మహాభారతం : ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 7

దానం అంటే తన ధనాన్ని గాని, ద్రవ్యాన్ని గాని ప్రతిఫలాపేక్ష లేకుండా దీనులకు, అవసరార్థులకు ఇవ్వడం. అమరకోశంలో త్యాగం, విహాపితం, ప్రాదేశనం, అపవర్జనం మొదలైన పదమూడు అర్థాలున్నాయి. ఈ అర్థాలలో ప్రధానమైనవి : ‘దానం అంటే నరకం నుంచి తరింపచేసేది. పుణ్యము ప్రతిపాదింపబడేది, పాపాన్ని తొలిగించేది. మీది జన్మమునకు మొలవ పెట్టబడేది’ (అమరకోశం. పు.452) అని ఉంది. దానాన్ని ఉపనిషత్తులు అమృతత్త్వం అంటాయి. (త్యాగేనైకే అమృతత్వ మానుశుః) భగవద్గీతలో మానవుడు వదలకూడని మూడు పనులలో ‘దానం’ ఒకటిగా చెప్పబడిరది. (యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్య...) వీటిని అష్ట, దశ, షోడశ దానాలుగా చెప్తారు. చతుర్విధ ఉపాయాలలో (సామ, దాన, భేద, దండ) దానం ఒకటి. దానాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఇతరులనుంచి పొందుతారు. ఇస్తారు, కాని దాని గొప్పతనం, విధానం, ఫలం, పద్ధతి, బాధ్యతలను గుర్తించడం తక్కువ. ఈ విషయాలనే భారతం సవివరంగా దానం ఎవరికి, ఎందుకు, ఏవిధంగా, ఎంత, ఏమి, ఎప్పుడెప్పుడు చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే విషయాలను ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడుచెప్పిన సమాధానాలలో సంపూర్ణంగా తెలియజేసాడు.
ప్రశ్న: దానం ఇవ్వడానికి ఉత్తములైన యోగ్యులు ఎవరు? (అను.2.58)
భీష్ముడు దీనికి సమాధానం ఇలా చెప్పాడు. ‘‘భోజనార్థుల దుష్టి బొందించు నతడును…’’ (ఆను.2.59) ఆకలితో వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టెవారు, దొంగలవల్ల అంతా పోగొట్టుకొన్నవారు, వ్రతం ఉద్యాపనం చెయ్యడంకోసం యాచించేవారు, గురువును, తల్లిని, తండ్రిని, భార్యను, పుత్రులను పోషించడం కోసం ధనం కావల్సినవారు, దీర్ఘవ్యాధిని పోగొట్టు కోవడం కోసం ప్రయత్నిస్తున్న వారు, ఎప్పుడూ భిక్షాటనతో జీవించే పాపంలేని విజ్ఞానులు ఈ ఆరు విధాలవారు యోగ్యులు. ప్రశ్న : దానానికి ఎవరు పాత్రులు? (అను.2.50) ఉత్తమ ధర్మపరులూ, క్రోధంలేనివాళ్ళు, సత్యవంతులు, దాంతులూ, ధీరులు, స్వధర్మపరులూ, ఇంద్రియాలను జయించిన వాళ్ళూ, సర్వప్రాణులకీ మేలుచేసేవాళ్ళూ, లోభం లేనివాళ్ళూ, శుచిమంతులూ దానపాత్రులు. వేదాలు సాంగంగా చదువుకుని, షట్కర్మలూ నిష్ఠతో పాటించే తత్వవేదులైన విజ్ఞానవంతులకి చేసిన దానం వెయ్యిరెట్లవుతుంది. మంచి పాండిత్యం, చక్కని ప్రజ్ఞా, ఉత్తమమైన శీలం, నడవడి కలవాళ్ళకి దానం చేస్తే వంశం వృద్ధిపొందుతుంది. యోగ్యుడైన విజ్ఞానవంతుడు ఒక్కడు సంతృప్తిపడినా చాలు, ముక్కోటి దేవతలూ సంతృప్తిపడతారు. మునులూ పితరులూ తృప్తి పడతారు. అందువల్ల మంచి విజ్ఞానిని వెతికి పిలుచుకువచ్చి దానమివ్వాలి అంటాడు భీష్ముడు. ధర్మరాజు అడిగిన ఈ రెండు ప్రశ్నలు అందరినికి చాలా అవసరమైనవి. దానం ఇవ్వడం ఎంత ఉత్తమమైనదో ఎవరికీ ఇవ్వాలి అని తెలుసుకోవడం అంతకంటే గొప్పది. దానం ఇచ్చేవారు అనేకులు, అనేక రకాలుగా దర్శనమిస్తుంటారు. దానం ఇవ్వడం వెనకా కూడా ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తూ, తనవారికి, తనకు తెలిసిన వారికి, తన ప్రాంతం వారికి ఇలా పలు వంకలతో ఇస్తుంటారు. అత్యధికులు బ్రాహ్మణుడికి ఇవ్వడమే అసలైన దానంగా భావిస్తారు. భారతం మాత్రం అట్లాకాకుండా దానం ఎవరికీ చేయాలో ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసింది. అందులో మొదటి సమాధానంలో ఆరు రకాల వారిని పేర్కొంది. ఆ ఆరు రకాల వారందరు అందరికీ అంగీకార యోగ్యులు. అన్నార్థులకు భోజనం పెట్టేవారికి చేసే దానం ఇంకొకరికీ ఆకలితీర్చబోతుంది. కొందరు వారి ధనాన్ని రకరకాలుగా మార్గాలలో పోగొట్టుకుంటారు. అన్నిటికీ వారు కారణం అయ్యి ఉంటారు, కాని దొంగలవల్ల పోగొట్టుకున్నవారికి వారు కారణం కారు. అట్లాగే దొంగలు పడి దోచుకున్నారంటే ఇంచుమించు పూర్తిగా పోతుంది. ఇట్లాంటి దయనీయ పరిస్థితిలో ఉన్నవారికి దానం ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి ధైర్యం ఇచ్చిన వారవుతారు. వ్రతం చేయాలనే జిజ్ఞాస ఉండి ధనం లేక యాచించి చేయడానికైన వెనుకాడనివారు ఆ వ్రతాన్ని ఎంత ప్రేమ, శ్రద్ధతో చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. అట్లాంటి యాచకులు కనిపిస్తే వారికి దానం చేయడం మంచిది అంటుంది మహాభారతం. ధనం కలిగిన వారు కూడా సరిగ్గా చేయలేని పనిని ధనహీనుడు చేస్తే వారికి దానం చేయడం మంచిదంటాడు భీష్ముడు. అదే గురువును, తల్లిని, తండ్రిని, భార్యాపిల్లలను పోషించడం. ఇందులో ఏ ఒక్కరినీ వదలివేయకుండా పోషించేవారికి మాత్రమే అనేది గమనించాలి. ఎక్కువ శాతం భార్యపిల్లల భ్రమలో పడి పోషణకై ఆశపడే మిగత ముగ్గురిని మరుస్తున్నారు. భార్యాపిల్లలను ప్రేమించినట్లుగానే తల్లితండ్రి గురువులను ప్రేమించే వారికి దానమివ్వడమనేది ఆదర్శనీయం. దీర్ఘవ్యాధితో బాధపడుతున్న వారు వారి ధనాన్ని ఆ రోగంకోసమే ఖర్చుచేసి ఉంటారు. అట్లాంటి వారికి దానం రూపంలో సహాయపడు మని తెలియజేస్తుంది. చివరగా నిత్యం యాచించి జీవనం గడిపేవారు వేరే ఆధారం లేకపోవడం వల్లనే ఆ పనిని ఎంచుకుని ఉంటాడు. కాబట్టి వారికి దానం చేయడం కూడా ఉచితం అని ఒకటవ సమాదానంలో గమనించవచ్చు. మరో సమాధానంలో దానానికి పాత్రులెవరో తెలియజేస్తూ కొనియాడదగిన లక్షణాలు గలవారిని పేర్కొన్నారు. వారందరిని గమనిస్తే ఎటువంటి వ్యససనాలు లేని, వ్యక్తిత్వం, మానవత్వం గలవారు, శాంతిమంతులు, ఇంద్రియ నిగ్రంహం కలవారు మొదలగు వారందరికి దానం ఇవ్వడం మంచింది అంటారు. ఇన్ని మంచిలక్షణాలు గలవారు ఇతరులనుండి పొందిన ధనాన్ని వృథా చేయకుండా, ఎటువంటి దుష్ట కార్యక్రమాలకు వాడకుండా మంచి పని చేస్తారని నమ్మకం. మంచి, చెడు ఏ పనైనా వాటినుండి వచ్చే పాపపుణ్యాలకు అందరినీ బాధ్యులుగా పరిగణించాలి. అందుకే మంచి గుణం కలవారు మంచి పనినే చేస్తారు. ఆ మంచి పనిలో నుండి దాతకు కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అందుకే విజ్ఞానవంతులకు, గుణవంతులకు, బుద్ధిమంతులకు దానం ఇవ్వమని తెలియజేస్తుంది. ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్పిన ఉదాహరణను గుర్తు చేసుకోవాలి. ‘‘ఒకప్పుడొక కసాయివాడు ఒక ఆవును దూరంలో ఉన్న గోవధశాలకు తోలుకుపోతున్నాడు. ఆ కసాయివాడు దాన్ని క్రూరంగా కొట్టడం వల్ల ఆవు వాణ్ణి తిప్పలు పెట్టసాగింది. దానిని తోలుకుపోవటం వాడికి కష్టసాధ్యమైంది. అలా చాలాసేపు శ్రమపడి మధ్యాహ్నానికి ఎలాగో ఒక గ్రామం చేరుకున్నాడు. ఎంతో అలసిపోయి సమీపంలోని ఒక ధర్మసత్రానికి వెళ్ళి ఉచిత భోజనం చేశాడు. సుష్టుగా తినటంతో బాగా తేరుకొని సులువుగా ఆవును వధశాలకు చేర్చగలిగాడు. ఆ గోవధ పాపంలో కొంతభాగం కసాయివాడికి అన్నదానం చేసిన దాతకు సంప్రాప్తమైంది. కాబట్టి అన్నాదులలో కూడా దానాన్ని గ్రహించేవాడు ‘దాన్ని దుర్మార్గకృత్యాలకై వినియోగించే దుష్టుడు కాడు కదా’ అని వివేచించి మరీ చేస్తూండాలి.’’ (శ్రీరామకృష్ణ బోధామృతం.పు.148) చిన్న ఉదాహరణ అయినా స్పష్టంగా బోధపడుతుంది. ఈ దానపాత్రుల గురించి ‘మనుస్మృతి’ తొమ్మిది రకాలవారు అర్హులని చెప్తుంది. ‘‘సాంతానికం యక్ష్యమాణ మధ్వాగం…’’ (మనుస్మృతి.11.1) వివాహమాడగోరే వారు, మార్గమధ్యంలో ఉన్నవారు, గురువుకు దక్షిణ ఇవ్వగోరేవారు అని మూడు రకాల వారిని గురించి ఎక్కువగా చెప్తుంది. ధర్మరాజు ప్రత్యేకించి కొన్నిరకాల వారికి దానం చేయడం మంచిదా? అని ఎంపిక చేసుకుని అడిగిన మరో రెండు ప్రశ్నలు కూడా కనిపిస్తాయి. ప్రశ్న: విజ్ఞానవంతుడు దానం పుచ్చుకోవడానికి ఎలా అర్హుడు అవుతాడు? సన్యాసిగా ఉంటేనా? లేదా, ఎలా ఉన్నా సరేనా? (అను.2.31) ‘తన ధర్మం తప్పకుండా నడుచుకునే మంచి విజ్ఞానవంతుడు అన్ని విధాలా దానానికి అర్హుడౌతాడు. అతడు సన్యాసి కావచ్చు, కాకపోనూవచ్చు’ అని ఏక వాక్యంలో భీష్ముడు సమాధానం ఇచ్చాడు. ప్రశ్న: పూర్వ సంబంధం లేనివాడూ, బంధువుకానివాడూ, పండితుడూ, యజ్ఞంచేసినవాడూ, నిత్యతపస్వీ వీరిలో దానానికి ఎవరు ఉత్తములు? (అను.2.36)
వీళ్ళందరూ దానానికి సత్పాత్రులే. కాని ధర్మపన్నాగాలు ఏకరువు పెట్టడం తప్ప, ఆచరణలో పాటించని వాళ్ళకి బంగారం మొదలైనవి దానం చేసినవాడు పదేళ్ళు నరకం అనుభవిస్తాడు.
సర్వకాలాలలో దానం ఇవ్వడం అనేకులు విజ్ఞానవంతు (విప్రుడు) డుని ఎన్నుకుంటారు. అతడు ఎట్లాంటివారైనా సరే. అది రాను రాను ఆ కులంలో పుట్టిన వారైతే చాలు అనుకునే ఆలోచనకు వచ్చారు. అందుకే కావచ్చు ధర్మరాజు ఈ ప్రశ్నను అడగాల్సివచ్చింది. సమాదానంలో కూడా ‘తన ధర్మం తప్పకుండా నడుచుకునే వారు’ అనే వాక్యం గురించి ఆలోచించాలి. ధర్మాలు చాలారకాలు. వారివిజ్ఞానాన్ని బట్టి వారు చేయాల్సిన పనులు లోపం లేకుండా చేయడం వారి ధర్మం. ఇక్కడ పేరుకు విజ్ఞాన వంతుడో! కులానికి విజ్ఞానవంతుడో! అయినంత మాత్రాన వారికి దానం ఇవ్వడం అనేది అపాత్ర దానం. వారు వారి ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నాడా అని చూసుకుని దానం చేయడం అవసరం అని ఈ సమాధానం నుండి గ్రహించాలి.
పైన తెలిపిన మరో ప్రశ్నలో ధర్మరాజు పేర్కొన్న వారిలో అందరూ దానపాత్రులే అయినప్పటికీ వారిలో ఉత్తములు అని ధర్మరాజు వచ్చిన సందేహం. అంటే అంతగొప్పవారు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆలోచించి ఎంపిక చేసుకోవల్సిన అవసరం ఉంది అని అర్థం చేసుకోవాలి. సమాదానంలో భీష్ముడు చక్కగ భయపెట్టించాడు. పండితుడికి, యజ్ఞం చేసేవాడికి, నిత్యతపస్వికి మొదలైన వారికి కొన్ని ధర్మాలు ఉంటాయి. వాటిని వారు పాటిస్తున్నారా, నటిస్తున్నారా అని గమనించి ఇవ్వకపోతే పాపం చేసినవారు అవుతారు అని గమనించవచ్చు. ఈ కాలంలో మాత్రం ఇది చాలా అవసరయోగ్యమైన సమాధానం. బట్టల రంగులు మార్చి, జుట్లుపెంచి, రంగురంగుల బొట్లతో వేషాలు వేసుకుని నటిస్తున్న బాబాలు ఎందరినో చూస్తున్నారు. వారిని నమ్మి మోసపోతున్న బుద్ధిహీనులను కూడా చూస్తున్నారు. వీరందరూ ధర్మం గురించి మాట్లాడేవారు మాత్రమే, కాని ధర్మాన్ని ఆచరించే వారు కారు. ఆచరించేవారు మాత్రమే అసలైనా పాత్రులుగా తేల్చిచెప్పారు.
దానం పాత్రుల గురించి అంతగా ఆలోచించి యోగ్యులను, పుణ్యాత్ములను ఎంపిక చేసుకుంటారు, కాని అంతగొప్ప వారికి దానం ఇవ్వడం ఎలా అనేది చాలామందికి వచ్చిన సందేహం. ఇదే విషయాన్ని ధర్మరాజు భీష్ముడిని మరిన్ని ప్రశ్నలుగా అడిగారు.
ప్రశ్న: శ్రద్ధతో దానం చేస్తే ఏ పాపమూ జనానికి అంటదని భావిస్తాను. నిజమేనా? (అను.2.35)
‘సందేహం ఎందుకు? శ్రద్ధగల మహాత్ములూ ఆదరంతో చేసిన దానం వల్ల పుణ్యం కాకుండా పాపం ఎలా వస్తుంది?
ప్రశ్న: ఎలాంటి మనసుతో దానంచేయాలి? (ఆను.5.211)
భీష్ముడు తెలిపిన‘ఉమామహేశ్వర సంవాదం’లో దీనికి సమాధానం తెలియపరిచాడు.
‘‘పరుషత్వము లేకంతః
కరణంబున శుద్ధి చాల గలిగి ప్రియము పొం
పిరివోవఁ జేత దానము
పరమోత్కృష్టంబు…
’’ (ఆను.5.212) ‘కాఠిన్యం లేకుండా మనసా, వాచా, కర్మణా సంతోష పూర్వకంగా చేసే దానం అత్యుత్తమం.’ పై రెండు ప్రశ్నలలో దానం చేసేటప్పుడు శ్రద్ధ, ప్రేమ రెండు అవసరం అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎంత చిన్న దానం అయినా ఎంత పెద్దదైన తీసుకునే వారెవరైనా శ్రద్ధతో, ప్రేమతో ఇచ్చినపుడు మాత్రమే తీసుకునే వారు ఆశీస్సులు, కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా అందిస్తారు. పెద్దల మాట ప్రకారం దానం తీసుకునే వారు దైవంతో సమానంగా భావించినపుడు మాత్రమే సంతోషంతో ఇవ్వగలరు.
దీన్ని తైత్తిరీయోపనిషత్తు ` ‘శ్రద్ధయా దేయమ్‌’ (శ్రద్ధతో), ‘హ్రియాదేయమ్‌’ (నేనేమి ఇవ్వగలను అను లజ్జతో), ‘భియాదేయమ్‌’ (నా కర్తవ్యం), ‘సంవిదాదేయమ్‌’ (జ్ఞానపూర్వకం)గా దానం చేయాలని చెపుతుంది.
భగవద్గీత వీటిని మూడు విధాలుగా చెపుతుంది. 1. సాత్త్వికదానం (ఉపకారం చేయనివారికి, దేశకాలపాత్రములెరిగి ఇవ్వదగినదాన్ని ఇవ్వడం), 2. రాజసదానం (ప్రత్యుపకార, ఫలం కొరకు కాని బాధతో చేసేది), 3. తామసదానం (దేశకాలపాత్రము తెలియక, సత్కారపూర్వకంగా కాక, అవమానం చేస్తూ చేసేది) (భగవద్గీత.17. 20,21,22).
‘అడగనిది అమ్మ అయినా అన్నం పెట్టదు’ అని ఒక సామెతను విరివిగా వాడుతారు. అందరు అన్నిటిని అడగాల్సిందేనా? కొందమహానుభావులు అడగకుండానే తెలుసుకుని దానం చేసే వారూ ఉన్నారు. ఇటువంటి వారే అసలైన దానం ఫలాన్ని పొందుతారని తెలియజేసే ప్రశ్నను ధర్మరాజు అడిగారు.
ప్రశ్న: అడిగితే ఇవ్వడమూ, అడకుండా ఇవ్వడమూ ఈ రెండిరటిలో ఏది గొప్పది? (ఆను.2.342)
‘‘అడిగిన నిచ్చుకంటెను నయాచకుఁ గాఁగ నెఱింగి యిచ్చు టె
క్కుడు ఫలమిచ్చు దానవిధి కోవిధ! వేడుట సావు వేఁడఁగా
బడుటది పెద్దసావు దగు ప్రార్థన పూర్ణము సేయునాతఁ డా
యడిగిన వానిఁ దన్నును దయారతిఁ గావఁగ జాలు వాఁడగున్‌’’
(ఆను.2.343)
‘అడిగితే ఇవ్వటం కంటె అవసరం ఉండి అడగలేనివాడిని ఎరిగి ఇచ్చిన దానం గొప్ప ఫలాన్నిస్తుంది. అసలు అడగడం అనేది చావువంటిది. ప్రార్థించడం పెద్దచావు వంటిది. అడగనివాడికి ఇవ్వడం వల్ల వాడిని రక్షించేవాడౌతాడు’ అని పద్య భావం. ఇందులో ‘అడగడం’, ‘ప్రార్థించడం’ అనే వాటిని చావుతో పోల్చాడు. ప్రతి ఒకరికి ఆత్మగౌరవం ఉంటుంది. ఇతరుల దగ్గరకు వెళ్ళి చేతు చాచుతున్నాడు అంటే ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే. ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అనేది చావడం వంటిదే.
ప్రశ్న: దానం, యజ్ఞం ఈ రెండిరటిలో అధికఫలం ఏది ప్రసాదిస్తుంది? (ఆను.2.345)
విజ్ఞానవంతుడికి వినయపూర్వకంగా ధనం, ధాన్యం, ఆవులు, రత్నాలు, భూములు, నీరు, అన్నం మొదలైనవి ప్రేమతో ఇవ్వడం మంచి యజ్ఞం. ఇవి చక్కగా నడిపినవాడు యజ్ఞాలూ, తపస్సులూ మొదలైనవాటి పుణ్యాలన్నీ పొందుతాడు.
ప్రశ్న: అనేక విధాల దానాలను చెప్తున్నారు. వాటన్నిటిలో అధికమైన దానమేదో నాకు తెలియజేయుము. (ఆను.2.349)
దానాలన్నిటిలోకీ భూదానం గొప్పది. ఎంచేతనంటావా? సమస్తమైన ధన్యాలూ, వస్త్రాలు, ధనరత్నాలూ అన్ని భూమిలోంచే పుడుతున్నాయి. బంగారం, వెండి, వస్త్రాలు, ధాన్యం వివిధ రత్నాలూ దానం చేస్తే ఎంతో భూమి దానం చేస్తే అంత. అందువల్ల భూదానం చేసినవాడికి ఇవన్నీ దానం చేసిన ఫలం లభిస్తుంది.
భూమికి ఎంత ఆయువుందో, అంతకాలం భూదానం చేసినవాడు స్వర్గంలో సుఖపడుతాడు. తక్కువభూమి దానం చేసినా, హెచ్చుభూమి ఏలుకుంటాడు రాజు. వీరశయనమయినా పొందాలి లేదా భూదానమైన చెయ్యాలి. ఈ రెండూ రెండే. భూదానంవల్ల బ్రాహ్మహత్యా పాతకం పోతుంది. ఎంతపాపం చేసినవాడి దగ్గరైనా భూమి దానంపట్టవచ్చు తప్పులేదు. భూదానం చెయ్యడమూ అశ్వమేధయజ్ఞం చెయ్యడం ఒక్కటే అంటారు ఆదిమునులు. అంటూ భూమిని దానం ఇవ్వడం వల్ల కలిగే ఫలితాలను కూలంకషంగా తెలియజేసాడు. భూమిదానం గురించి, భూమిదానం చేయడం వల్ల పొందే ఫలితాన్ని గురించి ఎక్కువగా వివరించాడు. ఇప్పుడు బహుశ అతితక్కువమంది సాధ్యం అయ్యే పనిగా మారింది. ఎక్కడ భూమి అయిన దాని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమి ఇవ్వడానికి పూనుకున్నాడు అంటే మహానుభావుడు. కాని భూమిని దానం చేయడం వల్ల తరతరాల పుణ్యం పొందే అవకాశం కూడా ఉంది.
ప్రశ్న: దానస్వభావం కలవారికి దానం చేయటానికి తగిన వస్తువులేవి? (ఆను.2.368)
అన్నం కంటే విశిష్టమైనది లేదు. దేవతలు, ఋషులు అన్నాన్ని పొగడుతున్నారు. లోకయాత్రలో యజ్ఞయాగాదులు మొదలైనవన్ని అన్నంతోనే ప్రవర్తిస్తున్నాయి.
‘‘అన్నదాన సదృశ మగు దాన మెందు నె
న్నడును లేదు గావునను విధేయ
మన్నదాన మధిక యత్నపూతంబుగా
బూని దానిచేఁత పుణ్యతమము
’’ (ఆను.2.370) అన్నదానంతో సమానమైనది లేదు. కాబట్టి అది తప్పక చేయదగింది. ఎక్కువ ప్రయత్నంతోనైనా సరే పవిత్రంగా చేయటం ఎక్కువ పుణ్యమిస్తుందని ఈ పద్యం తెలియజేస్తుంది. అన్నం ప్రాణాధారం కాబట్టి ఇంట్లో వారికి పెట్టకుండా అయినా అతిథులకు పెట్టటం పుణ్యం. అందులోనూ అలసినవాడు, స్త్రీ, బాలుడు, అంగవైకల్యం కలవాడు, ముసలి, తాపసి అయినవారిని ఎప్పుడు కాదనకూడదు. ఆకలితో వచ్చిన ఎవరినైనా ఆదరించాలి. మునులు పితృదేవతలు, దేవతలను అన్నదానంతో సంతోషపెట్టటం శ్రేష్ఠకర్మ. అన్నం పెట్టడానికి కులం, విద్య, నడవడిక అడగరాదు. అన్నం అమృతంతో సమానం. సప్తధాతువులను పోషించే అన్నం లేకపోతే ఎంతటి బలవంతుడైనా బలహీనుడౌతాడు. అన్నదానం వల్ల సర్వసుఖాలు లభిస్తాయని భీష్ముడు బోధించాడు.
మరో ప్రశ్నలో అన్నదానానికి సంబంధించిన మరిన్ని అంశాలను పేర్కొన్నారు.
‘‘దానార్హవస్తువులలో
మానిత మన్నంబ యన్నమయము లసువులున్‌
మేనుఁ దదీయబలంబును
గాన బుధులు దాని దద్ద గైకొండ్రు మదిన్‌.
’’ (ఆనుశా.4.350)
దానం ఇవ్వదగిన వస్తువులలో అన్నమే గొప్పది. ప్రాణాలూ, దేహమూ, దాని బలమూ అన్నం స్వరూపాలే. కనుక పండితులు దాన్ని మనస్సులో గొప్పదిగా భావిస్తారు. అంటూ మరో పద్యంలో అన్నదానంచేత పరమానందం తప్పక కలుగుతుంది. పరమ దుష్టభావాలు కలవాడైనా గొప్పదైన ఈ దానం చేత నిర్మలమూ, మంచిదీ అయిన భావం కలవాడవుతాడు అని తెలియజేసాడు. అన్నిటికంటే తృప్తి పరిచేది అన్నదానం మాత్రమే. ఏది ఇచ్చినా వద్దనడం కష్టం కాని తినేవారు కడుపునిండగానే ‘చాలు’ అంటారు. ప్రతి ప్రాణికి ఉదరం ఉంటుంది. ఉదరం ఉన్న అందరికీ ఆకలి ఉంటుంది. ఆకలి ఉన్న వారందరూ అన్నం తినాల్సిందే. తినని వారెవరు జీవించడం కష్టం. అంటే జీవన ప్రదమైన పదార్థం అన్నం. అన్నింటిలో కెల్లా అన్నదానమే గొప్పది.


ఆధార గ్రంథాలు :

  1. అప్పలస్వామి, పురిపండా. ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ (శాంతి పర్వము). 1976. రాజమండ్రి: ప్రాచీన గ్రంథావళి.
  2. కమలాకరశర్మ, సాగి. ‘దానం – విధానం’. 2013. హైదరాబాద్‌ : వేద సంస్కృతి పరిషత్‌.
  3. నిర్వికల్పానంద, ‘శ్రీమద్భగవద్గీత’ (పదచ్ఛేద టీకాతాత్పర్య సహితం). 2010. హైదరాబాద్‌ : రామకృష్ణమఠం.
  4. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా. ‘శ్రీమహాభారతము’ (అన్ని పర్వాలు, 7 సంపుటాలు). 2018. గోరఖ్‌పూర్‌: గీతాప్రెస్‌.
  5. విశ్వేశ్వర శాస్త్రి, జన్నాభట్ల. సంపా. ‘మహాభారత వైజయంతి’ (తొమ్మిది సంపుటాలు). 2006. గుంటూరు : భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.
  6. సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’ (అన్ని పర్వాలు, 15 సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
  7. హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). 1996. గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.
  8. సామి చిరంతనానంద (తెలుగు సేత), ‘శ్రీరామకృష్ణ బోధామృతం’. 2019. హైదరాబాదు: రామకృష్ణ మఠం.

డా. అట్టెం దత్తయ్య
సహాయాచార్యులు, ఎస్వీ కళాశాల,
ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఫోన్‌ : 9494715445

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *