ఆచార్య భూమయ్య గారి ‘భౌమ మార్గ విమర్శ’

  1. శివానంద లహరి :
    సౌందర్యలహరిలో అమ్మవారి మాహాత్మ్యాన్ని కొనియాడిన శ్రీ శంకరులు
    శివానందలహరిలో జగత్పిత అయిన పరమేశ్వరుని స్తుతిస్తున్నారు. మూడు దశాబ్దాలు
    మాత్రమే జీవించిన శంకరులు సూర్యుని వలె విజ్ఞాన కాంతులను వెదజల్లి మూడు
    శతాబ్దాల జ్ఞానాన్ని ప్రపంచానికి వెలువరించారు. సాక్షాత్తు శివుని అవతారంగా
    చెప్పబడుతున్నవారు.
    ‘‘కలాభ్యాం చూడాలంకృత శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం …. నతి రియం’’ పార్వతీ
    పరమేశ్వరులు ఒకరి కోసం ఒకరు తపము చేసి ఒక్కటైనారు. నిజ తపః ఫలాభ్యాం అనే
    ఒక్కమాట ఎంతో లోతైన అర్థాన్ని స్ఫురింప చేస్తుంది. ఆ ఇద్దరినీ
    అర్ధనారీశ్వరతత్వంగా కాక ఒకే రూపంగా శంకరులు దర్శించారు. ఎంతటి
    మహద్భాగ్యమో వారిది. అట్టి కవి హృదయ దర్శనానికి కైమోడ్పులర్పిస్తారు
    భూమయ్యగారు.
    ఈ శ్లోకంలో శంకరాచార్యులు విషయాన్ని కవిత్వంగా, ఛందోబద్ధంగా
    వివరిస్తున్నారు. పాద పాదంలో సౌందర్యాన్ని ఇనుమడిరపచేశారు. దంపతుల గురించి
    చెప్తున్నారు కాబట్టి జంటపద ప్రయోగం చేయడంలో కవిత్వ ఔచిత్యం
    కనబడుతుంది. దీనివల్ల పద్యాన్ని పాడినప్పుడు నాదం మనసును తాకుతుంది. ఈ
    భావాన్ని భూమయ్యగారు కవితాదృష్టితో కవిదృష్టిని వ్యక్తం చేశారు.
    ఇలాంటిదే మరో శ్లోకం…
    ‘‘త్రయీ వేద్యం హృదయం త్రిపురహర మాద్యం
    త్రినయనం……… హృది భజే’’ ఇందులో పదాలన్నీ బిందుపూర్వకంగా ముగియడం వల్ల
    చదువుతున్నప్పుడు ఆ బిందువు ప్రణవనాదంగా భాసించి హృదయాన్ని స్పృశించి
    తరంగాలై దేహమంతటా నిండిపోతుందని శంకరుల శబ్ద సౌందర్యాన్ని ఆరాధిస్తూ
    అక్కడే ఉండిపోతారు ఆచార్యుల వారు.
    ‘‘గభీరే కాసారే విశతి……న జానాతి కి మహో’’ శివుని ఆరాధించాలనే తపనతో భక్తుడు
    దట్టమైన అరణ్యాలలోకి వెళ్తున్నాడు. కానీ తన హృదయంలోనే శివుడున్నాడన్న
    అంతరార్థాన్ని గ్రహించలేకున్నాడు. అజ్ఞానం ఆవరించి మూఢుడై, చిత్త
    చాంచల్యంతో ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. కాబట్టి ఈ తిరగాల్సిన పని ఏదో
    హృదయం వైపు ప్రయాణించుమంటారు. దీనికి భూమయ్యగారు ముండకోపనిషత్‌ లోని
    ‘‘బృహచ్చ తద్‌ దివ్య మంచిత్య రూపం….’’ మంత్రాన్ని ఉదాహరణగా చూపుతూ
    అచింత్యమైన బ్రహ్మము సూక్ష్మాతి సూక్ష్మంగా హృదయంలోనే ఉందని,
    దానిలోకే వెళ్ళమని శంకరులు చెప్పిన విషయాన్ని ఋజువు చేస్తారు.
    ‘‘దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార…… ఖలు వయమ్‌’’ ఇక్కడ శంకరులు అనేక
    కష్టాలతో కూడిన ఈ సంసారం నుండి నన్నెందుకు రక్షించవు? అని శివుని
    ప్రశ్నిస్తూనే ‘‘ఒకవేళ నేను ఇలా కష్టాల్లో ఉండడం నీకు ఆనందమైతే అంతకంటే
    కావలసింది ఏముంది? నిన్ను ఆనందింప చేశానంటే నా జన్మ సార్థకమే కదా’’ అని
    అనడంలో చమత్కారం, గడుసుదనం, వినయం, భక్తి వెల్లడవుతాయి. ఇందులో
    ప్రయోగించిన పదాలన్నీ ‘దుః’ తో మొదలవుతున్నాయి. ఇవన్నీ దుఃఖ సంకేతాలే.
    వినడానికే కష్టమయ్యే పదాలు. మరి అనుభవించడం ఎంతకష్టం? అందుకే వాటినుండి
    తరింపచేయమని శంకరులు శివుని వేడారని వివరిస్తారు కవిగారు.
    ‘‘సదా మోహాటవ్యాం చరతి……. మే హృదయకపి మత్యంత చపలం………….’’ ఇక్కడ
    హృదయానికి కోతికి ఎలాంటి భేదం లేదంటారు శంకరులు. కపి స్వభావం చపలం. ఎటు ఎందుకు
    దూకుతుందో దానికే తెలియని స్థితి. గమ్యం లేని, నిష్ప్రయోజన మైన దుముకులాట.
    అలాగే మనిషి హృదయం చపలం. ఆలోచనలు అవిరామంగా, నిలకడ లేకుండా సంచరిస్తూనే

ఉంటాయి. అదే ‘‘మోహాటవి’’ మోహమనే అరణ్యంలో గతి తప్పి తిరిగే మనిషి కుదురుగా
ఉండాలంటే భక్తి ఏకైక మార్గం. దీన్ని కవితాత్మకంగా, మనసును హత్తుకునేలా
చెప్తారు ఆది శంకరులు.
ఈ సందర్భంలో భూమయ్యగారు భారత కథను గుర్తు చేసుకుంటారు. అర్జునుడాదిగా
కొంతమంది కృష్ణుణ్ణి వెతకడానికి అడవికి పోయి దారి తప్పి రోజుల తరబడి అక్కడే
ఉండిపోతారు. పన్నెండు సంవత్సరాలు అడవిలోనే కాపురమున్న అర్జునునికి అడవి లోని
దారి తెలియకపోతే మన గతి ఎలా ఉంటుందో ఊహించమంటారు. అజ్ఞానంలో పడి
హృదయానికి వశ్యమైతే గమ్యం తెలియని అగాథంలోకి పడిపోతామని
హెచ్చరిస్తారు.
ఈ శ్లోకంలో హృదయకపి,మోహాటవి, కుచగిరులు, ఆశాశాఖలు మొదలైన పదాలు
అలంకారాలై పద్యాన్ని అలంకృతం చేస్తాయి. అందుకే శంకరులు ఎంత తాత్వికులో అంత
గొప్పకవి అంటారు భూమయ్య గారు.
‘‘నిత్యం స్వోదర పోషణాయ……… రక్షణీయోస్మ్యహమ్‌’’ నిత్యం
ఉదరపోషణార్థం డబ్బు సంపాదనమీదే దృష్టి నిలిపాను. ఇదంతా వృధా ప్రయాస. కానీ
ఏదో పూర్వజన్మ పుణ్యమువలన ‘‘మజ్జన్మాంతర పుణ్య పాక బలతః’’ నీ చేత
రక్షింపబడి ఉన్నాను. అందుకే … ‘‘భవత్సేవాం న జానే విభో’’ నీ సేవను ఎరుంగని స్థితి
కలుగనీయకు మంటారు.
ఇతరుల ధనాన్ని ఆశించవద్దని ఈశావ్యాసోపనిషత్తులో చెప్పబడిన ‘‘మా గృధః
కస్య స్విద్ధనమ్‌’’ మంత్రం తాత్పర్యాన్ని శిష్యునికి వివరిస్తూ ధనాపేక్ష
విడిచిపెట్టాలంటారు భూమయ్యగారు.
‘‘బహువిధపరితోష బాష్ప పూర
స్ఫుట పులకాంకితచారుభోగభూమిమ్‌
చిరపదఫల కాంక్షి సేవ్యమానాం
పరమసదాశివభావనాం ప్రపద్యే’’ ముక్తి ప్రదాత అయిన శివుణ్ణి శరణు
వేడుతున్నారు శంకరులు. దానికోసం శివ భావము, శివధ్యానమే నాకు శరణ్యం.
పరమపదము చేరడానికి ఆయనొక్కడే సాధనం అందుకే అన్నీ చెబుతూ చివరగా ‘‘పరమ
సదాశివ భావనాం ప్రపద్యే’’ అంటారు. ‘ప్రపద్యే’ అన్న ఒక్క పదంలో మొత్తం
శివరహస్యాన్ని చెప్పారు. ఆచార్యులవారు దాన్ని ‘‘అమృతతుల్యమైన పదం’’గా
పోల్చారు. అదే మోక్షానికి హేతువవుతుంది.
‘‘సర్వాలంకారాయుక్తాం సరళ పద యుతాం……
గౌరీ ప్రియ! మమ కవితాకన్యకాం త్వం గృహేణ’’
శ్రీ శంకరులు తమ కవితా కన్యక ‘‘శివానందలహరి’’ని శివునికి సమర్పిస్తున్నారు.
కన్యకకు వర్తించే లక్షణాలన్నీ ఇందులో ప్రతిక్షేపించారు శంకరులు. సర్వాలంకార
యుక్తాం, సరళ పదయుతాం, సాధువృత్తాం, సువర్ణాం, సద్భిః సంస్తూయమానాం, సరస
గుణయుతాం మొదలైన కవితాంశాలన్నీ కూడి సర్వగుణ శోభిత అయిన కావ్య కన్యకను
గౌరీ ప్రియునికి సమర్పించారు శంకరులు. తండ్రి తన కూతురు గుణగుణాలను వరునికి
తెలియచేస్తూ అట్టి కన్యకను స్వీకరించుమని మనవి చేసే ధోరణిని గ్రహించారు
కవిగారు.
సౌందర్యలహరి వలె శివానందలహరిని కూడా నాటకీయంగా శిష్యునితో
సంభాషిస్తున్నట్టు పది రోజుల్లో, రోజుకు పది పద్యాలను వివరిస్తూ భక్తి,
కవిత్వాలను ఒక్కచోట పేర్చి రసానందాన్ని కలిగించారు భూమయ్యగారు.

  1. అప్పాజోస్యుల వారి పద్యావలోకనం :
    ‘‘కవి అంటే ‘అంతశ్చరయోగి’ కవితారూపంలో ఉన్నవాడు’’. అని చెప్పిన కవియోగి
    అప్పాజోస్యులవారు. ‘‘నా నృషిః కురుతే కావ్యమ్‌’’ అన్న దానికి వివరణాత్మకంగా
    వారు రాసిన ‘‘నిశ్చిత సంయమీంద్రులు వినీతులు గాంచు ననూన సిద్ధినే….’’ అనే
    పద్యంలో ఋషికి, కవికి భేదం లేదని, ‘‘తపస్సు చేసి అంత కష్టపడి ఋషి కావడం కంటే
    నిత్య కవితాసాధన చేస్తూ కవి అనిపించుకోవడం మేలు’’ అని కవిత్వాభిలాషను

వ్యక్తం చేసిన కవి ఆయన. అటువంటి కవితారూప తపస్సు చేస్తున్న ఆ యోగి మీద
అభిమానంతో ఇటీవల వారి జయంతిని పురస్కరించుకుని వారికి ఆత్మీయ కానుకగా
భూమయ్యగారు రచించిన పుస్తకమిది. ఇది భూమయ్యగారి భౌమమార్గ విమర్శ
మాలికలో వికసించిన మరోపుష్పం.
‘‘శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్‌ లోక
రక్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌…….’’
అని పోతన భాగవతపద్యాన్ని అప్పాజోస్యుల సత్యనారాయణ గారు
పాడుతున్నప్పుడు అందులో ‘‘భక్తపాలన కళాసంరంభకున్‌’’ అనే పదాన్ని ఒకింత ఒత్తి
పాడుతుండడంతో తన మనస్సు దాని మీద పడి ‘‘భాగవత భక్తపాలన కళ’’ అనే పేరుతో
విమర్శ పుస్తకం రాశానని భూమయ్యగారు చెప్పుకున్నారు. అప్పా జోస్యులవారు
ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
శాస్త్రజ్ఞులైన అప్పాజోస్యులవారు శాస్త్ర పరిశోధనారంగంలో ఆనాడు చేసిన
ప్రతిపాదనలు ఇప్పటికీ తిరుగులేనివిగా ఉండడం వారి మేధాసంపత్తికి తార్కాణం. అంత
గొప్ప శాస్త్రవేత్త అయిన వీరికి దానితో ఏమాత్రం సంబంధం లేని ఇంతటి
కవితాపాండిత్యం కలగడం ఆశ్చర్యం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో
పేరు పొందిన కవి పండితులను, అవధానులను సతీసమేతంగా ఆహ్వానించి, వారికి వసతి
కల్పించి, వారి కావ్యగానాలు విని సాహితీ చర్చలు చేసేవారంటే వారి సాహితీ
పిపాసను అర్థంచేసుకోవచ్చు. కవుల పద్యరచన, పద్యం ఎత్తుగడ, సమాసరచన, భావం,
అభివ్యక్తి, పాత్రలను తీర్చడంలో ప్రత్యేకతలను గమనించి పద్య పరిమళాలను
ఆఘ్రాణించడం వారి సునిశిత పరిశీలనా దృక్పథాన్ని తెలుపుతుంది. పద్యం
బాగుండకపోతే కవి ఎదురుగుండానే నిర్మొహమాటంగా ఆ విషయం చెప్పడం వారి
ప్రత్యేకత.
అప్పాజోస్యులవారు రచించిన ‘సుగుణాఢ్య శతకం’ లోని మొదటి పద్యం..
‘‘శ్రీ విధి సూత్రమై, సకల చేతనాకారమై, సదా తన
స్థావర జంగమ స్థితికి తావలమై……తాదృశముల్‌ సుగుణాఢ్య వర్తనల్‌’’ అంటూ సకల
శుభములనిచ్చేది అయిన ‘శ్రీ’ తో ప్రారంభ మైంది. లోకాతీత శక్తి ఏదైతే ఉంటుందో
అదే నిరంతర దివ్యశక్తి. ఆ దివ్యశక్తి సంబంధ గుణాలను అలవర్చుకోవాలి అనడంలో
ఒక ఆదర్శం గోచరమవుతుంది. ఈ పద్యాన్ని కాస్త హెచ్చుతగ్గుల స్థాయిలో
పాడినట్లయితే ఇందులోని సమాస రచనార్థం, అందం హృదయానికి అందేలాగా
ఉన్నాయంటారు భూమయ్యగారు.
‘సుగుణాఢ్య శతకం’ లో కవి, తన ‘‘మనవి మాటలు’’ లో దీని అంతరంగాన్ని తెలుపుతూ ‘‘నా
మనసుకు హత్తుకున్న కొన్ని భావాలను ముక్తకాలుగా అందించే ప్రయత్నమే ఈ శతకం’’
అంటారు. దీనికి అనుసరణగా మరో వాక్యంలో ‘‘ఈ శతకంలో ప్రసక్తమైన భావాలు
స్వీయ సృజనలు కావని ముందుగా మనవి చేస్తున్నాను’’ అంటారు. ఈ విషయాన్ని
ప్రాస్తావికంగా వివరిస్తూ భూమయ్యగారు ‘‘ఇతిహాసాలు చదివినప్పుడు
అప్పాజోస్యులవారికి నచ్చిన కొన్ని గుణసంబంధమైన అంశాలను ఆయన ‘ముక్తకాలు’
గా రాశార’’న్న విషయాన్ని స్పష్టం చేస్తారు. అంతేకాదు. ‘‘భావాలు తనవి కానప్పుడు
ఇందులో ఉన్నదేమిటా?’’ అనే శంక పాఠకులకు కలుగకుండా పద్య రచనా విన్యాసం, పద,
సమాసాల సృష్టి, పద్యం ఎత్తుగడ, ముగింపు అభివ్యక్తి ఇత్యాదులు
ప్రధానాంశాలుగా రచన సాగిందంటారు. పద్యరచనను కవిగారు ‘పద్యవిద్య’ అని
పేర్కొనడం వల్ల ఆయన పద్య రచనా సొగసును ఇందులో చూడమంటారు భూమయ్యగారు.
స్వీయ రచనలు కావన్నంత మాత్రాన కవి ప్రతిభావంతుడు కాదని, స్వీయ సృజనలు లేవని
చెప్పడం కాదంటూ, పాశ్చాత్య సాహిత్య విమర్శ గ్రంథాలను, సంస్కృతా
లంకారికులు రాసిన గ్రంథాలను, కావ్య శాస్త్రాలను ఒంట పట్టించుకున్న ‘కవివరులు’
అప్పాజోస్యులవారని వారి ప్రతిభావ్యుత్పత్తులను శ్లాఘించారు
భూమయ్యగారు.

‘‘అమృతంచైవ, మృత్యుశ్చ …సత్యేనాపద్యతే మృతమ్‌’’ అమృతము, మృత్యువు
దేహంలోనే ఉంటాయని, మోహం వల్ల మృత్యువు, సత్యం వల్ల అమృతం కలుగుతుందని
ఈ శ్లోక భావము. ఈ భావం నచ్చి ‘సుగుణాఢ్య శతకం’ లో ఆచరించవలసిన సుగుణాలను
చెబుతూ..
‘‘అమృతము మృత్యువున్‌ యుగళమై మన దేహము నందె నిష్ఠమై, యమరి
నివాసముండు……’’ అని చిన్న శ్లోకాన్ని వృత్తపద్యంలో వివరిస్తారు. ఇది
సామాన్య విషయం కాదు. సంస్కృతంలో పద విచ్ఛిత్తి తప్ప తెలుగులో వలె యతి
ప్రాసలు ఉండవు. మరి అలాంటి పద్య లక్షణాలతో, ఛందోబద్ధమైన పద్యం రాయడం
కష్టం. దీన్ని వివరిస్తూ పద్యం రాయడంలో కష్టాలను గురించి పద్యం రాసిన
జాషువా గారిని, యతి ప్రాసల వల్ల తెలుగు పద్యానికి ఒనగూరే అందచందాలను ఒక
పాత్ర ద్వారా చెప్పించిన కొరవి గోపరాజు గారిని, ‘‘కవి ప్రతిభ లోన నుండును కావ్య
గత శతాంశముల యందు తొంబదిjైున పాళ్లు’’ అన్న విశ్వనాథవారిని ఈ సందర్భంగా
తలచుకుంటారు భూమయ్యగారు.
‘‘శతమును మించి సూర్యులును చంద్రులునంతకు మించి…..యిసుమంతలో నిరుల ద్రోలదు..
సూరి వచో మరీచి, హృద్గతమయి పూన్చు లో వెలుగు….’’ అనే పద్యంలో ‘ఇసుమంత’ అనే
పద ప్రయోగం చేశారు అప్పాజోస్యులవారు. సూర్యుని వెలుగు లోకాన్ని
ప్రకాశింపచేస్తుంది కానీ హృదయగతమైన చీకట్లను ‘ఇసుమంత’ కూడా తొలగించలేదు.
అని చెబుతూ ‘సూరి’ అయిన వాడే అంటే, ఎరిగిన కవి పండితుడు మాత్రమే హృదయ
తిమిరాలను ఛేదిస్తాడని చెప్పడం కవి భావనా నైపుణ్యానికి, కవితా శిల్పానికి
గొప్పదనాన్ని ఆపాదించేలాగా ఉన్నాయి. ఈ ‘ఇసుమంత’ ప్రయోగం, ‘పద్యవిద్య’
ఎరిగిన అప్పాజోస్యులవారి పద్య నిర్మాణ కౌశలమని భూమయ్యగారు
అభిప్రాయపడ్డారు.
‘‘అమృత ఫలాభమైన కృతులందలి యద్భుత వాగ్రసాను భా/ వము రుచి జూతు రందరు
సభావళులందు…..’’
కావ్యాలు అద్భుత రసాత్మకమైనవిగా ఉన్నప్పుడే సాహితీ ప్రియులు ఆస్వాదించ
గలుగు తారు. అందుకే ఈ పద్యంలో ‘‘రస సాంద్రతా గుణోద్యమిత మహార్థం’’
‘ప్రాజ్ఞ మతి’ కి మాత్రమే తెలుసని అప్పాజోస్యులవారు పాఠకుల స్థాయిని
పెంచారని చెబుతూ భూమయ్య గారు వారి భావుకతను, రసజ్ఞతను విశ్లేషిస్తూ,
దీన్నిబట్టే ‘‘వారు ఎంతటి ప్రాజ్ఞమతియో తెలుస్తుందం’’టారు.
‘‘మరణ వ్యవస్థ నైన గుణిమాన సమున్నతమై వెలింగెడున్‌ ……..ధర్మ బోధన,
లశేషముగా వినిపించె భీష్ముడుత్తర శరతల్ప నిష్ఠుడయి…..’’ అన్న పద్యంలో…
జనన మరణాలు మనిషికి సహజమే అయినప్పటికీ మరణావస్థలో మనిషి ఇంకా బతుకలేక
పోతిననే అసంతృప్తిని, పరితాపాన్ని పొందుతాడు. కాలం విలువ తెలిసి తృప్తిగా
బతకాలంటారు కవిగారు. అందుకే భీష్ముడు అంపశయ్య మీద ఉండి కూడా ధర్మజునికి
ఆదర్శవంతమైన రాజనీతిని బోధించిన విషయాన్ని చెబుతారు.. అలా భీష్ముని ఆదర్శా
లను తెలియచేయడం ద్వారా భీష్ముని బోధన లన్నీ తెలుసుకోవాలనే ఆసక్తిని
కలుగజేస్తూ మన మనసును భారతకథ వైపు నడిపించి పఠనోన్ముఖులను చేస్తారంటారు
భూమయ్యగారు.
అప్పాజోస్యులవారు మహాదేవి మత్తేభ తారావళి, దివాకర వృత్త తారావళి, పావకవృత
తారావళి, సుజల వృత్త తారావళి, వసుంధరా వృత్త తారావళి అనే అయిదు తారావళులను
రచించారు. పంచభూతాలకు సంబంధించి అయిదు తారావళులు రాయాలనే ఆయన సంకల్పంలో
ఇంకా రెండు రావాల్సి ఉన్నాయి.
మహాదేవి వృత్త తారావళిలో,
‘‘తలపన్‌ జీవన వాహినిన్‌ తడిసి ముద్దౌచున్‌…….గౌరవించ తగదే దేవీ!
కృపామూర్తిjైు’’ ఇందులో అమ్మవారి ఎదురుగా కూర్చొని తన మనసును విప్పి
చెప్పినట్లు మాట్లాడుతున్నట్లుగా భావించి ఆత్మీయతను కనబరుస్తున్నారు

కవిగారు. ఎత్తుగడ నుంచి చివరివరకు తీర్చిన నడకను కొనియాడుతూ భూమయ్యగారు
దీన్ని ఇరవై ఏడు రేకుల కమలంగా, ఆ రేకులన్నీ సౌగంధికా రేఖలని వర్ణిస్తారు.
దివాకర వృత్త తారావళిలో,
‘‘సకలార్థ ప్రదమైన వెల్గుల కధిష్ఠానంబు….సృష్టికి మూలాంకుర మైన భాస్కరుడు
సంక్షేమంబు మాకిచ్చుతన్‌’’
అగ్నిమీళే పురోహితమ్మని ఋగ్వేదం కొనియాడిన అగ్నిదేవుని గూర్చి పావకా
వృత్త తారావళిలో….
‘‘ఋగ్వేద ప్రథమోక్త సూక్త మహితున్‌, పృథ్వీ జగద్బాంధవున్‌……..సన్నుతింతు
నెడదన్‌ త్రేతాగ్ని రూపాన్వితున్‌’’
సుజల వృత్త తారావళిలో,
‘‘ఆకాశంబుదరాశిjైు …….త్రిమార్గన్‌ గొల్తు మందాకినిన్‌’’
వసుంధరా వృత్త తారావళిలో,
‘‘స్థిరమై తొల్లి యధర్వ వేదమున పృథ్వీ సూక్త సంప్రాప్తమై…భక్తిని
సన్నుతింత్రు మది ‘పుత్రోహం పృథివ్యా’ స్పదా’’
ఇలా తారావళులన్నీ అప్పాజోస్యులవారి కవిత్వ పటుత్వాలుగా అభివర్ణిస్తారు
భూమయ్యగారు.
ఇంకా అప్పాజోస్యులవారు ఆదిగురువు శంకరాచార్యులు గారు రచించిన
‘అపరోక్షానుభూతి’ ని యధాతథంగా తేటగీతి పద్యాలుగా అనువదించారు. పూర్వకవులు
రాసిన కొన్ని చాటుపద్యాలను గురించి వివరణాత్మకంగా విశ్లేషిస్తూ ‘‘మన చాటు
పద్య సంపద’’ అనే వచన గ్రంథంలో పద్యాల్లోని సామాజిక అంశాలను,
కవితావిశేషాలను విశదీకరించారు.
‘‘పద్యావలోకనం’’ ద్వారా అప్పాజోస్యులవారి పట్ల గౌరవాన్ని ,
ఆత్మీయతాభిమానాలను వ్యక్తపరుస్తూ ఈ పుస్తకానికి అనుబంధాన్ని కూడా
చేర్చి వారి సమగ్ర వ్యక్తిత్వరూపాన్ని చిత్రించారు. కవితా తపస్వి అయిన
‘‘అప్పాజోస్యులవారి హృదయం కవితాకళకు గీటురాయి’’ అని వారిని ప్రశంసిస్తూ రాసిన
ఈ పుస్తకం, భూమయ్య గారి సునిశిత కావ్యపరిశీలనలోని మరో ఆణిముత్యంగా
భాసిల్లగలదు.

అరుణ ధూళిపాళ,
ఫోన్‌ : 87123 42323
(గత సంచిక తరువాతి భాగం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *