అంతరించి పోతున్న కళారూపం – చిందుబాగోతం

ఉపోద్ఘాతం
తెలంగాణ జానపద ప్రదర్శన కళలకు పుట్టినిల్లు. ఇక్కడ ఎన్నో /జానపద ప్రదర్శన కళలు పుట్టి పేరు ప్రఖ్యాతులు పొందాయి. జానపద ప్రదర్శన కళారూపాలలో ఒకటి చిందుబాగోతం. సంగీత, నృత్య సాహిత్యలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతమే జనపదగేయం ఆ కోవకు చెందినదే – చిందు బాగోతం. నేడు తెలంగాణ ప్రాంతంలో సినిమాలు, టి.వి.లు ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్స్‌ వంటి ప్రసారమాధ్యమాల ప్రభావం వల్ల అంతరించి పోతుంది. కావున చిందుబాగోతం విశిష్టతను, ప్రాముఖ్యతను తెల్పడమే ఈ నా చిన్ని ప్రయత్నం.
జానపదం
జనపదం అనగా ‘‘పల్లెటూరు’’ అని అర్థం. జనపదాలలో నివసించే ప్రజలు జనపదులు. జనపదులను తెలుగులో ‘‘పల్లె’’, ‘‘పల్లీయలు’’ అంటున్నాం. జనపదులు అనగా నిరక్ష్యరాస్యులు వీరు ఆడుతూ పాడుకునే మౌఖిక సాహిత్యమే జానపద సాహిత్యం.
జానపద సాహిత్యం – నిర్వచనాలు
మౌఖిక విజ్ఞానమే జనపద సాహిత్యం ూతీaశ్రీ ఖీaశ్రీస ూఱ్‌వతీa్‌బతీవ గా పిలుస్తున్నాం. ఈ విభాగంలో జానపద గేయాలు, కథాగేయాలు, కథలు, సామెతలు పొడుపు కథలు చేరుతాయి. హిత సహితమైనది సాహిత్యమైతే జానపదసాహిత్యం కంటే ఉత్తమ సాహిత్యం మరొకటి లేదు.
జానపద కవిత్వం – లక్షణాలు
1) అజ్ఞాత కర్తృత్వం
2) సామూహిక ప్రచారం
3) మౌఖిక సంప్రదాయం
జానపద సాహిత్యం – ప్రదర్శన కళలు
భౌగోళిక పరిస్థితులను బట్టి, ప్రజల జీవన విధానాన్ని బట్టి ఆయు ప్రాంతాలలో ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు నెలకొని ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అణుగుణంగా లయతో, రాగబద్ధంగా ఉండి స్థానిక భాషా మొదలైన అంశాలతో ఆ కళారూపాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణ ప్రాంతంలో విశిష్టత గల కళారూపం – చిందుబాగోతం.
ప్రదర్శన కళలను బిరుదురాజు రామరాజు 3 రకాలుగా విభజించారు. అవి 1) సంగీత ప్రధానమైవి 2) నృత్య ప్రధానమైనవి 3) రూపక ప్రధానమైనవి. ఈ మూడు లక్షణాలు కలిపితే చిందుబాగోతం.
జానపద నృత్యం – చిందు బాగోతం
మానవుడు మొదట సృష్టించుకున్న కళాప్రక్రియ నృత్యం. ఇంకా చెప్పాలంటే నృత్యం మాట, పాట కంటే ప్రాచీనమైనది. మనిషి జీవితంలో సంతోషం, దుఃఖం, వేదన, ఆప్యాయత, పుట్టుక, చావు వంటివి లయాత్మకమైన నృత్యంగా రూపుదిద్దుకుంది. జానపద నృత్యాలలో గెంతటం, కుంటడం, చిందువేయటం, ఆడటం వంటివి ప్రధానంగా ఉంటాయి.
చిందు భాగవతం – పుట్టుక
కళారూపాలలో అతి ప్రాచీనమైనది చిందుబాగోతం. దీనిని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. పూర్వం తెలుగు ప్రాంతాన్ని యక్షభూమి అని పిలిచేవారు. యక్షులు ఆడిపాడిన భూమి కాబట్టి ఈ విధంగా పిలిచారు. లయబద్ధంగా అడుగుల నృత్యకేళియే చిందు. అయితే ఇందులో సాహిత్యానికి తక్కువ ఆవకాశం
ఉంటుంది. నృత్యమే ప్రధానం. చిందుబాగోతం ప్రదర్శించే వారిని చిందు భాగవతులు అంటారు. మాదిగల అశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. వీరు మాదిగలపై ఆధారపడి జీవిస్తారు. కాబట్టి వీరిని చిందు మాదిగలు అంటారు. వీరు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో కలరు.
చిందు యక్షగానం మాదిగ కులంలో పుట్టింది. మాదిగలను ఆశించి పూర్వకాలం నుండి తాతల ముత్తాతల నుండి మాదిగలను ఆశించి జీవనోపాధి గడుపుతున్న వారు చిందులు. చిందు కులం మాదిగలకు ఉపకులం కనుక వీళ్ళకి అంకిత భావంతో ఉండి వారిని అనుసరించి, వారి విడిది ఇళ్ళలో ఉండి జీవనోపాధిగా హక్కు భుక్తంగా ఆయా ప్రాంతాలలోని గ్రామాలను వీరి పెద్దల ద్వారా హక్కుగా పొందుతారు. వీరు ప్రతి గ్రామంలో 3 లేదా 4 ప్రదర్శనలు వేసి చివరి రోజున జాంబవంతుని వేషం, మాదిగల ఇంటి దేవత ఎల్లమ్మ దేవి వేషం వేసి మేకలు, గొర్రెలను నరికి గ్రామంలో మాదిగ వాడ వరకే బలి చల్లటం అనేది పూర్వకాలం నుండి వస్తున్న సంప్రదాయం. ఇది తాతల నుండి వారసత్వంగా వస్తున్న కళారూపం.
చిందు బాగోతం
పూర్వకాలం నుండి ప్రజలను అలరించిన కళ ‘‘చిందు బాగోతం’’ నేడు సినిమాలు, టీవీలు, సెల్‌ఫోన్‌ వీడియోల దాటికి తట్టుకోలేక ఈ కళ కనుమరుగవుతున్నది. చిందు యక్షగానమే కులవృత్తిగా చేసుకొని మాదిగల చరిత్ర వైభవాన్ని కథగా చెప్పేవారు చిందు కళాకారులు. తెలంగాణ పల్లెల్లో చిందుకళకు ప్రత్యేక స్థానం ఉంది. మాదిగ కులం ఉపకులమైన చిందుమాదిగలు మాదిగలకు పెళ్లిళ్లు, పండుగలు, మాదిగ చరిత్రను చెబుతూ వీరిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. గ్రామాలలో ఊరికి దూరంగా నెట్టివేయబడి కడుపేదరికంతో జీవనం సాగిస్తున్న మాదిగలపై ఆధారపడి వీరు జీవించడం విశేషం. అప్పట్లో మాదిగలే ఈ కళారూపాన్ని బ్రతికించారు అనడంలో సందేహమేమీ లేదు.
చిందు బాగోతం దేశముఖ్‌లు గడీల ముందు, బొడ్రాయిల ముందు చింతచెట్ల నీడల క్రింద, కూడలి విధుల వద్ద, రచ్చబండ వద్ద ఈ చిందుబాగోతం ప్రదర్శిస్తారు. వీరు పగలు, రాత్రి మొదలుకొని (రాత్రి అయితే 8 గంటల నుండి తెల్లవారు జామున 6 గంటల వరకు) ప్రేక్షకులను లేవకుండా ఉర్రూతలూగిస్తూ వీరి కళారూపం అయిన చిందు భాగవతాన్ని ప్రదర్శిస్తారు. వీరు సంవత్సరంలో 6 నెలలు మాత్రమే చిందు భాగవతం ప్రదర్శిస్తారు. ఎందుకంటే వర్షాకాలం భాగోతానికి సహకరించదు. ప్రజలు పనులల్లో నిమగ్నం అవుతారు. కాబట్టి వీరు ఎండాకాలంలో ఎక్కువగా ప్రదర్శనలు ఇస్తారు.
చిందు భాగవతం అంబకీర్తన పాడుతున్నారంటే భాగోతం మొదలు పెట్టినట్లు అర్థం. ఈ అంబకీర్తన చిన్న పిల్లలు ఆలపిస్తారు. ఇంతలో పరదా వెనుకల వేషాలు తయారు అయ్యేదాక ఇదే ఉంటుంది. వేషాలు తయారు అయిన తర్వాత అసలు భాగోతం మొదలు పెట్టినప్పుడు ముందుగా గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేస్తారు. భాగోతం మొదలు అవుతుంది. వీరు వారి వాద్యాలు మద్దెలు, తాళాలు, గజ్జెల గమ్మెవాద్యాలు హర్మోనియం, పూంగి (సొరకాయ బుర్ర తయారు చేస్తారు) సన్నాయి వీటి అనుగుణంగా అడుగులు వేస్తూ చిందు ఆడుతారు. భాగోతంలో ‘‘బుడ్డర్ఖాన్‌’’ వేషం చూసేవారికి హాస్యంగా ఉంటుంది. ఈ వేషం లేకుండా భాగోతమే లేదు. చిందు భాగోతంలో మొత్తం 12-15 మంది కళాకారులు ఉంటారు. వీరు సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, రామాయణం, భారతం, బభ్రువాహన, బాల నాగమ్మ, హరిశ్చంద్ర, జాంబవంతుని కథ, ఎల్లమ్మ కథలు ప్రదర్శిస్తారు.
వీరు దీపావళి పండుగ తర్వాత ఊర్లకు బయలు దేరి సంక్రాంతి శివరాత్రి దాకా భాగోతాలు ఆడి ఊర్లల్ల వానకాలం మొదలు అయ్యే వాటికి ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయ కూలీలుగా నిమగ్నమై పనులు చేసుకుంటారు. వానకాలం వీరు తెలియని కథలు కూడా నేర్చుకుంటారు.
వీరు ప్రదర్శించే కొన్ని భాగోతాలు చెంచులక్ష్మీ యక్షగానం… చెంచులక్ష్మీ – నరసింహ స్వామితో
ఎవ్వర మైతే పోరా… నాతో ఎదురించ రాకురా చోరా…
దువ్వుండి మాట్లాడు దగ్గరకు వచ్చేవు… కోపముచే బాణమున కొట్టి వేసెద చూడు….
కీచక వధలో కీచకుడు, ద్రౌపదిని చూసి…
ఏమి ఎవతి ఈ ఇంతి
ఏమి భువి నుండి దిగి వచ్చిన అప్సరసయ… మదన మనోహర సుందర నారియ … హ… హ
ఏమి అందము… ఏమి చందము…
చిందు ఎల్లమ్మ
చిందు భాగవతానికి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహిళ చిందు ఎల్లమ్మ. అసలు పేరు ‘‘సరస్వతి’’ ఈమె తన ఇంటి పేరునే ‘‘చిందు’’గా మార్చుకుంది. ఈమె 1923లో ఆదిలాబాదు జిల్లా బాసరలో జన్మించింది. చిందు భాగవతం కోసం తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పింది. తన భర్తకి తన చెల్లెలిని ఇచ్చి పెండ్లి చేసి సంసార జీవితం నుండి తప్పుకుంది. తాను 11 యేట భాగవతం ప్రారంభించి 50 సం.రాల వరకు ప్రదర్శనలు ఇచ్చింది. ఈమెకు 1999లో ‘‘హంస అవార్డు’’ ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. 2004లో రాజీవ్‌ పురస్కారం లభించింది. ఈమె 2005 నవంబర్‌ 10న మరణించింది.
గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటన
ఇటీవల జానపద కళలు విభాగంలో చేసిన సేవలకు గాను 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం విశిష్టమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చిందు బాగోతం విభాగంలో పద్మశ్రీ అవార్డు పొందిన గడ్డం సమ్మయ్య ఆది నుండి అనేక అవమానాలను ఎక్కిరింపులను భరిస్తూ నమ్ముకున్న కులవృత్తి అయిన కళను బతికిస్తూ ఆసక్తి ఉన్న యువకులకు శిక్షణ ఇస్తూ జాతీయస్థాయిలో ఎదిగారు. చిందుకళాకారుల కుటుంబంలో పుట్టిన సమ్మయ్య వారసత్వంగా వచ్చిన చిందుకళలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చిందు కళాకారులపై ఆయన మాటల్లో ‘రంగస్థలంపై రారాజులం నిత్యజీవితంలో దుర్భరులం! రాత్రి అంతా రాజులం.. తెల్లవారితే బికారులుగా బ్రతుకుతున్నామంటారు’. చిన్ననాటి నుంచి చిందుకళను వారసత్వంగా స్వీకరించి దశాబ్దాల కాలంగా వేల ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. భాగవతం పురాణాలతో పాటు ప్రస్తుత కాలానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను, పర్యావరణం గురించి యక్షగానం రూపంలో ప్రదర్శనలు ఇచ్చారు. గడ్డం సమ్మయ్య ప్రతిభకు ఎన్నో అవార్డులు మోకరిల్లాయి. 2009లో కళారత్న హంస అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కళాకారుడిగా అవార్డులు లభించాయి.
ముగింపు
చిందు అనే ఈ విశిష్ట కళారూపం ఒక్క తెలంగాణ ప్రాంతంలో తప్ప మరే ప్రాంతంలోనూ కనిపించదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఎనలేని గుర్తింపు తెచ్చిన చిందు కళారూపం నేడు గ్రామాలలో ఆదరణ కోల్పోయింది. సినిమాలు టీవీలు, ఇంటర్నెట్‌లు, సెల్‌ఫోన్స్‌ ప్రసార మాధ్యమాల ప్రభావం వల్ల చిందుబాగోతానికి ఆదరణ కరువైంది. రాను రాను కళాకారుల సంఖ్య తగ్గుతుంది. భాగోతం శిక్షణ లేక నేడు తెలంగాణలో కళారూపం కనుమరు గవుతుంది. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలంటే ఈ కళకు తిరిగి జీవం పోయాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని చిందు బాగోతం అకాడమి నెలకొల్పి ఈ కళకు ఆదరణ కల్పించాలి. ప్రాచీన వారసత్వ సంప్రదాయాలను కాపాడుకోవాలి.

బాషిపంగు వెంకన్న
పరిశోధక విద్యార్థి, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
ఫోన్‌ : 905 218 0854

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *