలి. కేవలం
ప్రశ్నావళికి మాత్రమే పరిమితమై సమాచారాన్ని సేకరిస్తే సమాచారంలో వైవిధ్యం కుంటుపడుతుంది.
ప్రశ్నావళిలోని ప్రశ్నలు-వ్యవహర్తల మనోభీష్టం మధ్యపరిశోధకులు క్షేత్రస్థాయిలో సమతూకాన్ని
సాధించవలసి ఉంటుంది. ప్రశ్నలలో ఉద్దేశించిన విషయానికి వ్యవహర్తలు దూరంగా జరుగుతున్నప్పుడు
పరిశోధకులు వారిని నియంత్రించకూడదు. వైవిధ్యభరితమైన అంశాలను, స్థానిక విశేషాలను, దైనందిన జీవిత సంబంధ అంశాలను, వృత్తి వ్యాపకాలను, ఉద్యోగ సంబంధ విషయాలను ముచ్చటించేందుకు వ్యవహర్తలు మక్కువ చూపుతారు. విషయ వైవిధ్యం పెరిగే కొద్ది సమాచారంలో వైవిధ్యం పెరుగుతుంది. ఇటువంటి సమాచారాన్ని విశ్లేషించేటప్పుడు విశేషాంశాలను గుర్తించడంలో, వాటిని వివరించడంలో పరిశోధకులకు సౌలభ్యం పెరుగుతుంది.
సమాచారం సేకరిస్తున్న భౌగోళిక ప్రాంతం, బహుభాషా వ్యవహార ప్రాంతంతో సంబంధాన్ని కలిగి
ఉన్నదైతే అక్కడి భాషలో వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు భాషల మేళనం ఇక్కడి వ్యవహారంలో సాధారణ లక్షణం అవుతున్నపుడు ఏది మాతృ భాషా పదం, ఏది అన్యదేశ్యం, ఏది మాండలికం? అనేవి గుర్తించడానికి అవకాశం చిక్కుతుంది. అలాగే విద్యావంతుల, అవిద్యావంతుల భాషా వ్యవహారంలో వినిపించే మార్పులను జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. తెలుగు వ్యవహర ప్రాంతాలన్నిటా ఇటువంటి అధ్యయనాలు జరిపి వాటి విశేషాలను వర్ణనాత్మక పద్ధతిలో అధ్యయనం చేస్తే తప్ప ఈ విశేషాలు వెలుగులోకి రావు. సమగ్ర నిఘంటువు, సమగ్ర వ్యాకరణం వంటివి… ఎప్పటికీ పూర్తిచేయవలసిన పనులుగానే మిగిలిపోతాయి. ఇటువంటి అధ్యయనాంశాలను గ్రహించి పరిశోధనలు జరపడానికి యువతరానికి పుష్కలమైన వనరులున్నాయి, అవకాశాలున్నాయి, భవిష్యత్తుఉంది.
క్షేత్ర పర్యటనలు జరిపి, వ్యవహర్తలనుంచి సేకరించే మౌఖిక సమాచారానికి పూర్వ లిఖిత
ఆధారాలుండవు. సేకరించిన సమాచారమే పరిశోధనకు ప్రధాన ఆకరం; కాబట్టి, ఇది పరిశోధన గ్రంథంలో
తప్పనిసరిగా భాగం చేయవలసి ఉంటుంది. పరిశోధకులు వివరించిన విశేషాంశాలను, సూత్రాలను,
సిద్ధాంతాలను పూర్తిగా అవగాహన చేసుకోడానికి, పునస్సమీక్షించడానికీ వ్యవహర్తలనుంచి సేకరించిన
సమాచారమే (సమకాలీన) తరువాతి పరిశోధకులకు ప్రధాన ఆకరంగా ఉపయోగపడుతుంది. జానపద,
గిరిజన సాహిత్యాధ్యయనాలలోనూ, సామాజిక భాషాశాస్త్ర, సామాజిక శాస్త్రాల అధ్యయనంలోనూ ఈ పద్ధతి
ఆచరణలో ఉన్నదే అయినా, మరోసారి ప్రస్తావించడం- కొత్తతరం పరిశోధకులు తప్పనిసరిగా గుర్తుంచుకోడం
కోసం మాత్రమే.
8. ఇటువంటి పరిశోధనలవల్ల కలిగే ప్రయోజనాలు:
- తెలుగు(మౌఖిక)భాషకు వర్ణనాత్మక వ్యాకరణాలను రచించవచ్చు. సమకాలీనులకు, తరువాతి
తరాలవారికి ఉపయోగపడే అనేకమైన అనువర్తనలను వీటినుండి సాధించవచ్చు. - సేకరించిన సమాచారం ఆధారంగా వివిధ అవసరాలకు తగిన పదపట్టికలను తయారుచేయవచ్చు.
- తెలుగు భాషకు బృహన్నిఘంటువును కూర్చడంలో సహకరించే నైఘంటిక వనరులను
సాధించవచ్చు. - తెలుగు మాండలికాలలోని వైవిధ్యాన్ని, ఏకత్వాన్ని నిరూపించవచ్చు.
- ప్రజల రోజువారి అవసరాలను తీర్చగలిగే సమాచారాన్ని వారి(స్థానిక) భాషలోనే అందించి
సమాజాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చు. - వివిధ స్థాయిల అవసరాలకు తగినవిధంగా విద్యాబోధన సామగ్రిని(వాచకాలు తదితరాలు…)
తయారు చేయవచ్చు. - వివిధ స్థాయిలకు- (ముఖ్యంగా; ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలకు) తగిన నైఘంటిక వనరులను
కూర్చవచ్చు. - మాధ్యమరంగాలలో ప్రాంతీయభాష వాడుకను పెంచవచ్చు.
- ప్రాంతీయభాషలలో సరళమైన అనువాదాలను అందించవచ్చు.
- అక్షరాస్యత శాతాన్ని పెంచవచ్చు.
- ప్రపంచవ్యాప్తంగాఉన్న ఒకే భాషా వ్యవహర్తల సమూహాలను గుర్తించి, వీరందరి ఉమ్మడి వృద్ధి
సాధనంగా భాషను వినియోగించవచ్చు. - భాష వాడుక, వాడుక విధానాల మదింపు, వృద్ధి కార్యక్రమాలను నిర్వహించవచ్చు.
- వ్యాకరణం, భాషాశాస్త్రం, సామాజిక భాషాశాస్త్రం… మొదలైన శాస్త్రాల అభివృద్ధికి కావలసిన
మౌలికమైన వనరులను పొందవచ్చు. - మానవాభివృద్ధి, వికాసంలో భాషవాడుక, దానిపాత్రను నిరూపించవచ్చు.
- భాష-సంస్కృతుల సంబంధ సమాచారాన్ని అధ్యయనంచేసి విలువైన విషయాలను ప్రకటించవచ్చు.
సాంస్కృతిక ప్రసరణ సాధనంగా భాష పొందుతున్న క్రమ వికాసాన్ని అధ్యయనం చేయవచ్చు. - వివిధ కళలు-భాషల సహచర సంబంధాన్ని నిరూపించవచ్చు.
- వివిధ సైగలు, సంజ్ఞలు, బొమ్మలు, గుర్తులు… మొదలైనవాటిని అధ్యయనంచేసి వాటివిశేషాలను
ప్రకటించవచ్చు. - భాషాసంకేతజ్ఞ ఉపకరణాలను (language technology tools) వాడుతూ, భాష వినియోగానికి
సంబంధించిన ఉపకరణాలను తయారు చేయవచ్చు.
9. ఉపయుక్త గ్రంథ/ఆకర సూచి:
9.1 తెలుగు:
1. ఉషాపన్నాల. 1998. తెలుగు మాండలికాలు-రంగారెడ్డి జిల్లా. హైదరాబాదు: తెలుగు అకాడమి.
2. కృష్ణమూర్తి, భద్రిరాజు. 2010. తెలుగు భాషాచరిత్ర. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం.
3. రాధాకృష్ణ, బూదరాజు. (సంపాదకులు). 2004(reprint) తెలుగు మాండలికాలు-విశాఖపట్టణం జిల్లా.
హైదరాబాదు: తెలుగు అకాడమి.
4. రామారావు, చేకూరి. 2003. భాషాపరివేషం. ఖమ్మం: సాహితీస్రవంతి.
5. శ్రీవిద్య, చిరువోలు. 2003. తెలుగు మాండలికాలు-తూర్పుగోదావరి జిల్లా. హైదరాబాదు: తెలుగు
అకాడమి.
6. సుబ్రహ్మణ్యం, పి.యస్. 1997. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
9.2 పరిశోధన గ్రంథాలు:
7. చంద్రయ్య, ఎస్. 2017. తిమ్మాజిపేట మండల మౌఖిక భాష: వర్ణనాత్మక వ్యాకరణం. పిహెచ్.డి. పట్టం కోసం తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధన గ్రంథం. పర్యవేక్షకులు డా. పమ్మి పవన్ కుమార్.
8. మల్లేశ్, మంత్రి. 2019. తెలంగాణ మాండలిక నవలలు: భాషాపరిశీలన. పిహెచ్.డి. పట్టం కోసం తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధన గ్రంథం. పర్యవేక్షకులు డా. పమ్మి పవన్ కుమార్.
9.3 English:
9. Crystal, David. 2000. Language Death. Cambridge: Cambridge University Press.
10. Suzanne Romaine. 2000. Language in Society-An Introduction to Sociolinguistics. Oxford: Oxford University Press.
ఆచార్య పమ్మి పవన్ కుమార్
తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
ఫోన్: 98664 86934.