చారిత్రక నేపథ్యం గల ప్రబంధం – కళ్యాణ  రాజ చరిత్రము

సామాజిక స్పృహతో కూడిన స్పందనకు, నైతికవిలువల రక్షణకు సంస్కృతి యొక్క సమగ్ర
చరిత్ర అవసరమని సామాజిక శాస్త్రవేత్తలందరు అంగీకరించిన విషయం. కానీ,
అధ్యయనరీతుల్లో అసంపూర్ణత వల్ల ఎన్నో చారిత్రకాంశాలు అస్పష్టంగానే
ఉన్నాయి. ఈనాడు లభ్యమవుతున్న ప్రాచీన గ్రంథాలన్నింటిని సమగ్రంగా,
చారిత్రకంగా పరిశీలించడం చాలా అవసరం. దాని ద్వారా పురావస్తు అవశేషాలు,
శాసనాలు మొదలైన ప్రత్యక్షాధారాలు లేని కాలానికి సంబంధించిన సంస్కృతి
వైవిధ్యాన్ని కూడా తెలుసుకోవచ్చు.
వైదిక కాలం నుండి నేటివరకు విలసిల్లిన సాహిత్యం ఒక అనూచాన మతానికి కట్టుబడి
ఉండటం విశేషం. అందువల్ల శతసహస్రాధిక గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయినా నేడు
లభిస్తున్న ప్రతి పుస్తకం భారతీయ సామాజిక, చారిత్రక, సంస్కృతికి అద్దం
పట్టేవే. ఉత్తమ గ్రంథాలు స్వభావ సిద్ధమైనవి. అందువల్లనే వ్యాఖ్యాన
రీతులు ఏర్పడి, వ్యాఖ్యాన సాహిత్యంలో ప్రాచీనార్వాచీన గ్రంథాలను ఏకార్థ
బోధకాలుగా చూడటం మన సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత! వీటిని చారిత్రకంగా కూడ
పరిశీలించి సంస్కృతిలో ఏర్పడిన మార్పులను, చేర్పులను నిర్ణయించవచ్చు.
అందువల్ల ఇతిహాసాలుగా పేరున్న రామాయణ, మహాభారతాలు శాస్త్రం, స్మృతి,
ఆగమం, దర్శనం, అలంకారం ఇలాంటివే కాక చరిత్ర కూడ అవుతాయి.
చారిత్రక కావ్యాలపై పరిశోధన చేసిన బి. అరుణకుమారి మాటలను మనం ఒకసారి
గమనిస్తే ‘‘ఆయా కాలములందలి ప్రజా జీవన విధానములను ఎత్తి చెప్పుట యందు
చరిత్రకు సాహిత్యమునకు ఉమ్మడి భూమిక ఉంది. చారిత్రక కావ్యములందు గల
విశేషమిదియే. తెలుగుల సంస్కృతి మిక్కిలి ఉత్తమమైనదే కాక, కడు ప్రాచీనమైనది.
కాలానుసారముగ వెలువడిన సాహిత్యమున్నది గాని చరిత్రలు చెప్పుకొనదగినంతగ
లేవు. అందువలన చారిత్రక కావ్యములకొక విశిష్టత అబ్బినది. చారిత్రక కావ్య
రచన యొక ప్రక్రియjైు భాసించింది. ఆంధ్ర వాఙ్మయమున నేటి వరకు చారిత్రక
కావ్యములు లెక్కకు మిక్కిలిగనున్నవి’’ అని చారిత్రక కావ్యాల ప్రాధాన్యతను
తెలిపారు.
చారిత్రక కావ్యాలు అటు పౌరాణికాలూ కాదు, ఇటు పూర్తిగా కల్పితాలు కాదు,
నిజస్థితికి కల్పనలు అద్ది రచింపబడినవే చారిత్రక కావ్యాలు. చరిత్ర రచనకీ,
కావ్య రచనకీ తేడా ఉన్నా పరస్పర ఉపయోగాలు, పరస్పర ఆశ్రయాలు చరిత్రకి
కావలసిన అత్యవసరమైన ప్రామాణికత కావ్యంలో కనిపించకపోవచ్చు. కానీ,
చారిత్రక కావ్యాలకి యథార్థాలు చమత్కారంగా చెప్తాడు కవి. ఎంత కల్పన చేసినా
కవి తన కాలంనాటి సంఘాన్ని పూర్తిగా విస్మరింపలేడు. కాబట్టి చరిత్రకీ,
కావ్యానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. చారిత్రక కావ్యాలంటే ఏమిటి? రాజులు,
రాజవంశాలు, రాజులనాటి సాంఘిక రాజకీయ సంఘటనలు, సంస్థానాధీశులు, ప్రముఖ
వ్యక్తులు, వారి ఇతివృత్తాలు, యుద్ధాలు మొదలైన సంఘటనలు ఆధారంగా రాయబడిన
వాటిని చారిత్రక కావ్యాలు అనవచ్చు. ఇలాంటి కోవకు చెందిన ప్రబంధకావ్యమే
‘కల్యాణరాజ చరిత్రము’. ఈ ప్రబంధంలో ఉన్న చారిత్రక విషయాలను చర్చించడమే
నా వ్యాసోద్దేశం.

కల్యాణరాజ చరిత్రము
కల్యాణరాజ చరిత్ర నామాంతరం గల దీబగుంట వీరభద్ర చరిత్రను తెలిపే ప్రబంధ
కావ్యమిది. మూడాశ్వాసాల ఈ పద్య ప్రబంధాన్ని కృష్టిపాటి వేంకటసుబ్బకవి
రాశాడు. ఈ ప్రౌఢ ప్రబంధానికి సంబంధించిన ఏకైక తాళపత్ర ప్రతి (స్టాక్‌. నెం.
343) తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థ
గ్రంథాలయంలో భద్రపరచబడిరది. ఈ తాళపత్రాన్ని ఆ సంస్థలోనే ఆచార్యులుగా
పనిచేసిన డా॥ ముదివేడు ప్రభాకరరావు గారు స్వీకరించి, ఎంతో నిశితంగా,
పరిశీలనాత్మకంగా పరిష్కరించి, విపులమైన పీఠిక రాశాడు. ఈ పరిష్కరించబడిన
గ్రంథాన్ని ప్రాచ్య పరిశోధన సంస్థే 2012లో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు
మహాసభల సందర్భంగా ప్రచురించింది.
కవి పరిచయం : ‘కల్యాణరాజ చరిత్ర’ అనే ప్రబంధకర్త కృష్టిపాటి వేంకటసుబ్బకవి.
ఈ కవి కాలం గురించి వేటూరి ప్రభాకరశాస్త్రి గారు 1852 గాను, మద్దులపల్లి వెంకట
సుబ్రహ్మణ్యశాస్త్రి దీబగుంట వీరభద్ర చరిత్రకు తొలిపలుకు రాస్తూ 1845
ప్రాంతం వాడని చెప్పగా ప్రస్తుత గ్రంథ పరిష్కర్త ముదివేడు ప్రభాకరరావు గారు
1755 నుండి 1845 మధ్యకాలంలో అంటే 90 యేండ్లు కృష్టిపాటి వేంకటసుబ్బకవి
జీవించినట్లు చెప్పవచ్చని గ్రంథ పీఠికలో తెలియజేశారు.
ఈ కవి రెండు ప్రబంధాలు, మరికొన్ని రచనలు చేసినట్లు ఈ కవి సమకాలీనుడైన నొసము
సంస్థాన ఆస్థాన కవిjైున ఓబళాచార్యుల వారి ‘కోకోనశ్య’ మనే చాటుపద్యంలో
‘‘అనేక గ్రంథ నిబంధ నార్జిత సమున్నిద్ర ప్రతాపప్రధా!’’ అనే వాక్యాన్ని
బట్టి సుబ్బకవి అనేక గ్రంథాలు రచించినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం
మనకిప్పుడు ఐదు మాత్రమే లభ్యమవుతున్నాయి. 1. కేదారోపాఖ్యానము
(ప్రబంధము), 2. కల్యాణరాజ చరిత్రము (దీబగుంట వీరభద్ర చరిత్ర)`ప్రబంధం), 3.
శ్రీదత్తప్రభు శతకము (గేయ శతకము), 4. హనుమచ్ఛతకము (సంస్కృతం), 5. నాడీ
నక్షత్రమాల (జ్యోతిషగ్రంథం).
కవి ఇంటిపేరు కృష్టిపాడు. ఇది కర్నూలు జిల్లాలోని నేటి దొర్నిపాడు మండలంలో
ఉంది. ఈ కవి ప్రప్రథమంగా గద్వాల సంస్థానం వెళ్ళినప్పుడు ఆ సంస్థానాధిపతి మీ
స్వగ్రామమేది? అని ప్రశ్నించగా ఈ కవి ఆశువుగా చెప్పిన సీసపద్యం ఇప్పుడు
ఎత్తుగీతి లేకుండా లభిస్తుంది.
సీ॥ఉయ్యాలవాడకు నుత్తరంబున నటు
కీర్తింప మాయూరు క్రిష్టిపాడు
నంద్యాలకున్‌ దక్షిణమున రెండామడ
కీర్తింప మాయూరు క్రిష్టిపాడు
పడకండ్ల కామడ పరువులో బడమట
గీర్తింప మాయూరు క్రిష్టిపాడు
నొసము విలాతిలో నుతికెక్క రేనాట
గీర్తింప మాయూరు క్రిష్టిపాడు
ఈ విధంగా కవిగారి స్వగ్రామం కీర్తింపబడటం వల్ల ఈ కవి నొస్సం
సంస్థానాధిపతిగా సిపాయిల తిరుగుబాటు (1857)కు పూర్వమే కుంఫిణీ ప్రభుత్వాన్ని

ఎదిరించిన ధీరుడు, వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి (క్రీ.శ॥ 184547 విప్లవ కాలం) సమకాలికుడు. ఉయ్యాలవాడ కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలో ఉంది. ఈ నరసింహారెడ్డి చేత నొస్సం సంస్థానంలో సన్మానం పొందినవాడే కృష్టిపాటి వేంకటసుబ్బకవి. కల్యాణరాజ చరిత్ర అవతారికా విశేషాలు : దీబగుంట కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ
తాలూకా, గోస్పాడు మండలంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా వెలసిన దేవుడు వీరభద్రుడైన
శివుడు గుమ్మిత మల్లికార్జునుడనే పేరుతో లింగమ రూపంగా ఉన్నాడు. దీబగుంట
వీరభద్ర చరిత్ర (కల్యాణరాజ చరిత్ర) గుమ్మిత మల్లికార్జున స్తుతితో
ప్రారంభం కావడం వల్ల ఈ గుమ్మిత మల్లికార్జునుడెవరు? ఆయన పేరు ఎలా
వచ్చింది? అనే సందేహం పాఠకులకు రావడం సహజం. లింగరూపమైన శివునికి ఆపేరెలా
వచ్చిందో కవియే తృతీయాశ్వాసం లో సమాధానం చెప్పాడు.
కం॥ అందఱు నొక గుమ్మితముగ
బొందుగ మల్లియల తోడ బూజించిరి యా
నందముగ, నందువలననె
యందముగా గుమిత మల్లికార్జునుడయ్యెన్‌ (3200) భక్తులైన రాజులందరు గుంపులు గుంపులుగా మల్లెపూలతో మల్లికార్జున శివలింగాన్ని పూజ చేయడం వల్ల, దీబగుంటలో వెలసిన మల్లికార్జునస్వామికి గుమ్మిత మల్లికార్జునుడనే పేరు వచ్చింది. అవతారికలో రెండవపద్యం కావ్య కథావస్తువు సంబంధి. కైలాసం నుండి భూలోకానికి స్పర్శవేది లింగరూపంగా రావడమే కాదు, మూడు రూపాలతో పొడగట్టినాడు. అది (1) వీరభద్రుడు, (2) బసవేశ్వరుడు, (3) భద్రకాళి. వీరభద్రుడు శివుని ఆవేశావతారం. వీరభద్రుని దేవేరి భద్రకాళి. కైలాసంలోని బసవనే బసవేశ్వరుడుగా అవతరించాడు. అన్నియుతానే ‘ముగురైదీపించి’ అనడంలో ‘సర్వము తానjైున వాడెవ్వడు?’ అనే స్ఫూర్తి కల్గిస్తున్నాడు. ‘బౌద్ధాది విద్యల పెల్లారిచి’ అనడంచేత బిజ్జలుడు నాస్తిక, అవైదిక మతమైన బౌద్ధమతాన్ని అభిమానించడమే వాని పతనానికి, మరణానికి ప్రధాన కారణంగా ఈ కావ్య కథావస్తువు ప్రతిపాదిస్తుంది. బౌద్ధమత గురువు ‘జిన్నేశు’ డని చెప్పబడిరది. కానీ, బసవేశ్వరుని చరిత్రలో జినేశుడు లేక జిన్నేశుడు జైనమత పరంగా గ్రహించబడటం జరిగింది. బసవేశ్వరుడు కల్యాణపట్టణాన్ని ఏలే బిజ్జలుని ప్రధానమంత్రి. బసవన స్థాపించిన వీరశైవ మతాన్ని, దాన్ని ప్రచారాన్ని బిజ్జలుడు అడ్డుకున్నాడు. పైగా బౌద్ధులతో సంబంధం పెట్టుకున్నాడు. బౌద్ధుల విద్యలు అవైదికములు, నాస్తికమత భూయిష్ఠములు కనుక ఆ మతాన్ని రూపుమాపడానికే శివాజ్ఞచే బసవన బసవేశ్వరుడుగా, తాను బాలకుడై వచ్చి నాస్తికమతమైన బౌద్ధాన్ని రూపుమాపాడు. దానినే ‘బౌద్ధాదివిద్యల పెల్లారిచి’ అనగా రూపుమాపి అనే అర్థంలో చెప్పడం జరిగింది. వీరశైవమతాభిమాని, ఉజ్జయినీ పురాధ్యక్షుడే వీరశంకర ధారాధ్యక్షుడు, ఆయనను శివుడు కటాక్షించాడు. అటువంటి గుమ్మిత మల్లికార్జున శివలింగం ఎల్లవేళలా తన కృతిని రక్షించాలని ప్రార్థించాడు. దీబగుంట ప్రధానంగా వీరభద్రక్షేత్రం. ఈ దీబగుంట వీరభద్రునికే కవి తన ప్రబంధాన్ని అంకితమిచ్చాడు. ఇలా అనేక విశేషాలు అవతారికలో కవి తెలియజేశాడు. కల్యాణరాజ చరిత్ర కథా సంగ్రహం : ప్రథమాశ్వాసంలో ` నందికేశ్వరుడు
బసవేశ్వరుడుగా అవతరించిన విషయం చెప్పబడిరది. ఉజ్జయిని పట్టణాన్ని పాలించే

వీరశంకరవిభుడు ఆత్మీయులతో కలిసి బసవేశ్వరున్ని దర్శించడానికి తరలివస్తాడు. ఆ
సమయంలోనే వీరశైవాచార్యులలో ప్రప్రథముడైన రేవణసిద్ధుడు
స్పర్శవేధిలింగాన్ని వీరశంకర ప్రభువుకు ప్రసాదించి, ఇకమీదట వీరశైవులు ఎవరినీ
యాచింపక, స్వతంత్ర జీవనులై తమ కార్యకలాపాలను సాగిస్తూ ఆత్మగౌరవంతో
జీవించాలని హితబోధ చేశారు. వీరశంకరుడు బంగారుకోటలు కట్టించి
స్పర్శవేదిలింగాన్ని స్థాపించాడు.
ద్వితీయాశ్వాసంలో కల్యాణపట్టణాన్ని పాలించే బిజ్జలునితో, ఆయన ప్రధానమంత్రి బసవేశ్వరుడు వీరశైవమతం ప్రచారం చేస్తున్నాడని బౌద్ధులు ఫిర్యాదు చేస్తారు. అంతేకాదు, వీరశైవుల వద్ద ఇనుమును బంగారం చేసే స్పర్శవేదిలింగమున్నదని చెప్పగా, బిజ్జలుడు ఆ స్పర్శవేదిని అపహరించి తెమ్మని తలవరులను పంపిస్తాడు. తలవరులు చాలా తెలివిగా స్పర్శవేదిలింగాన్ని అపహరించి బిజ్జలుని ముందు పెడతారు. కానీ, అప్పుడు రాత్రి కావడం చేత, స్పర్శవేది గల ముల్లెను రాజ మందిరంలో భద్రపరిచి, ఉదయాన్నే లేచి రాజముద్రికలను ఛేదించి రహస్యపు గంటును విప్పగా అందులో ఉన్నదని చెప్పిన స్పర్శవేదిలింగం మాయమైపోయి ఉండటం తెలిసింది. అంతలో ఇక్కడ బసవేశ్వరుని భక్తులైన వీరశంకరాదులు స్పర్శవేధిలింగం దొంగతనంగా పోయినందుకు దు:ఖిస్తారు. బసవేశ్వరుడు వారిని ఓదార్చి జ్ఞానబోధ చేస్తాడు. స్పర్శవేదిని తిరిగి పొందడానికి కొన్ని సూచనలు చెబుతాడు. జంగములు గాజులవాండ్ర వేషంతో బయలుదేరిపోతారు. ఇంతలో బిజ్జలుని చేత స్వర్శవేదిలింగం మాయం కావడానికి కారణం బిజ్జలుడు బౌద్ధుల అధీనంలో ఉండటమే. జిన్నేశాదులను చంపడానికి శివుడు బాలుని వేషంతో వస్తాడు. ఆ బాలుని చూసిన సిరియమ్మ తన ఇంట పశువుల కాపరిగా నియమిస్తుంది. ఆ బాలుడే శివుడని తెలియని సిరియమ్మ అతడు పశువుల వెంట అడవికి పోయినప్పుడు కేదారేశ్వర వ్రతం చేస్తుంది. వ్రతావసానంలో వచ్చిన బాలుడు స్పర్శవేది లింగాకృతిని ధరించి సిరియమ్మ ఇంట ఉండిపోతాడు. ఇక అప్పటినుండి గాండ్ల సిరియమ్మ ఇనుము ఇచ్చినవారికే నూనె పోస్తానని చెప్పసాగింది. ఇనుమునంతా బంగారాన్ని చేసి దాచి పెట్టుకోవడం ప్రారంభించింది. ఈ సందర్భంలో బాధితురాలైన బ్రాహ్మణ స్త్రీ బిజ్జలునికి ఫిర్యాదు జేసింది. బిజ్జలుడు స్పర్శవేదిలింగం సిరియమ్మ ఇంటిలో ఉందని పసిగట్టి, జిన్నేశునితో సిరియమ్మ వద్ద గల స్పర్శవేదిని అధికారికంగా స్వాధీన పరచుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. జిన్నేశుని సిరియమ్మ వద్దనుండి స్పర్శవేదిని స్వాధీనపరచుకొని ఉత్సాహంతో తిరునాళ్ళు జరిపిస్తాడు. ఆ సమయంలో బసవేశ్వరుని గూఢచారులు సిద్ధవరంలోని తిరునాళ్ళ స్పర్శవేదిలింగాన్ని చూసి బసవేశ్వరునికి ఆ విషయంలో విన్నవిస్తారు. వీరశంకరాదులు తాము జిన్నేశునితో యుద్ధంచేసి దాన్ని తెస్తామంటారు. కానీ, బసవేశ్వరుడు ఒక జిన్నేశుడే కాదు, అతనికి తోడు బిజ్జలుడున్నాడు. వారిద్దరూ దుర్మార్గులు, వారితో పోరు వద్దని వారిస్తాడు. ఇంతవరకు ద్వితీయాశ్వాస కథ. తృతీయాశ్వాసంలో బసవేశ్వరుని ఒప్పించి, వీరశంకరాదులు జిన్నేశునిపై
యుద్ధానికి పోతారు. దారిలో విరూపాక్ష క్షేత్రం, అలంపురం, సంగమేశ్వరం,
శ్రీశైలం, మహానంది క్షేత్రాలను, దైవతాలను సందర్శిస్తారు. వీరశంకరాదులు
స్పర్శవేదిలింగాన్ని తీసుకొనిపోవడానికి దీబగుంటకు వస్తారు. వీరి దండయాత్ర
విషయంగా జిన్నేశుడు తన మంత్రి బంగాళునితో సంప్రదిస్తాడు. ఇరుపక్షాలు
యుద్ధానికి సన్నద్ధులై యుద్ధం ప్రారంభిస్తారు. ఆ తరువాత వీరశంకరాదులు
జిన్నేశుని వద్దకు భైరవుని దూతగా పంపుతారు. జిన్నేశుడు దూతగా తూలనాడి వానిని
బంధింపమని ఆజ్ఞాపిస్తాడు. బేతాళుడు బంగాళునికి యుద్ధసహాయం చేయడానికి
వస్తాడు. బంగాళుడు భైరవునితో యుద్ధం చేస్తాడు. భైరవుడు మహాకాళితో

జిన్నేశడు మారణ ప్రయోగం చేస్తున్నట్లు తెలుపుతాడు. చివరికి జిన్నేశాదులు
యుద్ధంలో మరణిస్తారు. వీరశంకరుడు స్పర్శవేది లింగాన్ని తీసుకొని
బయలుదేరుతాడు. దారిలో సంధ్యాదికృత్యాలు నిర్వహించుటకు బావి
గట్టుకిరువైపులా కాడిని పెట్టి, సంధ్యాది కృత్యాలు చేసిన తరువాత పోయి
చూస్తే స్పర్శవేదిలింగం బావిలో పడిపోయినట్లు నిర్ణయించి, బావిలో దిగి ఎంత
శోధించినా ఆ లింగం దొరకలేదు సరికదా, మూడు ముక్కలు లభిస్తాయి. ఆ మూడు ముక్కలను
ఒక్కటిగా చేర్చి దీబగుంటలో గుమ్మిత మల్లికార్జునుడనే పేరుతో ఆ
లింగప్రతిష్ఠ చేస్తారు.
ఆ తరువాత బవవేశ్వరుడు కప్పడి సంగమేశ్వరునిలో ఐక్యం చెందిన వార్త
పురోహితుని ద్వారా విని, గురుని వెంబడి, శిష్యకోటి పోవుట మంచిదని తలచి,
మోక్షమార్గాన్ని కోరి, సద్గురుమూర్తి బసవేశ్వరుని భజించి, పంచాక్షరీ మంత్ర
స్మరణం చేస్తూ, వీరశంకరుడు ఆతని ఆత్మీయులైన 77 మంది శివభక్తులు
దీబగానుబ్బిన బిలంలో ప్రవేశించి సమాధి అవుతారు.
చారిత్రక పురుషులు : ఈ ప్రబంధంలో కథ చారిత్రక పురుషులతో సంబంధం గలిగి
ఉండడంచేత కావ్యంపేరులో ‘చరిత్ర’ అని చెప్పబడిరది. ఈ కథావస్తువులో ముగ్గురు
చారిత్రక పురుషులున్నారు. వారు (1) బసవేశ్వరుడు, (2) బిజ్జలుడు, (3) జిన్నేశుడు.
బసవేశ్వరుడు చారిత్రక పురుషుడు, వీరశైవ మతస్థాపకుడైన బసవేశ్వరుడు
కర్ణాటకరాష్ట్రంలోని హింగుళేశ్వరబాగవాటిలో క్రీ.శ॥ 1140 జనవరి 21వ తేదీ
జన్మించాడు. క్రీ.శ॥ 1196 జూలై 2వ తేదీ లింగైక్యం చెందాడు. ఈయన జన్మస్థలం
ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్‌ జిల్లాలోని బాగెవాడి అనే పేరుగల
ఊరుగా గుర్తించ బడిరది. బసవేశ్వరుడు 56 సం॥, 5నెలల 11రోజులు జీవించాడని
లెక్కగట్టి చెప్పడమే కాదు, వీరశైవ పీఠాధిపతులను సైతము ఒప్పించినవారు
ఆచార్య బాడాల రామయ్యగారు (బసవేశ్వర వచనాలు సమగ్ర సమీక్ష, సిరిగెరె, 1977, పుటలు 1517)
బసవేశ్వరుని తండ్రి మండెగ మాదిరాజు, తల్లి మాదమాంబిక. వీరు శైవబ్రాహ్మణ
దంపతులు, శివాజ్ఞచే బసవన్న బసవేశ్వరుడై జన్మించాడని వీరశైవ సంప్రదాయం.
బిజ్జలుడు బసవేశ్వరుని సమకాలికుడు. ఇతడు పశ్చిమ చాళుక్య రాజధానైన
కల్యాణపట్టణ ప్రభువు. ఈ బిజ్జలుని ఆస్థానంలోనే ప్రధానమంత్రిగా
పనిచేసినవాడు బసవేశ్వరుడు. బిజ్జలునికి బసవేశ్వరుని స్వతంత్ర వ్యక్తిత్వం,
వీరశైవమత స్థాపన, ప్రచారాలు గిట్టలేదు. అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయి.
బసవేశ్వరుని వీరశైవమత ప్రచారానికి రాజైన బిజ్జలుడు అడ్డుతగిలాడు, ఆంక్షలు
విధించాడు. చరిత్రలో బిజ్జలున్ని బసవేశ్వరుడు హత్య చేయించినట్లు
చెప్పబడిరది. ప్రధాన కారణం రాజు బిజ్జలుడు జైనులతో సంబంధం పెట్టుకొని
జైనమతాభిమానిjైు వీరశైవాన్ని తృణీకరించడం బిజ్జలుని హత్య వెనుక గల గల
బలమైన కారణాన్ని ఈ కథావస్తువు ప్రతిబింబించేదిగా ఉండటం విశేషించి
గమనింపదగింది. బిజ్జలుని హత్యకు దారితీసిన ‘స్పర్శవేదిలింగ మహిమాది విశేషాలు’
ఈ ప్రబంధంలో విస్తృతంగా వర్ణించబడి ఉంది.
జిన్నేశుడు జైనుడిగా చరిత్రలో చెప్పబడి ఉండగా, ఈ ప్రబంధంలో బౌద్ధమత
పీఠాధిపతిగా చెప్పబడటం పరిశీలించదగ్గ అంశం. కర్ణాటక రాష్ట్రంలో బిజ్జలుని
కాలంలో జైనమే ప్రధానంగా వ్యాపించిన మతంగా చరిత్ర చెబుతుంది. జిన శబ్దం
జైనులకు, బౌద్ధులకు సమానంగా వాడబడటం ఒకప్పుడు ఉండేది. కాబట్టి, ఈ
ప్రబంధకవి జిన్నేశుని బౌద్ధమత పీఠాధిపతిగా చిత్రించాడు అని సరిపెట్టుకోవాలి
కానీ, చరిత్రతో పొసగదు. జైన, బౌద్ధమతాలు అవైదికాలు, నాస్తికాలుగా

పిలవబడ్డాయి గనుక ఒక నాస్తిక మతంతో బిజ్జలుడు సంబంధం పెట్టుకోవడం
జరిగిందని, అదే అతని హత్యకు కారణమైందని చెప్పవలసి వుంది.
కథలో తక్కినవన్నీ బసవేశ్వరుని పురోగతికి బిజ్జలుడు వేసిన అడ్డంకులు, దాని
పర్యవసానంగా దీబగుంటలో వీరభద్రస్వామి వచ్చి స్థిరపడడం, గుమ్మిత
మల్లికార్జున లింగప్రతిష్ఠతో కథ సమాప్త మౌతుంది. బసవేశ్వరునితో పాటు
వీరశంకరాదులు లింగైక్య మవుతారు. ఈ కాలంలో వీరశైవమతాన్ని అనుసరించేవాళ్ళు
అనేకమంది ఉన్నారు. బసవన మీద భక్తితో మల్లికార్జున పండితారాధ్యుడు కూడా
బసవన బాటలోనే నడిచాడు. ఈ చరిత్రంతా మనకు శివతత్వసారం, పాల్కురికి సోమనాథుని
బసవపురాణం, పండితారాధ్య చరిత్రలో కనపడుతుంది.
ఉపసంహారం : శ్రీవైష్ణవ సంప్రదాయ పీఠాధిపతులు, విశిష్టాద్వైత సిద్ధాంత
ప్రవర్తకులునైన శ్రీమద్రామానుజాచార్యులవారి కాలంలో (క్రీ.శ॥ 10171137) చెన్నకేశవ దేవాలయాలు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో విశేషించి రాయలసీమలో ఎక్కువగా వెలసినట్లుగా, వీరశైవమత స్థాపకుడు సాక్షాత్‌ బసవన అవతారమైన బసవేశ్వరుని కాలంలో (క్రీ.శ॥ 11401196) వీరభద్రుని ఆలయాలు ఆంధ్రదేశంలో అనేకం
వెలిశాయి. ఇది చారిత్రక సత్యం.
ప్రస్తుతం ప్రచురించబడిన కల్యాణరాజ చరిత్ర (దీబగుంట వీరభద్ర చరిత్ర) వీరశైవ
చారిత్రక నేపథ్యం గల కథ. వీరభద్రస్వామికి ఆలయాలు బసవేశ్వరుని కాలంలోనే
కడప, కర్నూలు జిల్లాల్లో ఏర్పడటం జరిగాయి. ‘పట్టిస శ్రీ వీరభద్రేశు సేవించి’
అంటాడు కవి సార్వభౌముడు శ్రీనాథుడు. కడప జిల్లాలో రాయచోటిలో వీరభద్రేశ్వర
ఆలయముంది. కర్ణాటక నుండి వీరశైవులెందరో వచ్చి స్వామిని సేవించుకుంటారు.
రాచవీడు అనే పేరే రాయచోటిగా మారింది. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా,
గోస్పాడు మండలంలో దీబగుంటలో గుమ్మిత మల్లికార్జునుడనే పేరుతో వీరభద్రుడు
వెలసి ఉన్నాడు. ఆ కథనే కృష్టిపాటి కవి రాసి, ఆ స్వామికే అంకితం చేశాడు.
దీబగుంటలో వీరభద్రునికి ఉత్సవ విశేషాలు : దీబగుంటలో ప్రతి సంవత్సరం
చైత్రశుద్ధ విదియతో ప్రారంభించి నాలుగురోజులు గొప్ప తిరునాళ్ళు జరుగుతాయి.

  1. విదియ నంది ఉత్సవం, 2. తదియ అశ్వవాహనం, 3. చవితి వ్యాఘ్రవాహనం, 4. పంచమి రథోత్సవం, ఎద్దులకు పరుగుపందాలు పెట్టబడుతాయి. ప్రతి సోమవారం
    ఇక్కడ విశేష పూజలుంటాయి. గండదీపాలు మోయడం, పుట్టువెంట్రుకలు తీయడం,
    వివాహాలు జరపటం, నందికోల ఉత్సవం ఇలా మొదలైన కార్యక్రమాలు ప్రతి సోమవారం
    ఉంటాయి. ఈ దేవాలయానికి భూవసతి, మణిమాన్యాలు ఉన్నాయి. తిరునాళ్ళకు సుదూర
    ప్రాంతాల నుండి, ఆంధ్రేతర రాష్ట్రాలనుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు.
    ఆధార గ్రంథాలు :
  2. కల్యాణరాజ చరిత్రము కృష్టిపాటి వేంకటసుబ్బకవి శ్రీవేంకటేశ్వర
    విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థ (ప్రచురణ) ` 2012
  3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (మొదటి సంపుటం) ` ఆరుద్ర
  4. శైవసాహిత్యం భక్తితత్వం యం. రామనాథం నాయుడు

వడ్లమూడి యోగీశ్వర రావు,
పరిశోధక విద్యార్థి,
ఫోన్‌ : 9000 721 241

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *