ప్రపంచీకరణ నేపథ్యంలో 21వ శతాబ్దంలో ప్రపంచమొక వ్యాపార కుగ్రామంగా మారింది.
ప్రపంచదేశాల మధ్య ఎగుమతి దిగుమతి సంబంధాలు విస్తృతంగా పెరిగాయి. ఈ కారణంగానే 2019
డిసెంబర్ లో చైనాలోని ఊహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించి ప్రపంచ దేశాలన్నింటినీ
కలవరపెట్టింది. అంతుచిక్కని అతి సూక్ష్మ శత్రువుపై కొత్తరకం ఆయుధాలతో, యుద్ధతంత్రాలతో మానవాళి బతుకు పోరు చేసింది. ఈ పరిస్థితులలో ప్రజల మానసిక స్థితి ఏమిటి? పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని సమస్య నుండి తన పౌరులని కాపాడటానికి రాజ్యం తీసుకుంటున్న చర్యలేమిటి? పౌర సమాజం స్పందన ఎలా వుంది? అనే విషయాలు కరోనా సమయంలో పెద్ద ప్రశ్నలై నిలిచాయి.
ఏ సమాజంలోనైనా కవులు, రచయితలు ఆయా చారిత్రక సందర్భాలలో తమ స్పందనను కవిత్వం, కథ,
నవల, పాట తదితర సృజన రూపాల్లో వ్యక్తీకరిస్తారు. అది దేశ స్వాతంత్ర్యం కోసమో, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు
కోసమో, సామాజిక దురాచారాలపై నిరసన తెలుపుతూనో, రాజ్య దురహంకారాన్ని ప్రశ్నిస్తూనో కవులు,
కళాకారులు తమ కళారూపాల ద్వారా స్పందిస్తారు. కాలం మారవచ్చు, సమాజాలు మారవచ్చు, వ్యక్తీకరణలో
మార్పులు ఉండవచ్చు కానీ ప్రజాగొంతుక వినిపించే బాధ్యతను కవులు, రచయితలు మాత్రమే అంది
పుచ్చుకుంటారు.
మరి ఈ సందర్భంలో కవులు ఎలా స్పందించారు? వారి వైయక్తిక మానసిక స్థితి ఏమిటి? సమస్యను వారు
ఎలా అర్థం చేసుకున్నారు? దాని ప్రభావంతో భయాందోళనలకు గురైన తమ తోటివారికి తమ వాక్యాల ద్వారా ఎలా ధైర్యాన్ని ఇచ్చారు? అనేవి గమనించదగిన అంశాలు. ‘‘చీకటి రోజుల్లో గానాలుండవా… ఉండకేం… చీకటి రోజుల గురించి గానాలుంటాయి’’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త బెరస్తోచ్ బ్రెష్ట్. అలాగే కరోనా కాలంలో
ప్రపంచవ్యాప్తంగా కవులు, కళాకారులు లాగానే తెలుగు కవులు, రచయితలు స్పందించారు.
తెలుగు సాహితీలోకంలో డా.ఎన్.గోపి పేరు తెలియని సాహిత్యకులు కానీ, సామాన్యులు కానీ లేరు.
ఆయన కవితాస్పర్శ తగలని వస్తువు లేదు. ‘ముట్టుకుంటే తగలాలి కవిత్వం/మనిషిలాగ’ అంటారు. జీవితపు
లోతుల్నీ, తాత్విక రీతుల్నీ, మానవత్వపు జాడల్నీ తన కవిత్వవారధి ద్వారా పాఠక హృదయాలలోకి చేరవేస్తున్న కవి ఎన్.గోపి. కరోనా వైరస్ వార్తలు ప్రపంచానికి తెలియడానికి కొద్ది రోజులముందే చైనాలో సాహిత్య యాత్ర చేసి వచ్చిన కవి, ప్రపంచీకరణ వలన సంభవించిన అత్యంత తీవ్రమైన పరిణామంగా, ‘ఊహాన్ లో పుట్టి ప్రపంచాన్నిచుట్టేస్తున్న వైరస్ గురించి’ లాక్ డౌన్ కి పూర్వమే ‘ప్రపంచీకరోనా’ కవిత రాశారు. ఆ తరువాత, కరోనా వ్యాప్తితో భారతదేశంలో 2020 మార్చి 23 నుండి 44 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో కేవలం నాలుగు గంటల నోటీసుతో 1.3 బిలియన్ల మంది ప్రజలు ఎక్కడివారక్కడ బందీలై పోయారు. ఈ కాలంలో కేవలం ఆరోగ్య సంక్షోభాన్ని మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నారు. అంతుచిక్కని వైరస్వే గంగా వ్యాప్తి చెందడంతో ఆందోళనలు పెరిగాయి, గృహ హింస కేసులు కూడా బాగా పెరిగాయి. అయినప్పటికీ, నిరాశ మధ్య ఆశల మెరుపులు ఉన్నాయి. నగరాల్లో సామాజిక సేవా సంస్థలు, కమ్యూనిటీలు, గ్రామాల్లో ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి, ఆహారం, వనరులను పంచుకోవడానికి కలిసి వచ్చాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వర్చువల్ విద్యను, వినోదాన్ని సులభతరం చేసి భయాందోళన స్థితి నుండి కొంత ఉపశమనాన్ని అందించాయి.
ఈ సంక్షోభ సమయంలో తెలుగు నాట కవులు తమ చుట్టూ ఎన్నడూ చూడని భీతావహ పరిస్థితిని చూసి
ఆందోళన పడినా కవులుగా తమ కర్తవ్యాన్ని గుర్తించి స్పందించారు. ఈనాడు దినపత్రిక “కరోనా పై కదనరంగం” అనే పేరుతో నిర్వహించిన కవితల పోటీలో డా.గోపి రాసిన కవితకు తొలిరోజు ప్రథమ బహుమతి లభించింది.
మొదటి లాక్ డౌన్ కాలంలో కవి మొత్తం ఇరవై ఐదు కవితలు రాశారు. ఈ 25 కవితలలో కరోనా విపత్తు
స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా మానవ జీవితంపై చూపిన ప్రభావం, దాని పర్యవసానాలు, తాత్విక
చింతన ఇత్యాది విషయాలను స్పృశించారు కవి. ఈ కవితలు ఆయా పత్రికలలో ప్రచురితమై పాఠకుల దగ్గరకు చేరితే వాట్సాప్ ద్వారా కవి స్నేహితులకు, సన్నిహితులకు చేరుకుని వారి భయాన్ని, ఆందోళనను కొంత తగ్గించాయి.కరోనా భౌతికంగా మనుష్యుల మధ్య అడ్డుగోడలు సృష్టించినప్పుడు మొబైల్ భావ ప్రసారాలే ఊపిరులందించాయి. ప్రపంచదేశాలన్నీ సరళీకృత ఆర్ధిక విధానాలను అనుసరిస్తున్నాయి. దీని వలన ప్రపంచం ఒక మార్కెట్ కూడలిగా మారింది. ఈ ప్రపంచీకరణ అన్ని దేశాలలో, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెను మార్పులను తీసుకువచ్చింది. దేశాల మధ్య సరిహద్దురేఖలు చెరిగిపోయి వ్యాపార వాణిజ్య సంబంధాలకు అవకాశం ఏర్పడింది. రాకపోకలు విపరీతంగా పెరిగాయి. జీవన వేగం పెరిగింది. ఈ నేపథ్యంలోనే కరోనా లాంటి వైరస్ లు విజృంభించాయని గోపి గారు ఇలా అంటారు-
“ఒకప్పుడు విదేశీ యాత్రలు/జ్ఞానాన్ని మోసుకొచ్చేవి
ఇప్పుడు/రోగాలను వెంటతెస్తున్నాయి
వైశ్వీకరణం అంటే ఇదే కాబోలు!
ఒకప్పుడు/విదేశాల నుంచి తిరిగొస్తే
పూలదండలు ఎదురొచ్చేవి.
ఇప్పుడు వైద్యులు/బురఖాలు వేసి లాక్కపోతున్నారు.” విదేశీ యాత్రలు అరుదుగా, కేవలం కొద్దిమందికే, అందునా ఉన్నత విద్యార్జనకు/విజ్ఞానార్జనకు పరిమితమైన కాలంలో ఈ ప్రయాణాలు జ్ఞానాన్ని మోసుకొచ్చేవని, కానీ ఊహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అత్యంత
వేగంగా విశ్వవ్యాప్తమవ్వటమే వైశ్వీకరణం అని అంటున్నారు కవి. కరోనా సమయంలో విదేశీ ప్రయాణీకుల పాట్లు ఎలా ఉండేవో కూడా ఇక్కడ వ్యాఖ్యానించారు. కవిలోని చూపు, దార్శనికత వారిని ఇతరులనుండి భిన్నంగా నిలబెడుతుంది. కవి మనకు పరిచితమైన పరిసరాలను, విషయాలను అపరిచితం చేసి కొత్తగా పరిచయం చేస్తాడు. సామాన్య వస్తువుకు సైతం అసామాన్యతను ఆపాదిస్తారు. అది మనం తినే రొట్టె కావచ్చు, కప్పుకునే బొంత కావచ్చు, రైల్వే స్టేషన్, చీమ, దండెమ్, చిలకొయ్య ఇలా ప్రతివస్తువుతో మనిషికి ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించి ఆ వస్తువుకు కవిత్వ పరిమళాన్ని అద్దుతారు. అందుకే కరోనా భీతావహ సమయంలో కంటి ముందు కనువిందు చేసే దృశ్యమైనా కవికి సృజనాభిలాష కలుగదు అంటారు.
“ఇప్పుడు
అనంత దిగంత సుందర దృశ్యాన్ని చూస్తే
కవిత్వం పుట్టదు.
స్వాప్నిక భావుక జగత్తు ఎంత
ఎదుట కనిపించే/వాస్తవాల ముందు!
ఇప్పుడు సౌందర్యమంటే
కోవిడ్ సాప్తవర్ణిక/చిత్రరాజమే దర్శనమిస్తుంది” కవి వాస్తవాలను విస్మరించి స్వప్నజగత్తులో విహరించలేడు. అందుకే ఈ కాలంలో ప్రతి కవికీ కరోనానే కవితా
వస్తువని, ఏ కవీ కరోనా ప్రసక్తి లేకుండా కవిత్వం రాయలేడని, అసలు కవిత్వానికే కరోనా శోకిందని అంటారు-
“కవిత్వానికి కూడా
కరోనా సోకింది.
ఇవాళ దాని ప్రసక్తి లేని
పద్యం అల్లండి చూద్దాం” కవి కూడా కరోనా భయానికి, లాక్ డౌన్ నిబంధనలకి లోబడి ఇంట్లోనే బందీగా ఉండవచ్చుగానీ, తన
అక్షరాలతో ప్రపంచమంతా విస్తరించి అందరికీ ధైర్యాన్ని, స్థిమితత్వాన్ని అందిస్తాడు అంటారు గోపి. భయంలోనైనా
కవిత్వమే రాస్తానని, బేలగా మారిన మనిషిని ఓదారుస్తానని ప్రతిజ్ఞ చేశారు-
“ఇవాళ కవి/గంప కింద కోడి కావచ్చు కానీ/ప్రపంచం నిండా రెక్కలు సాచి
అందరికీ భరోసానిచ్చే/తాపత్రయమూర్తి
భయంలోనైనా సరే/నేను కవిత్వమే రాస్తాను
నన్ను నేను కరిగించుకుంటూ/సమస్త మానవాళిగా మారిపోతాను
ఇవాలటి మహానిశబ్దంలో/నిన్నటి మాటల అడుగుజాడలుంటాయి
వాటిని నిలువెత్తు నిబ్బరగీతంగా/ఆలపిస్తాను” కరోనా పై పోరులో ఆయుధాలు మనం తీసుకోవలసిన ఇతర జాగ్రత్తలతోపాటు అతి ముఖ్యమైన జాగ్రత్త
కరచాలన నిషేధం. స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కరస్పర్శ, మాటకంటే ఎక్కువ దగ్గరితనాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఈ ఆపద సమయంలో మనని మనం కాపాడుకోవాలన్నా, ఇతరులను కాపాడాలన్నా భౌతిక దూరాలు అభ్యాసం చేయాల్సిందేనని కవి వాపోతారు-
“స్పర్శ వినా బతకలేని మానవుడు
దూరాలను అభ్యాసం చేస్తున్నాడు.
అదృశ్య రాకాసిని
ఎదుర్కొనే అస్త్రశస్త్రాలు లేక
శూన్యంలో యుద్ధం చేస్తున్నాడు” కులమతాలు, వర్గభేదాలు, పేద ధనిక తేడాలు మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తాయి కానీ కరోనా వైరస్
మృత్యువీణ ముందు అందరూ సమానమేనని, ఎప్పుడూ ఏకంకాని మానవ జాతి ఒకే శ్రుతిలో స్పందించింది కరోనా వ్యాప్తి సందర్భంలోనేనని అంటారు గోపి-
“ఎన్నడూ ఏకంకాని మానవజాతి/ఇప్పుడు ఒకే శ్రుతిలో స్పందిస్తున్నది.
ఊపిరితిత్తులకు/కులమత భేదాలుండవు
ఇవాళ స్పర్శకు నిషేధం/భయమే ఏకైక సహజాతం
అలజడుల మధ్య మానవత్వం ఒక మిథ్య” లాక్డౌన్ అందరినీ దాదాపు రెండున్నర నెలలపాటు గృహ నిర్బంధంలో ఉంచేసింది. ఉద్యోగులు,
వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ రెక్కల కష్టం మీద బతికే బడుగు జీవులు, విద్యార్థులు…సమస్త రంగాల,
సహస్ర వృత్తుల జనులు నాలుగు గోడల మధ్య తమ వారితోనే బహుశా అంతకాలం పూర్వమెన్నడూ గడిపి
ఉండకపోవచ్చు. అందుకే మన ఇల్లే మనకి కొత్తగా కనిపిస్తున్నది, మానవ అనుబంధాలలోని తియ్యదనం
ఆనందానిస్తున్నది, నిర్మానుష్య వీధులు మనకు నిశ్శబ్ధంగా కర్తవ్యాన్ని బోధిస్తున్నాయి అని కవి అంటున్నారు.
తెలిసిన ఇంటినే/ఇవాళ కొత్తగా దర్శిస్తున్నాడు.
అనుబంధాల్లోని అందం/మకరందాన్ని వెదజల్లుతున్నది.
నిర్జన వీధుల్లోని నిశ్శబ్దం/అశరీరవాణిగా మారి
గురుబోధ చేస్తున్నది అగ్రరాజ్యాలు, వైద్య రంగంలో ఆధునిక విజ్ఞానం, పరికరాలు, సిబ్బంది ఉన్న దేశాలే కరోనా సంక్షోభంలో
చిన్నాభిన్నమైన ఆ వాస్తవిక స్థితికి మనందరం సాక్షీభూతులం. వైరస్ దాడిలో పేద, ధనిక, కులం, మతం, దేశం, ప్రాంతం తేడాలు లేవనే వాస్తవం కూడా మనకు తెలుసు. అందుకే సామ్రాజ్యాధినేతలైనా వైరస్ ముట్టుకుంటే పారిపోవలసిందేనన్నారు కవి. అయితే ఇక్కడొక చేదు వాస్తవాన్ని కూడా మనం అంగీకరించాలి. వైరస్ దాడి చేసినప్పుడు తేడాలు చూడదుకానీ, ఆ దాడి నుండి ప్రాణాలు కాపాడుకోవటంలో, చికిత్సా విధానంలో రాజుకి, పేదకి తేడా ఉందని ఇటీవల మనం చూస్తున్న సంఘటనల వల్ల స్పష్టమవుతున్నది.
“రాచరికాన్ని వెలిగించిన/ప్రిన్స్ చార్లెస్ అయినా
సాక్షాత్తు బ్రిటన్ సామ్రాజ్యాధినేత అయినా
వైరస్ ముట్టుకుంటే/యస్! పారిపోవలిసిందే” మానవసేవయే మాధవసేవ అనే మాట మనకు తెలుసు. కానీ నమ్మిన వారికి, మనుషుల్లోనే ఉన్న
మాధవుడు, కంటిముందు కనిపించే మాధవుడు మాత్రం వైద్యుడే. ప్రపంచవ్యాప్తంగా కరోనాబాధితులను కాపాడే
ప్రయత్నంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యోనారాయణులు, వారికి సహకరిస్తూ, రోగులకు
సపర్యలు చేస్తున్న నర్సులను తేజోమూర్తులుగా ‘క్వారంటైన్’ కవితలో అభివర్ణించారు కవి.
“డాక్టర్ల పైన కోపమొద్దు/నర్సు తల్లులను అదిలించొద్దు
ప్రాణాలను/తృణాలను చేసుకొని
వృత్తి ధర్మాన్ని/వత్తిలా వెలిగిస్తున్న తేజోమూర్తులు వారు” కొన్ని సందర్భాలలో రోగి బంధువులు వైద్యులపై/ఇతర వైద్య సిబ్బందిపై చేయి చేసుకోవటం, ఆస్పత్రులలో
విధ్వంసాన్ని సృష్టించిన సంఘటనల గురించి మనం చూస్తున్నాం. అలాంటి సంఘటనలు ముక్తకంఠంతో
వ్యతిరేకించాల్సిందే. ప్రస్తుత సందర్భంలో ఒక ప్రాణాంతక వైరస్ బారిన పడిన రోగులకు వైద్యం చేస్తే, తమకు
కూడా ప్రాణహాని ఉందని తెలిసినా, తగిన జాగ్రత్తలతో అలుపెరగక వైద్యం అందిస్తున్న వైద్యులను గురించి
‘వైద్యుడికే మన దండం’ మరో కవిత కూడా రాశారు కవి. అందులో, యుద్ధక్షేత్రంలో కనపడని శత్రువుతో
నైపుణ్యంగా పోరాడుతున్న వైద్యులు రోగులలో ఆత్మస్థైర్యం నింపుతారని, వారికే మన దండం అంటారు కవి. శత్రువు కనబడడు, దొరకడు/అయినా గాలిలో ఖడ్గం తిప్పే
సంకుల నైపుణీ సమర/వీరమూర్ధన్యుడతడు.
ఆత్మస్థైర్య ప్రచోదక/జీవన ప్రచారకుడతడు కరోనా కాలంలో రోగ భయం కంటే దేశవ్యాప్తంగా అందరి మనసులు కలచివేసిన అంశం వలస
కార్మికుల తిరుగుబాట. ఇల్లు విడిచి, ఊరు విడిచి, అయిన వారిని వదిలి పొట్ట కూటికోసం రాష్ట్రాలు దాటి వచ్చిన
వలస జీవులు లాక్ డౌన్ వేళ ఊరిలో ముసలి తల్లిదండ్రులు, తమ పసిబిడ్డలు ఎట్లా ఉన్నారోననే ఆరాటం తమ ఊరి
దిక్కుగా కాలినడకన సాగిపోయేలా చేసింది. కన్నీళ్లు మూటగట్టుకుని కట్టుబట్టలతో, ఎర్రటి ఎండల్లో చెప్పుల్లేని
కాళ్లతో వందలాది మైళ్ళు సాగిన వారి ప్రయాణాన్ని ప్రపంచమంతా చూసింది. అలుపెరుగని వారి నడకను
చూస్తున్నవారు దుఃఖంలో తడసిపోయారు. వ్యవస్థల పనితీరుమీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్య
పాలనలో ఇదొక విషాద మరక. ఇలాంటి వలస జీవుల వేదన గురించి కవి మూడు కవితల్లో ప్రస్తావిస్తారు.
“నా నడకగురించే/ఆలోచిస్తున్నానుగానీ
తిండిలేక కూలీలు/వందలాది మైళ్ళు నడిచే
సామూహిక దృశ్యం గుర్తొచ్చి
ఇప్పుడు/నిజంగా రక్తం వేడెక్కింది
సిగ్గుతో ఇంటివైపు మళ్ళాను
ఇవాళ ఇంట్లో కూర్చుంటే
ఇల్లులేనివాళ్ళు గుర్తుకొస్తున్నారు.
తిండికోసం కండలు కరిగించే
కష్టజీవులు కళ్ళలో మెదుల్తున్నారు”
ఏ విపత్తులోనైనా, సంక్షోభంలోనైనా మన గురించి మనకు ఎంత తాపత్రయముంటుందో,
తోటివారిపట్ల అంతే సహానుభూతి ఉండాలి. ఎవరో అన్నట్లు ‘మొదటిసారి మనిషి తన తోటివాడు బాగుండాలని
కోరుకునేలా చేసింది కరోనా వైరస్’. తోటివాడికి కష్టం వస్తే మాత్రం ఆదరించలేని దారుణమైన పరిస్థితులలో మనం
ఉన్నాం. అదే జీవన విషాద విరోధాభాస. అయితే మహమ్మారి బారినపడినవారిని ఆదరించలేకపోయినా పాజిటివ్
వచ్చినవారిని నెగిటివ్ గా చూడరాదని, వారు వైరస్ నుండి నెగిటివ్ గా వెలికి వచ్చేలా ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని
అందించాలి అంటారు కవి.
“మనకు రాలేదు కదా/అనే శాడిజం వద్దు
మనం దొరకలేదంతే/వైరస్ ను పాజిటివ్ గా చూడండి
నెగిటివ్ ప్రభలతో/వెలికి వస్తారు చూస్కోండి” గోపిగారు కరోనా సందర్భంలో రాసిన కవితలన్నింటినీ ఒకేసారి పరిశీలిస్తే నాటి పరిస్థితులలోని అన్ని
విషాద కోణాలను వారు స్పృశించినట్లు అర్ధమవుతుంది. అయితే తన పరిశీలనను, తన దృష్టికోణాన్ని, తన కవితా
అభివ్యక్తి నిపుణతను ప్రకటించడానికి వారు ఈ కవితలను రాయలేదు. ఆ వాతావరణ తీవ్రతలోని వేదనోద్వేగాన్ని
తట్టుకోలేని అనివార్యస్థితిలోంచి ఉబికి వచ్చింది ఈ కవిత్వం. లోక్ డౌన్ రోజులలో తన చుట్టూ ఆవరించిన
నిశబ్దాన్ని బద్దలు కొట్టడానికి, తన ఒంటరితనం నుండి బయటకు రావడానికి కవి చేసిన ప్రయత్నంగానూ ఈ
కవితలను మనం చూడవచ్చు.
కవి ఈ కరోనా విపత్తు కాలాన్ని చూస్తూ కృంగిపోలేదు. కవిత్వ రచనలోంచి ఒక ఇమ్యూనిటీ పవర్ ను
సమకూర్చుకున్నాడు. ఆ శక్తిని తన వరకే పరిమితం చేసుకోకుండా అందరికీ ఒక భరోసా వ్యాక్సిన్ ను తన కవిత్వం
ద్వారా పంచారు. భయ విహ్వలతలో మునిగిపోయిన లోకానికి కవిత్వంతో కరచాలనం చేస్తూ జీవన పోరాటం
చేయాలని విశ్వాసాన్ని అందిస్తారు.
“ప్రపంచం/ఎంత చిన్నదైపోయింది!
ఓ పురుగుకు లొంగిపోయింది.
విజ్ఞానమే దానిముందు/విన్నపాలు చేస్తున్నది.
యుద్ధం చేస్తే చెయ్యాలి గాని/వెన్ను చూపిస్తూ మాత్రం కాదు.
వివిధ భావధోరణులు/ ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి
కవిత్వమొక్కటే నిబ్బరంగా చెక్కుచెదరకుండా/ నిలబడి ఉంది” కవిత్వం అందించే శాశ్వత విలువలపై డా.ఎన్.గోపికి గాఢమైన నమ్మకం ఉంది. ఇటువంటి పెను ప్రళయ
కాలంలో మానవాళి ప్రాణభీతిని చూస్తూ ఏం చేయాలనే స్పష్టతతో ఉన్నారు. అందుకే “ఇది కీర్తి కోసం రాసినవి
కాదు. ఆర్తి వీటి రచనా హేతువని” కవి భావన. ఇది మనిషి విలువల సంపుటికి లిట్మస్ పరీక్ష లాంటి సమయమనే
ఆలోచన అంటూనే తన కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు. ఎన్.గోపి కవిత్వం వర్తమాన జీవితాన్ని విస్మరించదు.
సమకాలీన పరిణామాల్లో సామాన్యుడికి ఎదురయ్యే బాధలను గమనిస్తూనే ఉంటుంది. కవిగా వారి కన్నీటిని తన
చూపుడు వేలుతో తుడిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కవిత్వమంతా భూగోళాన్ని చుట్టుముట్టిన విషాదాన్ని
తరిమి వేసే పోరాటాన్ని చేసింది. ఒక భయానక వాస్తవాన్ని ఎదుర్కోవడానికి అందరం సామూహికంగా
చేయవలసిన ప్రణాళికలను కవిత్వ రూపంలో చెప్పారు కవి. “ఎంత సుదీర్ఘ రాత్రి అయినా ఉషస్సు రాక తప్పదు.
దానికోసమే మనందరం ఎదురు చూద్దాం” అన్న కవి ఎదురుచూపులు ఫలించాయి. నేడు మనమంతా మాస్కులు
లేని లోకంలో సంచరిస్తున్నాం. ఈ ఆర్కైవ్ కవిత్వం భావితరాలకు కవితా గుణ పాఠాలు.
డా.జె.నీరజ
అసోసియేట్ ప్రొఫెసర్
గవర్నమెంట్ సిటీ కాలేజీ
హైదరాబాద్
9848370018