భావుకత, మానవతల కళాత్మక కలయిక

శంకరాభరణం అసాధారణ విజయం తర్వాత కాశీనాథుని విశ్వనాథ్‌ అంటే సంగీత నృత్య భరిత చిత్రాల సృష్టికర్తగానే ముద్రపడి పోయింది. ఆయన చిత్రాల్లో సామాన్య మానవునికీ, మానవతకూ పెద్దపీట వేశారనే అంశం అవసరమైనంతగా గుర్తింపు నోచలేదు. మనుషులు మనుషుల్లా ప్రవర్తించడమే మానవత్వం. చరిత్రలో పునర్వికాస యుగం ఇందుకు ప్రేరణ. మానవ కేంద్ర సిద్ధాంతం వంటివి అలాగే వచ్చాయి. దేవుళ్లు, ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు ఏవి ఏమైనా మానవ చైతన్యం సుఖదుఃఖాలు, జయాపజయాలు, సేవ, త్యాగం ప్రతిభ వంటివి ఇందులో కీలకపాత్ర వహిస్తాయి. మనిషి అన్నప్పుడు ఏ మనిషైనా కావచ్చు. ఏ విధమైన అంతరాలు హెచ్చు తగ్గులు లేని రీతిలో ఆ మనిషి ప్రస్థానం. అచ్చమైన సంప్రదాయవాదిగా ఉన్నత శిఖరాలు అధిష్ఠించిన ఈ దర్శకుడు వాస్తవంలో అంతే ప్రయోగశీలి. ప్రతిభాశాలి. కనుకనే మనిషిని విభిన్న కోణాల్లో చూపగలిగారు. ప్రతికథలో మానవత్వాన్ని ప్రతిష్టించారు.
ఈ పరిశీలన మొదలెట్టే ముందు విశ్వనాథ్‌ చిత్రాలను రెండు మూడు దశలుగా విభజించుకోవలసి వుంటుంది. తొలి దశలో కథాత్మక చిత్రాలు. మలిదశలో సామాజిక ఇతివృత్తాలు. మూడో దశలో కళాత్మక సృజనలు.
తొలి చిత్రం ఆత్మగౌరవం. పేరుకు తగ్గట్టే మధ్యతరగతి మనిషి ఆత్మగౌరవ కథ. దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన తొలి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు.
ఎన్టీఆర్‌తో నిండు హృదయాలు కూడా వీధిబాలలుగా మొదలైన ముగ్గురు హీరోలు పరస్పర సహకారంతో సంఘర్షణలతో పెరగడం, అదే ఎన్టీఆర్‌తో తీసిన కలిసొచ్చిన అదృష్టం పిల్లల భవిష్యత్తుకోసం సంపన్నుల ఇంటికి కొడుకును దత్తు ఇచ్చిన తల్లి మాతృత్వవేదన ఆ బిడ్డ సంఘర్షణ, అదృష్టం అనే నమ్మకం మిథ్య అని మనుషుల నడవడికే కీలకమని సందేశమిస్తుంది. నువ్వు నా తనయుడివి కానేకాదని చెప్పమ్మా అంటూ ఎన్టీఆర్‌ తన శైలిలో పాడుతుంటే తల్లిగా శాంతకుమారి పడే వేదన కదిలించేస్తుంది.
ఎన్టీఆర్‌, జగ్గయ్య చిన్ననాటి స్నేహితులుగా నటించిన అదే పేరు గల సినిమా. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ జగ్గయ్యల స్నేహబంధం, ఎన్ట్‌ఆర్‌, దేవికల దాంపత్య బంధం,స్నేహితుడి కుమార్తె వాణిశ్రీ, శోభన్‌బాబుల జీవితంలో వచ్చిన పెనుతుఫాను నుంచి బయట పడేసేందుకు ఈ దంపతులు చేసే త్యాగం ఇవన్నీ మానవీయ కోణం లోనే వుంటాయి. ఎన్టీఆర్‌ వంటి మాస్‌ హీరో ఈ చిత్రంలో ఒక తరహా క్యారెక్టర్‌ పాత్ర ధరించి సంయమనంతో నటించారంటే ఆ ఘనత విశ్వనాథ్‌కే దక్కుతుంది.
ఉండమ్మా బొట్టుపెడతా టైటిల్‌ చెబుతున్నట్టే సెంటిమెంటల్‌ చిత్రమైనా ఓ హరిదాసు ఆయన కుమార్తె (ధూళిపాల, జమున) జీవితాన్ని ఆర్ద్రంగా చిత్రిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో కలవారి కోడలుగా కృష్ణ భార్యగా వెళ్లిన ఆమె కుటుంబం కోసం ప్రాణత్యాగం చేయడం జానపదాల్లో వినే ముసలమ్మ మరణం లాటి కథ. ఈ చిత్రంలోనే రావమ్మా మహాలక్ష్మి రావమ్మా పాట సంక్రాంతికి తప్పనిసరి. ఈ తరహా దైవమహిమ చిత్రం విశ్వనాథ్‌ మళ్లీ తీయలేదు.
బాలయ్య నిర్మాతగా విశ్వనాథ్‌ శోభన్‌బాబుతో తీసిన చెల్లెలికాపురం సెంటిమెంటుతో పాటు సాహిత్య పరంగానూ మానవ సంబంధాల పరంగానూ ఉదాత్త సందేశమిస్తుంది. కేవలం తన నల్లటి ఆకారం, పల్లెటూరి నేపథ్యం కారణంగా సంకోచంతో వెనకబడి పోయిన ఒక మంచి రచయిత రచనలను మాటకారి స్నేహితుడు (నాగభూషణం) సొమ్ము చేసుకుంటూ మోసం చేస్తుంటే నాయిక బహిర్గతం చేయడం ఈ కథ. నాయిక వాణిశ్రీ ఈ నాటకం ముగింపజేయడం కోసం చివరలో చేసిన నృత్యం దానికి సినారె రాసిన చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన పాట ఓ పెద్ద సంచలనం. నిజానికి అదో ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. బహుశా తర్వాత కాలంలో ఆయన కళాత్మక ప్రస్థానానికి బీజోపవాసన చేసిందనొచ్చు. ఈ సంస్థలోనే వచ్చిన నేరము శిక్ష చిత్రం కూడా విలక్షణమైంది. డబ్బుందనే అహంభావంతో బాధ్యతా రహితంగా ప్రమాదం చేసి ఒక కుటుంబంలో విషాదం నింపిన హీరో(కృష్ణ) తండ్రి మందలింపుతో కనువిప్పు కలిగి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, శిక్ష అనుభవించడానికి సిద్ధం కావడం ఇందులో ఇతివృత్తం. కోటీశ్వరుల బిడ్డగా ఆషామాషిగా బతికే హీరో పాత్ర ఇప్పుడు మనం చెప్పుకునే ఈజీగోయింగ్‌ ధోరణికీ, పేదల పట్ల అలక్ష్యానికి ప్రతిబింబంగా వుంటాడు.
ప్రమాదంలోచిక్కిన తమ కుటుంబ రక్షణ కోసం పనివాడు చనిపోతే అతని కూతురైన దళిత బాలికను అనాథగా వదిలేయకుండా పెంచి పెద్ద చేసినా పెళ్లిచేయడానికి పడిన అవస్థల కథ కాలం మారింది. కామాంధుడొకడు తను ప్రేమించిన బావను దారుణంగా చంపేస్తే అతని తండ్రినే రెండవ పెళ్లి చేసుకుని పాఠం నేర్చిన ఓ సీత కథ. పెళ్లి అంటే భర్త ఆధిక్యత కాదంటూ మాంగల్యానికి మూడు ముళ్లతో పాటు నాలుగో ముడి వేయాలని చెప్పిన మాంగల్యానికి మరోముడి. పెళ్లయిన రోజే భర్త పడవ ప్రమాదంలో మరణిస్తే షాక్‌తో మతి తప్పిన అమ్మాయికి మరో జీవితం ఇవ్వడానికి జరిగిన ఘర్షణ శారద. పెంపుడు బిడ్డ దారుణ ప్రమాదంలో మరణించడాన్ని భరించలేక పిచ్చిదై పోయిన తల్లి కథ జీవన జ్యోతి(వాణిశ్రీ) ఇలా విశ్వనాథ్‌ చాలా చిత్రాల్లో మానవీయ కోణాలు మమతానురాగాలు కట్టిపడేస్తాయి.
సిరిసిరిమువ్వతో విశ్వనాథ్‌ కళాత్మక ప్రస్థానంలోమరో మజిలీ ప్రారంభమై శంకరాభరణంతో తారస్థాయికి చేరింది. తెలుగుసినిమా చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టించింది. ఈ చిత్రాలు ఒక కోణంలో సంగీత నృత్య ప్రధానమైనవిగా కనిపించినా మరో వంక వాటిలో గొప్ప మానవతా సందేశం వుంటుంది. శ్రమ గౌరవం వుంటుంది. సంప్రదాయం పరిధిలోనే సమానత్వం గురించి చెప్పే ప్రయత్నం వుంటుంది. ఈ చిత్రాలు చాలావాటిలో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు సామాన్యులు కావడం వారిపట్ల ఆయన గౌరవాన్ని చెబుతుంది. అంతేగాక శారీరక లోపాలతో పోరాడే పాత్రలు చాలా వుంటాయి. ప్రతి చిత్రంలోనూ మహిళామూర్తులు నిండుగా శక్తివంతంగా కథను నడిపిస్తుంటారు.
సిరిసిరిమువ్వలో నాయికకు మాటలు రావు కాని నృత్యమంటే ప్రాణం. తండ్రిమరణం తర్వాత ఆమెను కాపాడే బాధ్యత తీసుకున్న వ్యక్తి ఓ పనివాడు. పరిస్థితులతో పెనుగులాడి మధ్యలో వచ్చిన అపార్థాలను అధిగమించి ఆమె మనోరథం ఈడేరుస్తాడు. దీని తర్వాత వచ్చిన సీతామాలక్ష్మి కూడా పల్లెటూరి పేదమ్మాయి హీరోయిన్‌ కావడం, తనను ప్రోత్సహించిన ప్రేమికుడు తాత్కాలికంగా దూరం కావడం. ఇదీ సామాన్యుల కథే.
చిరస్మరణీయమైన శంకరాభరణం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సంగీత సమ్రాట్‌ వంటి శంకరశాస్త్రి కాలక్రమంలో మరుగున పడిపోగా అంతకుముందు ఆయన నుంచి ప్రేరణ, రక్షణ పొంది తన గౌరవం కాపాడటం కోసం నిష్క్రమించిన వేశ్యా కుటుంబ యువతి తులసి తిరిగివచ్చి కాపాడటం స్ఫూర్తిదాయకమైన ఇతివృత్తం. సంగీత ప్రమాణాల విషయంలో రాజీలేని శంకరశాస్త్రి కూతురు పెళ్లిచూపుల్లో తప్పు పాడితే మందలించడం ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. తన కోపానికి శిక్షగా తనే చేయి కాల్చుకుంటే ఆ కూతురు వచ్చి సరిగా పాడుతూ వెన్న రాయడం ఎవరినైనా కదిలిస్తుంది. మళ్లీ కచేరి మొదలెట్టిన శంకరశాస్త్రి పాడలేకపోతే తన దగ్గర నేర్చుకున్న ఆమె కొడుకు వచ్చి పాడటం గురు శిష్యురాళ్లు ఒకేసారి మరణించడం గొప్ప ముగింపు అవుతుంది. చివరి క్షణంలో శంకరశాస్త్రి ఈ అబ్బాయి నీ కుమారుడా అని తులసిని కళ్లతోనే ప్రశ్నించడం, ఆమె సమాధానమివ్వడం, ఆ కుర్రాడు ఆయన సైగతో పాటను కొనసాగించడం వారసత్వం నిలిచే వుంటుందని చెప్పడానికి సంకేతం. తమను సమాజం, సాటివారు బహిష్కరిస్తే శంకరశాస్త్రి నీకు వంటరాదా అంటూ తులసిని పురమాయించడం, ఆచారాలు అంతరాలు కారాదని స్పష్టం చేయడం సంస్కరణ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
సప్తపది మరింత సంచలనాత్మకమైన సంస్కరణవాద చిత్రం. వర్ణాంతర వివాహం చేసుకున్నందుకు కూతురును దూరం చేసుకున్న పూజారి ఆమె చనిపోయాక తమ వూళ్లో నృత్య ప్రదర్శనకు వచ్చిన అల్లుడినీ, మనవరాలినీ ఆదరించడం, ఆమెకే చిన్నపూజారిగా వున్న తన మనవడితో పెళ్లి చేయాలనుకోవడం..అయితే అప్పటికే ఆమె ఒక దళిత కళాకారుడిని ప్రేమించినా కూడా అసహాయంగా తలవంచడం, అయితే పెళ్లాడిన రోజునుంచి భర్త సంసారం చేయలేక పోవడం, విషయం తెలుసుకున్న పూజారి తన ఆత్మీయుడైన ధర్మకర్త బోధనతో ప్రభావితుడై వూరినే ఎదిరించి ప్రేమించిన యువకుడితో మనవరాలికి పెళ్లి చేయడం ఇప్పటికీ గొప్ప కథాంశం. ఇందుకోసం ఆయన భిన్న పాత్రల స్వభావాన్ని చెప్పేందుకు దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాలు, సంకేతాలు కూడా చాలా గొప్పగా వుంటాయి. సంప్రదాయ నేపథ్యం వున్నా మాలపిల్ల వంటివాటితో పోల్చదగిన సినిమా ఇది. విశ్వనాథ్‌ను సంప్రదాయముద్రకు పరిమితం చేసేవారికి ఘాటైన సమాధానం ఈ చిత్రం. ఇందులో ఆయన దేవత ప్రభావం సూచనగా చెప్పినా మానవతకే పట్టం కట్టడం చూస్తాం. ఈ చిత్రంలో గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన అనే ప్రశ్న వాస్తవానికి మన నిచ్చెన మెట్ల సమాజానికి కుల మత అంతరాలకు సంధించిన సవాలు.
సాగర సంగమం, శ్రుతిలయలు, స్వర్ణకమలం కళల పట్ల ప్రేమనూ అదే సమయంలో నేర్చుకోవడంలో భిన్న కోణాలనూ చెబుతాయి. గొప్ప కళాభిలాష వున్నా పేదరికం పరిస్థితుల కారణంగా ఉన్నతశిఖరాలు చేరుకోలేక ఆదరించిన అమ్మాయినీ పొందలేక ప్రాణస్నేహితుడి ఆసరాతో భగ్నజీవిగా బ్రతుకు గడుపుతున్న వ్యక్తి కధ సాగర సంగమం. ఇది మరో శంకరాభరణం అనిపించింది. కమల్‌హాసన్‌ నట జీవితంలో మరో ఆణిముత్యమైంది. ఆ భగ్న కళాకారుడి ప్రతి అడుగూ ప్రతి ఘట్టం గుండెలను కరిగించేలా వుంటాయి. భర్తను పోగొట్టుకుని తిరిగి వచ్చిన నాయిక ఒక కళామూర్తిగా తనను మళ్లీ చేరదీస్తే ఆమె కూతురే అనుమానించడం, అవమానించడం చివరకు నిజం తెలుసుకుని అతను నేర్పిన విద్యను వేదికపై ప్రదర్శించి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ అంటూ నమస్కరించడం అది చూసి అతను తృప్తిగా కన్నుమూస్తే తల్లి, స్నేహితుడూ తనను చక్రాల కుర్చీలో తీసుకుపోవడం ఎవరికైనా కళ్లు చెమరింపచేసే సన్నివేశం. మానవతా సందేశం కూడా. శ్రుతిలయలులో సంపన్నుడైన ఓ సంగీతాభిమాని ముగ్గురు అనాథలను పెంచి తీర్చిదిద్దితే వారు దారి తప్పిపోవడం. వీరిలో పెద్దవాడి భార్య కుమారుడి సహాయంతో వారిని దారికి తేవడం హృద్యంగా వుంటుంది. స్వర్ణకమలం ప్రతిభ వున్నా నృత్యంపట్ల ఆసక్తిలేని నాయికను నాయకుడు మళ్లీ అటు మళ్లించడం వాస్తవికంగా వుంటుంది. ఈ చిత్రాలన్నిటిలోనూ కళలతో పాటు మానవ సంబంధాలు, భావోద్వేగాలు బాధ్యతాయుత ప్రవర్తన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తాయి.
విశ్వనాథ్‌కు ఎంతో ఇష్టమైన సిరివెన్నెల ఆయన ప్రయోగ శీలతకు, సాహసికతకూ నిదర్శనం. కళ్లులేని నాయకుడు మాట రాని నాయిక, స్వేచ్ఛగా లేదా విశృంఖలంగా బతికిన మరో నాయిక తర్వాత వీరిద్దరి మధ్యకు వస్తుంది. అతని వేణునాదాన్ని, మధుర గానాన్ని ఆస్వాదిస్తూ చిత్రిస్తూ కూడా పెదవి విప్పి చెప్పలేని నాయిక రాసిన గీతం వానలో తడిసి నీరుగా మారి అతని వేణువులోకి ప్రవహిస్తే తను పాడటం…అద్భుతమైన వూహా కల్పన. ఇందులో కళాత్మకతతో పాటు వారి శారీరక లోపాలను భావనాబలం అధిగమించిందని దర్శకుడు సూచ్యంగా చెప్పడమూ వుంది. వెరసి శారీరక వైకల్యం కళాకారులకు వైఫల్యం కాజాలదని చెప్పడమూ వుంటుంది. ఇందుకోసం ఆయన ఎంత తపన పడ్డారో వూహించవలసిందే. నేను ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ చిత్రం క్లైమాక్స్‌ నాటకీయంగా వుందని అంటే ఆయనకు కొంచెం కష్టం కలిగింది. పెళ్లి పందిరిలో అంతబిల్డప్‌ చేసి అమ్మాయి చనిపోయిన సంగతి కప్పి వుంచినా నాయకుడికి తెలియడమే తను చెప్పదల్చుకున్న సందేశమని అన్నారు. వెన్నెల చంద్రుడిలో కలవడమనే భావాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా రాసిన తీరు ఆయనకు ఎంతో ఇష్టమైంది. జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం..చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్న సిరివెన్నెల పాట గొప్ప సందేశం. టూరిస్టులకు గైడ్‌గా పని చేసే చూపులేని అబ్బాయిని మహా సంగీత కోవిదుడుగా తీర్చిదిద్దే గైడ్‌గా పనిచేసిన అమ్మాయి తన జీవితంలో ఎక్కడో దారి తప్పిపోయానని బాధపడటం ఒకటైతే, హీరో తాతగారు ఆమెను మనవరాలిలా సమాదరించడం గొప్ప మానవత్వ స్పర్శ.
చిరంజీవి వంటి కమర్షియల్‌ హీరోతో తీసిన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాంధవుడు చిత్రాలు మూడూ సందేశాత్మకాలే. శుభలేఖ వరకట్నం, నిరుద్యోగం కలిపి చూపించిన సినిమా. అయితే ఇందులో చైతన్యవంతురాలైన నాయికను హీరో ఆదుకోవడం, అతనికంటే బాగా చదువుకున్న ఆమె తన సంస్కారానికి తలవంచడం చాలా సున్నితంగా చిత్రిస్తారు. ఇక స్వయంకృషి అయితే చర్మకారుడైన హీరో కుటుంబం కోసం నిస్వార్థంగా పనిచేసినా వారు సంకుచితంగా ప్రవర్తించడం అయినా మళ్లీ ఆదరించం, తను గొప్ప వాణిజ్యవేత్తగా ఎదిగినా మూలాలు మర్చిపోకపోవడం…. ఆపద్భాంధవుడులో అత్యాచారానికి గురైన నాయిక మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రి పాలైతే ఆమెను కాపాడేందుకు హీరో పిచ్చివాడిలా నటించి అక్కడ చేరడం విభిన్న వాతావరణాన్ని చిత్రిస్తాయి. చిరంజీవి, మీనాక్షి శేషాద్రి వంటి గ్లామర్‌ తారలతో ఈ పాత్రలు చేయించడం ఆయనకే చెల్లింది.
సాగరసంగమంలో అనితర సాధ్యమైన అభినయం అందించిన కమల్‌ హాసన్‌తోనే స్వాతిముత్యంలో పరిపక్వత లేని అమాయక పాత్ర చేయించిన తీరుకు ఎవరైనా ముగ్ధులవుతారు, వీపు గోక్కోవడం ఓ విధంగా వూగుతూ నటించడం అడుగడుగునా దర్శకుడు పాత్రను గాక వాస్తవమైన ఒక మనిషినే కళ్లముందుంచారు. ఇందుకోసం వారెంత పరిశీలన జరిపారో వూహించవలసిందే. అయితే ఇలాటి పాత్రను ఎన్నుకుని అంత సజీవంగా రూపొందించడం దర్శకునిలో మానవతా కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు భిన్న ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు అని రకరకాల పేర్లతో పిలుస్తున్న వీరిని కూడా తన అనేక సినిమాల్లో భాగం చేసి విజయాలు సాధించడం విశ్వనాథ్‌ ప్రత్యేకత. తను మొదటిసారి తెరపై కనిపించిన శుభసంకల్పం చిత్రంలోనూ చేపల పరిశ్రమ, మత్య్యకార జీవితంతో పాటు తనకోసం ప్రాణమిచ్చిన శ్రామికనాయకుడి త్యాగాన్ని మహోన్నతంగా చూపించారు. చివరిదశలో తీసిన స్వరాభిషేకంలోనూ దళితుడే సంగీత విద్వాంసులను కాపాడతాడు. మధ్యలో తీసిన జననీ జన్మభూమిలో చేనేత కార్మిక జీవితం చూపిస్తారు. సూత్రధారులు చిత్రంలోనైతే పీడనను, దోపిడీని నిర్మూలించాలనే భావాన్ని కూడా సంప్రదాయ పద్ధతిలోనే కామ క్రోధ మద మాత్సర్యాలకు అంత్యక్రియలు చేయడంలా చెప్పించారు. బోద్దారో మత్సర గ్రస్తా అన్న భర్తృహరి సూక్తిని కథగా మలచిన చిత్రం స్వాతి కిరణం. ఇందులోనూ చిన్న టీ కొట్టు నడుపుకొనే సామాన్య దంపతులు గొప్ప గాన ప్రతిభ వున్న తమ చిన్నారిని తీర్చిదిద్దుతారన్న నమ్మకంతో సంగీత విద్వాంసుడికి అప్పజెబితే ఈర్ష్యాళువుగా మారి వాడు తన ప్రాణం తీసుకోవడానికి కారణమవుతాడు. మానవత్వ చిత్రణతో పాటు మనుషులలో మత్సరం కూడా చెప్పే ప్రయత్నమిది. పిల్లాడు చనిపోవడం ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్లనే ఆ చిత్రం పరాజయం పాలైందని విశ్వనాథ్‌ అన్నారు గానీ నిర్దేశకుడి ఉద్దేశం గొప్పగానే చెప్పగలిగారు.
ఇలా చెబుతూ పోతే విశ్వనాథ్‌ చిత్రాల్లో అత్యధికం మానవతకు, మనిషికి పట్టం కట్టిన మనోజ్ఞ ప్రయోగాలు. వీటిలో చాలావరకూ కొత్త నటీనటులకూ ద్వితీయ శ్రేణి వారికీ కూడా అవకాశమిచ్చి వెలుగులోకి తెచ్చారు. తమ తక్కువ బడ్జెట్‌లో అంతకంటే పెద్ద తారలను తీసుకునే అవకాశం కూడా తక్కువేనని వాస్తవికంగా చెప్పిన వినయశీలి ఆయన. సంగీతం ఛాయాగ్రహణం, కళ తదితర సాంకేతికాంశాల్లోనూ విశ్వనాథ్‌ ముద్ర ప్రత్యేకమైంది. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రతిభావంతు లను తొలిగా ప్రోత్సహించడంలోనే ఆయన ప్రజ్ఞ ప్రస్ఫుటమవుతుంది. తన మలిదశ చిత్రాలలో ఆయన సనాతన పద్ధతిని ఎన్నుకున్నారు. వాటిలో సంప్రదాయ జీవులు ప్రముఖంగా కనిపిస్తున్నా విశ్వనాథ్‌ చిత్రాల్లో సూత్రధారులుగా లేక ప్రోటోగనిస్టులుగా, కార్యసాధకులుగా మామూలు మనుషులను, మహిళలను, శ్రమజీవులనే ఎన్నుకున్నారు. దైవభావన చిత్రాలలో వున్నా గాని శ్రుతిమించిన మూఢాచారాలను నెత్తి కెత్తుకోలేదు. విమర్శనాత్మకంగా చూసినా ఈ వాస్తవాన్ని గుర్తించవలసి వుంటుంది. మనుషులే కీలకంగా పనిచేస్తారు. వారి మానవత్వమే గొప్పది. సహజ పరిస్థితులే తప్ప సంచలనం కోసం కృత్రిమమైన హడావుడి, కల్పిత సన్నివేశాలు అవాస్తవ, అనారోగ్యకర పోకడలు వుండవు. అందుకే ఆయన స్మరణీయ, మానవీయ, సృజనకారుడు. అందుకే ఈ దేశం దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రదానంచేసి ఆయనను గౌరవించుకుంది.

తెలకపల్లి రవి
ప్రముఖ రచయిత,
ఫోన్‌ : 94900 99444

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *